Kanpur Accident: అదుపుతప్పిన ఎలక్ట్రిక్ బస్సు.. ఐదుగురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు
ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి.
ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఎలక్ట్రిక్ బస్ కంట్రోల్ తప్పి పలు వాహనాలపైకి దూసుకెళ్లిన ఘటనలో మొత్తం ఐదుగురు మృతి చెందారు.
ఏం జరిగింది?
కాన్పుర్‌లోని టాట్ మిల్ కూడలి సమీపంలో ఓ ఎలక్ట్రిక్ బస్సు అదుపు తప్పి అక్కడే ఉన్న మూడు కార్లు, పలు బైక్‌లపైకి దూసుకెళ్లింది. ఘటన జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తూర్పు కాన్పుర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రమోద్ కుమార్ వెల్లడించారు.
సంతాపం..
ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. క్షతగాత్రులకు ప్రభుత్వమే చికిత్స అందిస్తుందని హామీ ఇచ్చారు.
ఘటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా తన సంతాపాన్ని తెలిపారు.