Hyderabad: విడాకులిచ్చినా వదలని మాజీ భర్త.. దగ్గరి బంధువుతో అఫైర్.. కొడుకును తీసుకెళ్లడంతో..
విడాకులు ఇచ్చినా భర్త వేధిస్తుండడం, అవి రోజురోజుకూ ఎక్కువ అవుతుండటంతో మహిళ ప్రాణాలు తీసుకుంది. తన కుమారుడిని తీసుకువెళ్లి పంపకపోవడం వల్ల కూడా ఆమె మనస్తాపం చెందినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. విడిపోయి వేరుగా ఉంటున్న మాజీ భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. విడాకులు ఇచ్చినప్పటికీ కూడా భర్త వేధిస్తుండడం, అవి రోజురోజుకూ ఎక్కువ అవుతుండటంతో మహిళ ప్రాణాలు తీసుకుంది. అంతేకాక, తన కుమారుడిని తీసుకువెళ్లి పంపకపోవడం వల్ల కూడా ఆమె మనస్తాపం చెందినట్లుగా పోలీసులు చెబుతున్నారు. దీంతో మహిళ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వివరాలు వెల్లడించారు. స్థానిక హుడా కాలనీకి చెందిన షహజా బేగం అనే 25 ఏళ్ల మహిళ, ఎంఎం పహాడీకి చెందిన షేక్ ఇమ్రాన్ అనే 29 ఏళ్ల వ్యక్తికి నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. షేక్ ఇమ్రాన్ స్థానికంగా హార్డ్‌వేర్ దుకాణం నడుపుతున్నాడు. ఇతనికి తమ దగ్గరి బంధువుల మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. దీంతో ఏడాది క్రితం షహజా బేగం రెడ్‌హ్యాండ్‌గా వారిని పట్టుకొంది.
అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండగా.. ఆరు నెలల క్రితం భర్త షేక్ ఇమ్రాన్ భార్యపై హత్యాయత్నం చేశాడు. పాలల్లో విషం కలిపి షహజా బేగంతో తాగించాడు. దీంతో అస్వస్తతకు గురైన షహజా బేగంను ఆసుపత్రికి తరలించగా వారం రోజుల పాటు చికిత్స పొంది ఇంటికి వచ్చింది. ఆ సమయంలో భర్తపై రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి కేసు పెట్టింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. స్థానిక పెద్దల జోక్యంతో కేసు విత్ డ్రా చేసుకున్న షహజా బేగం పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే 3 నెలల క్రితమే విడాకులు పొందింది.
ఇదిలా ఉండగా.. 10 రోజుల క్రితం కొడుకును భర్త షేక్ ఇమ్రాన్ తీసుకెళ్లిపోయాడు. తిరిగి షాజాహ బేగంకు అప్పగించలేదు. బతిమాలినా కూడా కుమారుడ్ని ఇవ్వలేదు. దీంతో మనస్తాపం చెందిన షాహజా బేగం పుట్టింట్లోనే ఉరి వేసుకొని మృతి చెందింది. తల్లిదండ్రులు రాజేంద్ర నగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బుధవారం రాత్రి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.