Anantapur News: అనంతపురంలో భారీ అగ్ని ప్రమాదం - జేసీ దివాకర్‌రెడ్డికి భారీ నష్టం
Anantapur News:అనంతపురంలో జరిగిన అగ్ని ప్రమాదం భారీ నష్టాన్ని మిగిల్చింది. జేసీ దివాకర్ రెడ్డికి చెందిన బస్‌లు దగ్ధమయ్యాయి.
Anantapur News: అనంతపురం నగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న జెసి దివాకర్ రెడ్డి ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు పార్కింగ్ డిపోలో మంటలు చెలరేగాయి. బస్సులపైన వెళ్లిన 11కేవి హెవీ లైన్ విద్యుత్ వైరు తెగిపోవడంతో ఈ మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉన్న బస్సులకు మంటలు అంటుకొని పలు వాహనాలు దగ్దమయ్యాయి.
ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడుతుండటం, దట్టమైన పొగలు చుట్టుపక్కలకు వ్యాపించాయి. దీంతో స్థానికులు భయభ్రాంతాలకు గురయ్యారు. ప్రమాదం గురించి పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వాళ్లు వచ్చేసరికి బస్సులు మంటలకు కాలిబూడిదవుతున్నాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని.. సహాయక చర్యలు ప్రారంభించారు. మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.
ఈ ప్రమాదంలో ఒక బస్సు కాలిపోగా మరో బస్సు పాక్షికంగా దెబ్బతింది. అయితే ఎలాంటి ప్రాణం నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే మరికొన్ని బస్సులు పార్కింగ్ చేసి ఉన్నాయి. అయితే మంటలు వ్యాపించినప్పుడే అగ్నిమాపక సిబ్బంది ఆర్పి వేశారు. దీంతో పెద్ద ఆస్తి, ప్రాణం నష్టం తగ్గింది.
పెళ్లకూరులో అగ్ని ప్రమాదం
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెన్నేపల్లిలో ఉన్న ఎమ్మెస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో బుధవారం రాత్రి 10 గంటల 15 నిమిషాలకు భారీ పేలుడు సంబవించింది. భారీ శబ్దంతో కూడిన పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురై ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. ఎమ్మెస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో బాయిలర్ అగ్ని ప్రమాదానికి గురవడంతో జరిగిన పేలుడు సంఘటనతో పెన్నేపల్లి గ్రామ ప్రజలు బిక్కు, బిక్కుమంటూ భయాందోళనలో ఉన్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో అన్న ఆందోళన వారిని భయపెడుతుంది. పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. భారీ పేలుడు సంభవించడంతో పరిశ్రమలోని పలువురికి గాయాలు అయినట్లు తెలిసింది. నెల్లూరు, నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రులకు క్షతగాత్రులను తరలించడం జరిగింది