Cyber Crime News: ర్యాష్ డ్రైవింగ్‌కు చలానా కట్టాలని మెసేజ్, ఆ కుర్రాడు చేసి తప్పు మీరూ చేయొద్దు
Cyber Crime News: ఫేక్ వెబ్ సైట్ల ద్వారా దోపిడీలకు పాల్పడుతున్నారు సైబర్ కేటుగాళ్లు.. అచ్చు గుద్దినట్లు పోలిన కొన్ని ప్రభుత్వ, బ్రాండెడ్ వస్తువుల నకిలి వెబ్‌సైట్లు సృష్టించి లూటీ చేస్తున్నారు.

Cyber Crime News:అమలాపురానికి చెందిన ప్రకాష్‌కు ఓ మెసేజ్ వచ్చింది. మీరు ఫలానా 216 జాతీయ రహదారిపై అత్యంత వేగంగా వాహనాన్ని నడిపారని, రూల్స్‌కు విరుద్ధంగా కారు డ్రైవ్ చేసినందుకు రూ.2000 పాతవి రూ.3,000 చెల్లించాలని ఆ సందేశం సారాంశం. ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఆ లింక్ క్లిక్ చేస్తే రోడ్డు అండ్ ట్రాన్స్‌పోర్ట్ వెబ్ సైట్ లోగోతో ఉన్న వెబ్‌సైట్‌కు డైరెక్ట్ అయింది. ఎప్పటికైనా కట్టాల్సిందే కదా అని యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించాడు. కానీ ఆ డబ్బులు చెల్లించినట్టు ఎటువంటి మెసేజ్ రాలేదు. తీరా అప్పుడు పరిశీలించి చూస్తే అది ఫేక్ వెబ్‌సైట్ అని తేలింది. అంతే లబోదిబోమంటున్నాడు.
కాకినాడకు చెందిన ఓ యువకునికి ఇటీవలే ఓ మేసేజ్ వచ్చింది. రూ.6,000 ఖరీదు చేసే క్రాక్స్ సగం ధరకే ఇస్తున్నట్టు ఆ సందేశంలో ఉంది. ఇంకో ఆలోచన లేకుండా నేరుగా వెంటనే లింక్‌ను క్లిక్ చేశాడు. ప్రొడక్ట్స్ కనిపించాయి. వెంటనే ఆర్డర్ పెట్టాడు. యూపీఐ ద్వారా పేమెంట్ చేశాడు. నార్మల్‌గా ఇలాంటి పేమెంట్స్ చేస్తే వెంటనే మీ ఆర్డర్ బుక్ అయిందని మెసేజ్ వస్తుంది. కానీ ఈసారి మాత్రం అలాంటిదేమీ రాలేదు. డౌట్ వచ్చి మరోసారి ఆ లింక్‌ను క్లిక్ చేస్తే నాట్ ఫౌండ్ అన్న మెసేజ్ వచ్చింది. దీంతో మోసపోయినట్టు గ్రహించాడా బాధితుడు.
ఒకట్రెండు కాదు చాలా మంది ప్రజలకు ఎదురైన అనుభవం ఇది. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఫేక్ వెబ్‌సైట్లు సృష్టించి ప్రజలను ఏమార్చి వారి ఖాతాల్లోని నగదు లూటీ చేస్తున్నారు. మొన్నటి వరకు ఆధార్‌కార్డు అప్‌డేట్ చేయాలనో లేక మీ బ్యాంకు ఎకౌంట్‌కు ఆధార్ అనుసంధానం చేయాలనో మోసం చేసే వాళ్లు. అమాయక ప్రజలకు ఫోన్లు చేసి వివరాలు తీసుకొని బ్యాంకు ఖాతాల్లో డబ్బును కాజేసే పరిస్థితి ఉండేది.
సైబర్ నేరగాళ్లు ఫోన్ ద్వారా జరుగుతున్న నేరాలపై కేంద్ర హోంమంత్రిత్వశాఖతోపాటు, పోలీసు శాఖ దీనిపై పెద్దఎత్తున ప్రచారం నిర్వహించాయి. దీంతో చాలా మంది ప్రజల్లో ఈ తరహా సైబర్ నేరాలపై అవగాహన వచ్చింది. చాలా వరకు ఇవి కంట్రోల్ అయ్యాయి. ఇప్పుడు మరో మార్గంలో కొత్త మోసాలకు తెరలేపుతున్నారు సైబర్ మోసగాళు.
ఫేక్ వెబ్ సైట్లతో ఏమార్చి లూటీ...
ఇప్పుడు అందరి అరచేతుల్లో స్మార్ట్‌ఫోన్లు వచ్చిచేరాయి. దీంతో సైబర్ నేరగాళ్ల పని మరింత సులువు అయిన పరిస్థితి కనిపిస్తుంది. వాట్సాప్ ద్వారా లేక టెక్స్ట్ మెసేజ్ రూపంలో, లేక మనం నిత్యం వాడే సోషల్‌మీడియా ఖాతాల్లోనో చొరబడి ఆఫర్లతో ఆకట్టుకుంటున్నారు. ఆపై ఆ లింక్‌లు క్లిక్ చేస్తే మనకు ఏ మాత్రం అనుమానం రాని విధంగా రూపకల్పన చేసిన నకిలీ వెబ్‌సైట్ ద్వారా మనల్ని ఏమార్చి డైరెక్టగా మనతోనే తప్పులో కాలేయిస్తున్నారు. ఆ తరువాత జరిగిన మోసం తెలుసుకొని లబోదిమోమంటున్నారు. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా ప్రయోజనం శూన్యం.
ఈ మధ్య కాలంలో బ్రాండెడ్ వస్తువుల వెబ్‌సైట్లను నకిలీ వెబ్‌సైట్లుగా రూపకల్పన చేసి ఆకర్షిస్తూ లూటీ చేస్తున్నారు. చాలా మందికి బ్రాండ్లపై ఉన్న మోజతో ఈ మోసాలకు ఆకర్షితులవ్వడానికి ప్రధాన కారణం. వెబ్‌సైట్లపై కనీస అవాహన లేకుండా కేవలం ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయాలన్న కుతూహలం ఉన్నవారు ఎక్కువ బలవుతున్నారు.
ప్రభుత్వ వెబ్‌సైట్లను సైతం నకిలీవి సృష్టించి...
ఈ మధ్య కాలంలో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ అనుబంధ సంస్థలకు చెందిన వెబ్‌సైట్లను సైతం కాపీ కొట్టి నకిలీవి సృష్టిస్తున్నారు. ఆపై దోపిడీకు పాల్పడుతున్నారు. రోడ్డు అండ్ ట్రాన్స్‌ఫోర్ట్, ట్రాన్స్‌కో, బీఎస్‌ఎన్‌ఎల్ ఇలా అనేక సంస్థలకు చెందిన వెబ్‌సైట్ల నకిలీ సైట్లు సృష్టించారు. వాటి లింక్‌ను వినియోగదారులకు పంపి ఆపై ఫైన్‌లు రూపంలో డబ్బు కట్టాలని మెసేజ్‌లు పంపి దోపిడీ చేస్తున్నారు.
ఇలా నకిలీ వెబ్‌సైట్‌ల ద్వారా చెల్లించే నగదు తక్కువ కావడంతో ఫిర్యాదులు చేయడనికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇదే సైబర్ నేరగాళ్లకు అవకాశంగా మార్చుకుంటున్నారు. పోగొట్టుకున్న మొత్తం ఎంతైనప్పటికీ సైబర్ మోసానికి గురి అయితే వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు చెబుతున్నారు.





















