Pithapuram News : పిఠాపురంలో దారుణ హత్య, భార్యను కాపురానికి పంపలేదని అత్తపై అల్లుడు దాడి
Pithapuram News : కాకినాడ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యను కాపురానికి పంపడంలేదని అత్తను అల్లుడు కత్తితో నరికి చంపాడు.
Pithapuram News : కాకినాడ పిఠాపురం విద్యుత్ నగర్ లో దారుణ హత్య జరిగింది. అత్తపై అల్లుడు సైతన రమేష్ కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో అత్త గండేపల్లి రమణమ్మ(46) అక్కడికక్కడే మృతి చెందింది. దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన రమణమ్మ భర్త సత్యన్నారాయణ, కొడుకు దిలీప్ కు తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని 108లో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గత ఆరునెలలుగా భార్య దివ్యను కాపురానికి పంపలేదని అక్కసుతో ఉదయాన్నే ఇంటి బయట కాపు కాసిన రమేష్ కత్తితో అత్తపై దాడి చేసినట్లు తెలుస్తోంది. అతడి భార్య దివ్య ఉద్యోగం నిమిత్తం గత రాత్రే హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం. హత్య చేసి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి నిందితుడు రమేష్ లొంగిపోయాడు.
(రక్తపు మడుగులో అత్త, బావమరిది)
ప్రేమ వ్యవహారంతో
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో దారుణ ఘటన జరిగింది. చింటూ అనే విద్యార్థిపై రోహన్ అనే మరో విద్యార్థి కత్తితో దాడి చేశాడు. చింటూకు రక్తం కారుతుంటే రోహన్ సెల్ఫీ దిగాడు. ప్రేమ వ్యవహారమే ఇద్దరి మధ్య గొడవకు కారణంగా తెలుస్తోంది. రోహన్, అతని స్నేహితులు చింటూను బైక్ ఎక్కించుకొని మంగవారం రాజేంద్రనగర్‌లోని మూసీనది వద్దకు తీసుకెళ్లారు. ఆ తర్వాత చింటూని కత్తితో పొడిచి పరారయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు కేసు బదిలీచేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
రూపాన్ని ఎగతాళి చేశాడని
ఈ ఘటన పిల్లల మానసిక పరిస్థితికి అద్ధం పడుతోంది. తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో శనివారం జరిగి ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తన రూపాన్ని ఎగతాళి చేస్తూ ఏడిపిస్తున్నారనే కారణంతో ఓ విద్యార్థి తన తోటి విద్యార్థిని హత్య చేశాడు. 12వ క్లాస్ చదువుతున్న విద్యార్థిని ఆడపిల్ల అని బాధితుడు పిలిచేవాడు. అలా పిలవొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో చివరికి అతడిని హత్య చేశాడు. రూపాన్ని అవమానించేలా బాధిత విద్యార్థి మాట్లాడేవాడని పోలీసులు తెలిపారు. పార్టీ ఇస్తానని చెప్పి కొడవలి, కత్తిని ఉపయోగించి తోటి విద్యార్థిని హత్య చేశాడని వివరించారు. స్కూల్ కు దగ్గర్లోని హైవేపై ఈ హత్య జరిగిందని తెలిపారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేశామన్నారు. మైనర్ కావడంతో అబ్జర్వేషన్ హోంకు పంపించామన్నారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.
విద్యార్థుల ప్రవర్తనలో మార్పులు
తమిళనాడు స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ మెంబర్ డాక్టర్ శరణ్య ఈ ఘటనపై స్పందించారు. భౌతిక రూపాన్ని ఎగతాళి చేయడంతో విద్యార్థి కోపం పెంచుకుని, ఒత్తికి లోనై దాడికి పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. కోపం, ఒత్తిడి పెరిగి డిస్‌మోర్ఫిక్ అనే మానసిక వ్యాధికి దారితీసిందన్నారు. తన రూపం గురించి ఆలోచించడం కూడా ఈ వ్యాధి లక్షణమన్నారు. అది తీవ్ర కోపం లేదా ఒత్తిడిగా మారిపోయాయన్నారు. ఈ ఘటన విద్యార్థుల ప్రవర్తనలో మార్పును గుర్తుచేస్తుంది. ఇలాంటి ఘటనలు ఇటీవల తరచూ వెలుగుచూస్తున్నాయి. తరగతి గదుల్లో ఉపాధ్యాయులను టార్గెట్ చేయడం, ధూమపానం, మద్యపానానికి సంబంధించిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. కరోనా కారణంగా దాదాపు రెండేళ్లపాటు విద్యార్థులు సామాజిక ప్రవర్తనకు దూరంగా ఉండడం ప్రభావం చూపుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.