Mancherial: గొంతు కోసుకుని యువకుడి బీభత్సం! తల్లి, అన్నపైనా దాడి
Telangana News: మంచిర్యాలలో ఓ వ్యక్తి బీభత్సం సృష్టించాడు. తల్లితో గొడవపడి ఆమెపై దాడి చేశాడు. అడ్డొచ్చిన సోదరుడ్నీ వదల్లేదు. ఆఖరికి హోంగార్డు గొంతు కూడా కోశాడు.
Mancherial Crime News: మంచిర్యాల జిల్లాలో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. తల్లి, సోదరుడిపై దాడి చేశాడు తన గొంతును కోసుకున్నాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. హోంగార్డుపై దాడి చేసి గొంతు కోసిన ఘటన మంచిర్యాల జిల్లాలో కలకలం సృష్టించింది.
మంచిర్యాల జిల్లా బీమిని మండలానికి చెందిన రాంటింకి శ్రీకాంత్ (28) వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. ఇటీవలే మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం రాత్రి మధ్యం మత్తులో ఉన్న శ్రీకాంత్ తన తల్లి పోశక్కతో భూమి పంపకం విషయంలో గొడవపడ్డాడు. మాటామాట పెరగడంతో బ్లేడుతో తల్లి చేతిని గాయపరిచాడు. ఈ క్రమంలో అన్నయ్య రాంటింకి శంకర్ అక్కడికి వచ్చాడు. తనపై దాడికి వస్తున్నాడేమోననే అనుమానంతో శంకర్ తలపై ఇనుప రాడ్డుతో కొట్టాడు అనంతరం శ్రీకాంత్ బ్లేడ్ తో గొంతు కోసుకున్నాడు.
స్థానికులు వెంటనే డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శంకర్ ను చికిత్స నిమిత్తం బెల్లంపల్లి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నిందితుడు శ్రీకాంత్ ను ప్రైవేటు వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో దారి మధ్యలో వెంబడి ఉన్న హోంగార్డు అశోక్ ను వెనుక నుంచి దాడి చేసి బ్లేడ్ తో గొంతు కోశాడు. తీవ్ర రక్త స్రావం కావడంతో హుటాహుటిన వారిని బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. అపై హోంగార్డు అశోక్ ను మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భీమిని మండల ఎస్సై విజయ్ కుమార్ పేర్కొన్నారు.