Mancherail News : భూవివాదంతో కుటుంబం గ్రామ బహిష్కరణ, ఎవరైనా మాట్లాడితే రూ.10 వేలు జరిమానా!
Mancherail News : మంచిర్యాల జిల్లాలో భూవివాదం కారణంగా ఓ కుటుంబాన్ని బహిష్కరించారు కులపెద్దలు. గ్రామంలో వీరితో ఎవరైనా మాట్లాడితే రూ.10 వేలు జరిమానా విధిస్తున్నారు.
Mancherail News : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకేనపల్లి గ్రామంలో ఓ కుటుంబం బహిష్కరణకు గురైంది. భూ వివాదంతో గ్రామ పెద్దలు తమ కుటుంబాన్ని బహిష్కంచారని బాధితులు ఆరోపిస్తున్నారు. గ్రామస్థులెవరూ తమతో మాట్లాడటం లేదని, దుకాణాలకు వెళ్లినా వస్తువులేమీ ఇవ్వడం లేదని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అసలేం జరిగింది?
మంచిర్యాల జిల్లాలో ఓ కుటుంబం బహిష్కకరణ గురైంది. బెల్లంపల్లి మండలం ఆకేనపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కుల పెద్దలు అదే కులానికి చెందిన కుటుంబాన్ని బహిష్కరించడం కలకలం రేపుతోంది. గ్రామంలో నెల రోజులుగా ఈ కుటుంబం ఆదరణకు నోచుకోవడంలేదు. బహిష్కరించిన కుటుంబంతో గ్రామస్తులెవరైనా మాట్లాడితే రూ.10 వేలు జరిమానా అంటూ కులపెద్దలు తీర్మానించారు. ఆకేనపల్లి గ్రామంలో ఓ భూ వివాదంలో తలెత్తిన గొడవ బహిష్కరణకు దారి తీసింది. బాధిత కుటుంబంలో ఒకరు చనిపోతే అంత్యక్రియలకు హాజరుకాకుండా గ్రామస్తులను అడ్డుకున్నారంటూ బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. బహిష్కరించిన కుటుంబానికి గ్రామంలో నిత్యావసర సరుకులు ఇవ్వొద్దంటూ కుల పెద్దలు హుకూం జారీ చేశారు. అయితే విషయమై బాధిత కుటుంబం గ్రామ సర్పంచ్, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎవరు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. తమని బహిష్కరించిన కుల పెద్దలపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
మాతో మాట్లాడితే రూ.10 వేలు జరిమానా
"మా అమ్మమ్మ చనిపోతే కుల పెద్దలు మాకు ఎవరూ సాయం చేయకుండా అడ్డుకున్నారు. మా అక్కాచెల్లెళ్ల సాయంతోనే నేనే అంత్యక్రియలు నిర్వహించాను. మాకు గ్రామంలో ఎవరూ సాయం చేయడంలేదు. దయచేసి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ప్రభుత్వం వేడుకుంటున్నాను. మాతో ఎవరు మాట్లాడినా రూ.10 వేలు జరిమానా వేస్తున్నారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను. ఎస్సై కూడా చెప్పాను కానీ పట్టించుకోవడంలేదు. ఎంత మందిని కలిసినా ఎవరూ సాయం చేయడంలేదు. కనీసం గ్రామంలోని దుకాణాల్లో వస్తువులు కూడా మాకు అమ్మడంలేదు"-బాధితులు
Also Read : Karimnagar Politics : కరీంనగర్ టీఆర్ఎస్ లో వర్గపోరు, రవీందర్ సింగ్ ను బహిష్కరించాలని డిమాండ్!
Also Read : Revanth Reddy : దిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ఇల్లు ఎందుకు సోదా చేయలేదు- రేవంత్ రెడ్డి