Karnataka Fake Temple Website: ఈ ఆలయ పూజారులు చేసిన పనికి షాకైన అధికారులు, ఏకంగా రూ.20 కోట్లకు టోకరా
కర్ణాటకలో ఓ ఆలయ పూజారులు 8 నకిలీ సైట్లు సృష్టించి భారీ మొత్తంలో విరాళాలు సేకరించారు. రూ. 20కోట్లతో పరారయ్యారు.
నకిలీ సైట్లు సృష్టించి..విరాళాలు సేకరించి..
కర్ణాటకలోని కలబుర్గి జిల్లాలో దేవలగనపూర్ ఆలయానికి చెందిన పూజారులు భారీ మోసానికి పాల్పడ్డారు. ఆలయం పేరిట నకిలీ
వెబ్‌సైట్లు సృష్టించి పెద్ద మొత్తంలో భక్తుల నుంచి విరాళాలు సేకరించారు. అలా వచ్చిన డబ్బుని తమ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల్లోకి మళ్లించారు. ఉత్తర కర్ణాటకలో అఫ్జల్‌పూర్ తాలూకాలో గనగపూర్ నది తీరాన ఉంది ఈ ఆలయం. స్థానిక భక్తులతో పాటు, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి ఈ ఆలయానికి తరలి వెళ్తుంటారు. శ్రీ దత్తాత్రేయ స్వామి తాము కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తులు విశ్వసిస్తారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...ఈ ఆలయ పూజారులు దాదాపు 8 నకిలీ వెబ్‌సైట్లు సృష్టించారు. అవి దత్తాత్రేయ దేవాలయ్, గనగపుర్ దత్తాత్రేయ టెంపుల్, శ్రీ క్షేత్ర దత్తాత్రేయ టెంపుల్ పేరిట ఉన్నాయి. నాలుగేళ్లలో ఈ సైట్‌లు క్రియేట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ నాలుగేళ్లలో భక్తుల నుంచి సేకరించిన విరాళాల మొత్తాన్ని లెక్కించిన పోలీసులు కంగుతిన్నారు. ఆ విలువ మొత్తం రూ. 20కోట్లు. ఈ డబ్బుని క్రమంగా తమ ఖాతాల్లో జమ చేసుకున్నారు.
ఒక్కొక్కరి నుంచి రూ.10-50వేలు వసూలు
రకరకాల పూజా కార్యక్రమాలు పేరు చెప్పి ఒక్కో భక్తుడి నుంచి రూ. 10-50 వేల వరకూ వసూలు చేశారు. రాష్ట్రంలోని ముజురై డిపార్ట్‌మెంట్ పరిధిలో ఉంది ఈ ఆలయం. కలబుర్గి డిప్యుటీ కమిషనర్ యశ్వంత్ గురుకర్..ఈ ఆలయ అభివృద్ధి కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే గురుకర్ ఓ ఆడిట్ మీటింగ్ నిర్వహించగా ఈ బండారం అంతా బయటపడింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదయ్యేంత వరకూ నిందితులు ఊళ్లోనే ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. సైబర్ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించగా...దాదాపు 2వేల మంది భక్తుల నుంచి పూజారులు విరాళాలు సేకరించినట్టు తేలింది. ఒక్కొక్కరికీ ప్రత్యేకంగా రిసీట్ కూడా ఇచ్చారట. వాటిపై ఒక్కో పూజారి నంబర్ కూడా ప్రింట్ చేశారట. ఆలయ హుండీలో నుంచి కూడా డబ్బులు దొంగిలించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ అనుమానం కూడా నిజమైంది. హుండీని లెక్కించే రోజుల్లో సీసీటీవీ పని చేయకుండా చేశారు నిందితులు. పరారీలో ఉన్న వారిని పోలీసులు గాలిస్తున్నారు.
మీటింగ్ పెట్టేంత వరకూ తమకు ఏమీ తెలియదని,ఆడిటింగ్ చేస్తున్న సమయంలో లెక్కల్లో తేడా వచ్చిందని అంటున్నారు అధికారులు. భారీగా తేడా వచ్చాక కానీ తమకు ఏదో గోల్‌మాల్ జరిగిందని అర్థం కాలేదని అంటున్నారు. భక్తుల విశ్వాసాలతో ఆటలాడే అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడంటే ఇదేనేమో.
Also Read: Sita Ramam Teaser: కశ్మీర్ కొండల్లో ఒంటరి సైనికుడికి ప్రేమలేఖ - ఎవరా అజ్ఞాత ప్రేయసి?