Mancherial Fire Accident: ఆరుగురు సజీవ దహనం కేసులో కీలక ఆధారాలు- వారం రోజులుగా రెక్కీ- రూ. 5 వేల పెట్రోల్ కొనుగోలు!
Mancherial Fire Accident: మంచిర్యాల జిల్లా గుడిపెల్లిలో ఆరుగురు సజీవ దహనం కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. నిందితులు 5 వేల రూపాయల పెట్రోల్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు.
Mancherial Fire Accident: మంచిర్యాల జిల్లా గుడిపెల్లి(వెంకటాపూర్)లో ఆరుగురు సజీవ దహనం అయిన కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఘటనా స్థలానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న సీసీసీ పెట్రోల్ బంక్ లో ముగ్గురు వ్యక్తులు ఐదు వేల రూపాయల పెట్రోల్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకున్నారు. లక్షెట్టిపేటకు చెందిన వ్యక్తి, ఉట్కూర్ కు చెందిన మరో వ్యక్తితోపాటు గోదావరిఖనిలో ఐదుగురు, ఆటోలో ఉన్న ఇద్దరు, గుడిపెల్లికి చెందిన వ్యక్తి మొత్తం పది మందిని మరిన్ని వివరాల కోసం విచారణ చేస్తున్నారు. లక్షెట్టిపేట, ఉట్కూర్ కు చెందిన ఇద్దరు మంచిర్యాలలోని ఓ లాడ్జిలో వారం రోజుల నుంచి ఉంటున్నారు. వారు పలుమార్లు రెక్కీ నిర్వహించిన అనంతరం ఈనెల 16వ తేదీన శ్రీరాంపూర్ కు చెందిన ఆటో మాట్లాడుకొని అప్పటికే సిద్ధం చేసుకున్న డబ్బాల్లో సీసీసీ బంక్ లో రాత్రి 9.54 గంటలకు పెట్రోల్ తీసుకున్నారు.
పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయిన దుండగులు
గుడిపెల్లికి చెందిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో దగ్గరి దారిలో కాకుండా రసూల్ పెల్లి మీదుగా గుడిపెల్లికి 15 కిలో మీటర్లు అదనంగా ప్రయాణించారు. మార్గ మధ్యలో మద్యం తాగిన వీరు రాత్రి 11.15 గంటలకు గుడిపెల్లి శివారుకు చేరుకున్నారు. 11.45 గంటల నుంచి 12.15 గంటల వరకు బాధితుల ఇంటికి ఉన్న రెండు తలుపుల నుంచి లోపల పెట్రోల్ గుమ్మరించారు. మంటలు రేగాక చుట్టు పక్కల వారు మేల్కొనడంతో పెట్రోల్ డబ్బాలను చింతచెట్టు కింద వదిలి వచ్చిన ఆటోలోనే పరారు అయ్యారు. అనంతరం లాడ్జికి చేరుకొని 17వ తేదీన అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఉట్కూర్ కు చెందిన వ్యక్తిపై ఇంతకు ముందే హత్య కేసు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి తల్లికి, మంటల్లో కాలిపోయిన వ్యక్తి తమ్ముడికి అక్రమ సంబంధం ఉండటంతో 15 సంవత్సరాల క్రితం ఆయనను హతమార్చినట్లు విచారణలో వెలుగు చూసింది.
వారి సమాచారాలు తెలుసుకునేందుకు గ్రామస్థుడితో ఒప్పందం..!
గుడిపెల్లికి చెందిన ఓ వ్యక్తి దుండగులకు సహకరించినట్లుగా పోలీసులు తేల్చారు. మాస పద్మ, శివయ్య దంపతులు, శాంతయ్య గ్రామంలో ఉన్నారా లేదా వారు ఎప్పుడు, ఎక్కడికి వెళ్తున్నారు వంటి విషయాలను ఎప్పటికప్పుడు చెప్పేందుకు ఓ వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెబుతున్నారు. అందుకోసం అతడికి మూడు లక్షల రూపాయలు కూడా ఇచ్చినట్లు వివరిస్తున్నారు. ఘటన జరిగిన రోజు పూటుగా తాగి ఉన్న ఆ వ్యక్తి ఇంట్లో ఎంత మంది ఉన్నారో కూడా తెలియకుండా.. ముగ్గురే ఉన్నట్లు వారికి సమాచారం ఇచ్చాడు. చుట్టం చూపుగా వచ్చిన మౌనిక, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలియక పెట్రోల్ పోసి నిప్పు అంటించడంతో... వీళ్లు కూడా చనిపోయారు. అయితే ఘటన జరిగిన మరుసటి రోజు ఉదయం కూడా ఈ వ్యక్తి అక్కడే ఉన్నట్లు పోలీసులు వివరిస్తున్నారు.
సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ
ప్రాణాలు కాపాడుకునేందుకు మృతులు ఎంతో కష్టపడ్డారు. మంటల్లో కాలిపోతుండగా... కిటికీలు, తలుపుల వద్దరకు వచ్చి మాంసపు ముద్దలుగా మారిపోయారు. అయితే ఈ ఘటనలో మౌనిత తన రెండేళ్ల కూతురు ప్రశాంతిని ఒడిలోనే ఉంచుకొని బూడిదైంది.తలుపు గడియ పెట్టి ఉండడంతో వారు బయటకు రాలేకపోయారు. అయితే శాంతయ్య శవం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలోనే ఉంది. ఆదివారం కూడా శవాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆయన కుటుంబ సభ్యులు అనుమానం ఉన్న ఇతర బంధువులను పోలీసులు గోదావరిఖనిలో అదుపుకలోకి తీసుకున్నారు. అయితే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఈ కేసును సమోటోగా స్వీకరించింది. ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపి 2023 జనవరి 27వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని రామగుండం పోలీసులు కమిషనర్ కు నోటీసులు జారీ చేసింది.