Cyber Attack: మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్‌పై సైబర్ అటాక్.. ప్లాన్ ప్రకారం ఖాతాలు తెరిచి రూ.12 కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్లు
Mahesh Cooperative Bank Server Hacked: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే మహేష్ బ్యాంకుపై సైబర్ దాడి జరిగింది. సర్వర్ ని హ్యాక్ చేసిన నిందితులు 12 కోట్ల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు.
Mahesh Cooperative Bank Server Hacked: టెక్నాలజీ పెరిగేకొద్దీ దాని వాడకం ఎలా ఉంటుందనే దానిపై పర్యావసనాలు ఆధారపడి ఉంటాయి. సాంకేతికతతో మరింత ముందుకు వెళ్లాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తుంటాయి. కానీ కొందరు తమ తెలివితేటలతో డెవలప్‌మెంట్ పనులకు కాకుండా బ్యాంకుకు కన్నం వేసే ప్లాన్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఓ కోఆపరేటివ్ బ్యాంకులో భారీ సైబర్ మోసం జరిగింది.
మహేష్ కోఆపరేటివ్ బ్యాంకుపై సైబర్ నేరగాళ్లు అటాక్ చేశారు. మహేష్ బ్యాంక్ సర్వర్ ని హ్యాక్ చేసిన నిందితులు 12 కోట్ల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. బ్యాంకు అధికారుల ప్రమేయం లేకుండానే ఇటీవల తెరిచిన మూడు కరెంట్ ఖాతాల్లోకి చెస్ట్ ఖాతా నుంచి హ్యాకర్లు రూ.12 కోట్ల నగదు బదిలీ చేసుకున్నారని గుర్తించారు. దీనిపై మహేష్ బ్యాంక్ యాజమాన్యం ఫిర్యాదుతో సిటీ సైబర్ క్రైమ్ (CCS Police) పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ముందుగా ఖాతాలు తెరిచి..
హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రధాన కార్యాలయంగా ఉన్న మహేష్ కోఆపరేటివ్ బ్యాంకుకు రాష్ట్రంలో పలు శాఖలు ఉన్నాయి. వీటి ప్రధాన సర్వర్ బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ కార్యాలయం కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు జరుగుతుంటాయి. అయితే బ్యాంకుకు కన్నం వేసేందుకు కొన్ని రోజుల కిందటే భారీ ఎత్తున హ్యాకర్లు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సైబర్ దాడికి కొన్ని రోజుల ముందు తెరిచిన కరెంట్ అకౌంట్లలోకి కోట్ల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. అంటే స్థానికుల సాయంతో సిద్ధిఅంబర్‌బజార్, అత్తాపూర్ బ్రాంచ్‌లలో మహేష్ బ్యాంకులో నిందితులు ప్లాన్ ప్రకారం బ్యాంకు ఖాతా తెరిచారు. కొన్ని రోజుల్లోనే బ్యాంకుకు తెలివిగా కన్నం వేశారు.
బ్యాంకుకు హాలిడే.. వీకెండ్ టార్గెట్..
కొన్ని రోజుల కిందట మూడు కరెంట్ అకౌంట్స్ తెరిచారు. ఈ క్రమంలో సగదు లావాదేవీలు చేసేందుకు సూపర్ అడ్మిన్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఇతరత్ర కీలక వివరాలు సేకరించారు. శని, ఆదివారాల్లో బ్యాంకు పని చేయని టైమ్ చూసుకుని ఆ రెండు రోజుల్లోనే సైబర్ నేరగాళ్లు మహేష్ బ్యాంకుపై సైబర్ దాడి చేశారు. మొదటగా తాము ఇటీవల తెరిపించిన మూడు కరెంట్ అకౌంట్లకు 12.4 కోట్ల రూపాయాలు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆపై సిక్కింలోని పలు బ్యాంకుల్లోని 120కి పైగా అకౌంట్లలోకి నగదును మళ్లించినట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. అనంతరం నగదును దాదాపుగా విత్ డ్రా చేసినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.
బ్యాంక్ సర్వర్‌ను ఎక్కడి నుంచి హ్యాక్ చేశారు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు నగదు ట్రాన్స్‌ఫర్ అయిన కొన్ని బ్యాంక్ అకౌంట్లను సైతం ఫ్రీజ్ చేయించారు. ఆ బ్యాంకు ఖాతాలు ఎవరికి, మొదట మూడు కరెంట్ అకౌంట్లు తెరిచిన వ్యక్తుల వివరాలపై ఆరా తీస్తున్నారు. దేశీయ హ్యాకర్లు ఈ పని చేశారా.. లేదా నైజీరియా లాంటి గ్యాంగ్‌లు సైబర్ నేరానికి పాల్పడ్డాయా అని అన్ని కోణాల్లో సీసీఎస్ పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు.
Also Read: Saidabad: పోలీసులు చేతులెత్తేసిన కేసును ఛేదించిన సామాన్యుడు... భార్యను వెతికిపట్టుకున్న భర్త...