Mahabubabad News: ఎమ్మార్వోపై దాడి చేసిన గిరిజనులు, వైరల్ గా మారిన వీడియో - కారణం ఏంటంటే?
Mahabubabad News: మహబూబాబాద్ జిల్లాలోని తహసీల్దార్ ఇమ్మాన్యుయేల్ పై గిరిజనులు దాడి చేశారు. ఇదే విషయాన్ని ఎమ్మార్వో పోలీసులకు చెప్పగా.. హుటాహుటిన రంగంలోకి దిగి అతడిని కాపాడారు.
Mahabubabad News: మహబూబాబాద్ జిల్లాలో ఓ ఎమ్మార్వోపై గిరిజనలు దాడి చేశారు. ఓ వైపు వాళ్లు దాడి చేస్తుండగానే ఎమ్మార్వో పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఎమ్మార్వోను కాపాడారు. పోలీసులు వస్తున్నట్లు గమనించిన గిరిజనులు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. అయితే గాయాలపాలైన తహసీల్దార్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అసలేం జరిగిందంటే..?
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో ప్రభుత్వ స్థలం సర్వే నెంబర్ లో కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం కోసం భూసేకరణ సర్వేకు వెళ్లారు. అయితే సర్వే కోసం వెళ్లిన రెవెన్యూ అధికారులను గిరిజిన ప్రజలు అడ్డుకున్నారు. ఈక్రమంలో అధికారులకు, గిరిజనులకు మధ్య వాగ్వాదం చెలరేగింది. గొడవ ఎక్కువవుతుండడంతో.. రెవెన్యూ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఆ తర్వాత కాసేపటికి అక్కడే ఉన్న ఎమ్మార్వో ఇమాన్యుయల్ పై గిరిజనులు దాడి చేశారు. ఓ వైపు వారి చేత దెబ్బలు తింటూనే తహసీల్దార్ తన ప్రాణాలను రక్షించుకోవడం కోసం పోలీసులకు ఫోన్ చేశాడు. జరిగిన విషయం చెబుతూ వెంటనే వచ్చి కాపాడమని వేడుకున్నాడు. హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అయితే ఆ విషయం గుర్తించిన గిరిజనులు ఎమ్మార్వోనూ వదిలేసి పారిపోయారు. ముందుగా ఎమ్మార్వో ఇమ్మాన్యుయల్ ను మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం కోర్టు కాంప్లెక్స్ నిర్మాణ స్థలాన్ని హైకోర్టు జడ్జి పరిశీలించారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తహసీల్దార్ పై గిరిజనులు దాడి చేస్తుండగా.. అక్కడే ఉన్న పలువురు వీడియో తీశారు. దాన్ని నెట్టింట పోస్ట్ చేయగా.. స్థానికంగా వైరల్ గా మారింది. ఈ వీడియోను ఆధారంగా తీసుకొనే ఎమ్మార్వోపై దాడి చేసిన వారిని పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు.