Kukatpally husband murdered: పోలీసులకు చెప్పినా ప్రాణం కాపాడుకోలేకపోయిన భర్త - భార్య ఇలా సింపుల్‌గా చంపేసింది - కూకట్‌పల్లిలో ఘోరం
Kukatpally Murder: హైదరాబాద్లో ఓ భర్తను భార్య చంపేసింది. వివాహేతర బంధానికి అడ్డుగా వస్తున్నాడని ఈ పని చేసింది. పోలీసులకు చిక్కింది.

Wife killed husband: తన భార్య వివాహేతర బంధం పెట్టుకుందని తనను చంపడానికి ప్రయత్నిస్తోందని ఓ భర్త వారం కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారంలో ఆ భర్త శవమైపోయాడు. పోలీసులు సీరియస్ గా తీసుకోకపోవడంతో భార్య ఓ రాత్రి నిద్రలో ఉండగానే భర్త మెడకు చున్నీ చుట్టి హత్య చేసింది. ఆ భర్త పేరు సుధఈర్ రెడ్డి
కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ పరిధిలో వెలుగుచూసిన సుధీర్ రెడ్డి హత్య కేసులో సంచలన నిజాలు బయటకు వచ్చాయి. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్య ప్రసన్న, తన భర్తను అత్యంత క్రూరంగా హత్య చేసింది. గత నెల 24న జరిగిన ఈ ఘటనను మొదట సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ, పోలీసుల లోతైన విచారణలో అసలు నిజం నిగ్గుతేలింది. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే చున్నీతో ఉరేసి చంపినట్లు ప్రసన్న పోలీసుల ముందు అంగీకరించింది.
ఈ హత్య వెనుక ఉన్న క్రైమ్ యాంగిల్ పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది. తన భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న సుధీర్ రెడ్డి, ఆమె వల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని హత్యకు వారం రోజుల ముందే పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్య తనను చంపేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నప్పటికీ, అప్పట్లో అది దంపతుల గొడవల కింద భావించి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అయితే, భర్త తనను నిరంతరం గమనిస్తున్నాడని, తన వ్యక్తిగత సంబంధాలకు ఆటంకం కలిగిస్తున్నాడని భావించిన ప్రసన్న, పక్కా పథకం ప్రకారం ఆయన నిద్రిస్తున్న సమయంలో చున్నీతో గొంతు బిగించి ప్రాణాలు తీసింది.
హత్య జరిగిన తర్వాత ఏమీ తెలియనట్లుగా ప్రసన్న ప్రవర్తించింది. అనారోగ్యం వల్లే సుధీర్ రెడ్డి మరణించాడని బంధువులను నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ, సుధీర్ రెడ్డి గతంలో ఇచ్చిన ఫిర్యాదు, మృతదేహంపై ఉన్న గుర్తులను గమనించిన పోలీసులు పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా ఆమెను నిలదీశారు. పోలీసుల ఇంటరాగేషన్‌లో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడం, చివరకు నేరాన్ని ఒప్పుకోవడంతో అసలు మర్డర్ మిస్టరీ వీడింది. ఈ కిరాతకానికి పాల్పడిన ప్రసన్నను అరెస్ట్ చేసిన పోలీసులు, ఆమెను రిమాండ్ నిమిత్తం సంగారెడ్డిలోని కంది జైలుకు తరలించారు.
నగరంలో వరుసగా జరుగుతున్న ఇటువంటి సంఘటనలు వివాహ బంధాలపై ఆందోళన కలిగిస్తున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా పచ్చని సంసారాలు కూలిపోవడమే కాకుండా, క్షణికావేశంలో చేస్తున్న హత్యలు కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. సుధీర్ రెడ్డి మరణంతో వారి కుటుంబం దిక్కులేనిదవ్వగా, నిందితురాలు ప్రసన్న ఇప్పుడు జైలు పాలైంది. ఈ కేసులో ఆమెకు సహకరించిన వారు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు.





















