Hit And Run Case: హైదరాబాద్‌లో కారు బీభత్సం, వరుస యాక్సిడెంట్లు చేసిన డ్రైవర్‌ను పట్టుకున్న ట్రాఫిక్ ఎస్సై
Hyderabad Crime News | హైదరాబాద్‌లో కారు బీభత్సం సృష్టించింది. జగద్గిరిగుట్ట, షాపూర్ లలో వరుస యాక్సిడెంట్లు చేసిన కారు డ్రైవర్‌ను పట్టుకున్న జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు.

Hit And Run Case in Hyderabad | హైదరాబాద్: నగరంలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లోని జగద్గిరిగుట్ట, షాపూర్ లలో ఓ కారు బీభత్సం సృష్టించింది. జగద్గిరిగుట్ట ఔట్ పోస్ట్ ప్రయాణికులను గుద్ది ఆపకుండా వెళ్లిన కారు.. షాపూర్ లో మరికొంతమందిని ఢీకొట్టింది. వరుస రోడ్డు ప్రమాదాలు చేసి దూసుకుపోతున్న కారును పోలీసులు చాకచక్యంగా అడ్డుకున్నారు. డ్రంకన్ డ్రైవ్ చేయగా మద్యం మత్తులో ఉన్నాడని తేలింది. స్థానికులు ఆవేశంతో డ్రైవర్ ను చితకబాదారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఓ కారు జగద్గిరిగుట్ట వద్ద కొందర్ని ఢీకొట్టింది. కారు ఆపేందుకు చూడగా దూసుకెళ్లింది. ఛేజ్ చేసి రాళ్లతో కొట్టినా కారును అందుకోలేకపోయారు. కొందరు ప్రయాణికులకు గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తరువాత షాపూర్ లోనూ మరికొన్ని వాహనాలను, ప్రజలను ఢీకొట్టి దూసుకెళ్తున్న కారు ఘటనపై జిడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్ఐ సందీప్ చాకచక్యంగా వ్యవహరించి కారును అడ్డుకున్నారు.
ట్రాఫిక్ సిగ్నల్ నిలిపివేసి, కారును ఆపి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. డ్రంకన్ డ్రైవ్ టెస్టులు చేయగా డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని తేలింది. ఆవేశానికి లోనైన ప్రయాణికులు ప్రమాదం చేసి పరారవుతున్న డ్రైవర్ ను చితకబాదారు. సూరారం పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి, కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. హ్యుండయ్ అమేజ్ కారు తమిళనాడులో రిజిస్ట్రేషన్ అయింది. ప్రమాదానికి కారణమైన కారు TN70 AS6815 అని పోలీసులు తెలిపారు.
మద్యం మత్తులో వాహనాలు నడిపి డ్రంకన్ కేసుల్లో చిక్కుకుంటే సమస్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఒకరి మద్యం మత్తు వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టివేస్తుంది. మద్యం సేవించిన సమయంలో ప్రత్యామ్నాయ డ్రైవింగ్ మార్గాలు చూసుకోవాలని, లేకపోతే క్యాబ్ లాంటివి బుక్ చేసుకుని ప్రయాణాలు చేయడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చు అని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.






















