Hyderabad News: చోరీ చేసే ముందు రెక్కీ - యూట్యూబ్ వీడియోలు చూసి ఎస్కేప్ ప్లాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో విస్తుపోయే విషయాలు
Crime News: గచ్చిబౌలిలో వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌ను పట్టుకున్న పోలీసులకు విచారణలో విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. నిందితుడు యూట్యూబ్ వీడియోలు చూసి ఎస్కేప్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Madhapur DCP Press Meet On Most Wanted Criminal Battula Prabhakar: హైదరాబాద్ గచ్చిబౌలిలోని (Gachibowli) ప్రిజం పబ్‌లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌ను (Battula Prabhakar) పోలీసులు శనివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నిందితున్ని పట్టుకునే క్రమంలో పోలీసులపైకి కాల్పులు జరపగా.. ఓ కానిస్టేబుల్ సహా పబ్ బౌన్సర్‌కు గాయాలయ్యాయి. ఈ క్రమంలో ప్రభాకర్‌ను విచారించిన పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ మేరకు డీసీపీ వినీత్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితుడు బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డి నివాసంలో పోలీసులు తనిఖీ చేయగా.. 428 తూటాలు దొరికాయని తెలిపారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు సోదాలు చేసినట్లు వివరించారు.
'80 కేసుల్లో నిందితుడు'
చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ పాత నేరస్థుడని.. తెలుగు రాష్ట్రాల్లో 80 కేసుల్లో నిందితుడని డీసీపీ వినీత్ తెలిపారు. '2022 మార్చిలో విచారణ నిమిత్తం ఏపీలోని అనకాపల్లి కోర్టుకు తీసుకెళ్లిన సమయంలో తప్పించుకుపోయాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. శనివారం రాత్రి గచ్చిబౌలి పబ్‌లో ఉన్నాడన్న విశ్వసనీయ సమాచారం మేరకు పట్టుకునేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌పై కాల్పులు జరిపాడు. హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి కాలికి బుల్లెట్ గాయం అయ్యింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని 2 తుపాకులు, 23 తూటాలు సీజ్ చేశాం. 2013 నుంచి ప్రభాకర్ నేరాలు చేయడం మొదలుపెట్టాడు.' అని పేర్కొన్నారు.
యూట్యూబ్ వీడియోలు చూసి..
ప్రభాకర్ తెలంగాణలో 11, ఏపీలో 12 కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నట్లు డీసీపీ వినీత్ తెలిపారు. 'తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రా, తెలంగాణలో నేరాలకు పాల్పడ్డాడు. ఇళ్లల్లో చోరీ చేయడం రిస్క్ అని శివార్లలో ఉండే విద్యాలయాల్లో చోరీ చేస్తాడు. దొంగతనం చేసే ముందు రెక్కీ నిర్వహిస్తాడు. పోలీసులకు చిక్కకుండా ఎలా తప్పించుకోవాలో యూట్యూబ్ వీడియోలు చూస్తాడు. గతంలో జైల్లో ఉన్నప్పుడు ఓ ఖైదీతో గొడవ పడి కక్ష పెంచుకున్నాడు. అతన్ని చంపాలని జైల్లో పరిచయమైన ఖైదీల సహకారంతో బీహార్‌లో గన్ కొనుగోలు చేశాడు. గన్ కొనుగోలు చేయడానికి, నేరాలు చేయడానికి సహకరించిన వారందరినీ అరెస్ట్ చేస్తాం. ప్రభాకర్ ఇప్పటివరకూ 66 కేసుల్లో అరెస్టయ్యాడు. 8 నెలల క్రితం నుంచి తుపాకులు వాడుతున్నాడు.' అని డీసీపీ వెల్లడించారు.
ఇదీ జరిగింది
హైదరాబాద్‌లోని మొయినాబాద్, నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన చోరీలకి సంబంధించి విచారణ చేపట్టిన అధికారులు.. ఘటనాస్థలిలో లభించిన వేలిముద్రలు, సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ కేసులో అనుమానితుడు 2023 నుంచి పరారీలో ఉన్న ఓ కరడుగట్టిన నేరస్థుడు బత్తుల ప్రభాకర్‌గా నిర్థారించారు. నిందితుడి కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు.. ప్రభాకర్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌కు వస్తాడని తెలుసుకుని ఐటీ కారిడార్‌లోని పబ్‌ల సిబ్బంది, బౌన్సర్లకు నిందితుడి ఫొటోలిచ్చి ఆచూకీ తెలిస్తే సమాచారమివ్వాలని సూచించారు.
శనివారం సాయంత్రం నిందితుడు పబ్‌కు వచ్చాడని తెలుసుకుని అక్కడికి వెళ్లి పట్టుకునేందుకు యత్నించగా పోలీసులపైనే కాల్పులకు తెగబడ్డాడు. రెండు రౌండ్ల కాల్పులు జరపగా.. సీసీఎస్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డితో పాటు ఓ బౌన్సర్‌కు గాయాలయ్యాయి. అయినప్పటికీ పోలీసులు ప్రభాకర్‌ను చాకచక్యంగా పట్టుకున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

