Khammam Crime News: బాలుడిపై టీచర్ లైంగిక వేధింపులు, కేసు నమోదుతో పరువుపోయిందని ఆత్మహత్య
Telangana News | ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన జరిగింది. విద్యాబుద్దులు నేర్పించాల్సిన టీచర్ ఓ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం బయటకురావడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

Khammam Crime News: కొణిజర్ల: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో దారుణం జరిగింది. ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలుడిపై టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం బయటకు రావడం, తనపై కేసు నమోదు కావడంతో భయాందోళనకు గురైన టీచర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
అసలేం జరిగింది..
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలోని ఓ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న బాలుడు దసరా సెలవులు రావడంతో ఇంటికి వెళ్లాడు. సెలవులు పూర్తయినా విద్యార్థి తిరిగి స్కూలుకు వెళ్లనని తల్లిదండ్రులకు చెప్పాడు. మంచిగా చదువుకోవాలని, అలా అనకూడదని వారు సూచించారు. కానీ స్కూలుకు తిరిగి వెళ్లేది లేదని బాలుడు పదేపదే చెప్పడంతో వారు కారణం అడగగా, కుమారుడు చెప్పిన విషయం విని తల్లిదండ్రులు షాకయ్యారు.
మధిరకు చెందిన టీచర్ ప్రభాకర్ రావు లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నాడని బాలుడు చెప్పాడు. గత మూడు సంవత్సరాలుగా అదే స్కూళ్లో పనిచేస్తున్న ప్రభాకర్ రావు తనను లైంగికంగా వేధిస్తున్నాడని చెబుతూ బాలుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీచర్ ప్రభాకర్ రావు మీద ఎస్ఐ సూరజ్ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
పరువు పోయిందని టీచర్ ఆత్మహత్య
బాలుడికి వేధింపుల వ్యవహారంపై ప్రిన్సిపల్ సోమవారం నాడు టీచర్ ప్రభాకర్ రావును మందలించారు. టీచర్ రాజీనామా చేసి వెళ్లిపోయాడు. కానీ తనపై పోక్సో కేసు నమోదైన విషయం తెలుసుకుని భయాందోళనకు గురయ్యాడు. పరువు పోతుందని తీవ్ర మనోవేదనకు గురై పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రాథమిక వైద్య అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా సోమవారం ప్రభాకర్ రావు మృతిచెందాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.






















