Constable burnt alive in Kuppam: ప్రేమ పేరుతో మోసం - ప్రియుడి ఇంటి ముందే ప్రియురాలి ఆత్మాహుతి !
Kuppam Crime News: కుప్పంలో ఓ మహిళా కానిస్టేబుల్ ప్రియుడి ఇంటి ముందు సజీవ దహనం చేసుకుంది. ప్రేమ పేరుతో మోసం చేయడమే కారణం.

Kuppam female constable burnt herself alive in front of boyfriend house: ప్రేమించానంటే నిజమే అనుకుంది. మూడు నెలల పాటు కనిపించకపోతే ఏం జరిగందో అని కంగారు పడింది. అడ్రస్ తెలుసుకుని ఇంటికి వస్తే.. తనకు జరిగిన మోసం గురించి తెలిసింది. అంతే తాను ఎంత మోసపోయానో తెలుసుకుని.. ఇక బతికి ఉండటం దండగని.. మోసం చేసిన వ్యక్తి ఇంటి ముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది.
పెళ్లి కాలేదని చెప్పి కానిస్టేబుల్‌ను ప్రేమలో పడేసిన వ్యక్తి
వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ప్రశాంతి ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు చిత్తూరు జిల్లా మార్వాడకు చెందిన వాసుతో కొన్నాళ్ల కిందట పరిచయం ఏర్పడింది. ఫైనాన్స్ కంపెనీలో కలెక్షన్ ఏజెంట్ గా పని చేసే వాసు.. తరచూ ప్రొద్దుటూరు వచ్చిపోతూంటారు. పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామని చెప్పి కలిసి తిరిగారు. పెళ్లి చేసుకుందామని కూడా వాసు మాట ఇచ్చి శారీరకంగానూ కలిసినట్లుగా చెబుతున్నారు. అయితే తర్వాత వాసు హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. తన గురించి ప్రశాంతికి పెద్దగా వివరాలు తెలియనివ్వలేదు. దాంతో కానిస్టేబుల్ ప్రశాంతి.. వాసు పని చేస్తున్న ఫైనాన్స్ కంపెనీకి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు.
ఉద్యోగం పోవడంతో మళ్లీ కనిపించని వాసు - వెదుక్కుంటూ వెళ్లిన ప్రశాంతి
కానీ అక్కడ డబ్బుల గోల్ మాల్ జరగడం, కొన్ని గొడవలు జరగడంతో వాసును ఉద్యోగం నుంచి తీసేశామని చెప్పడంతో ప్రశాంతి షాక్ కు గురయింది. అక్కడ వివరాలు తీసుకుని కుప్పంలోని మార్వాడ గ్రామం అని తెలియడంతో అతని ఇంటికి వెళ్లింది. అయితే అక్కడకు వెళ్లే సరికి ఆమెకు చాలా నిజాలు తెలిశాయి. మొదటిది వాసు.. అవివాహితుడు కాదు. అప్పటికే పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లి చేసుకుని పిల్లలు ఉన్నప్పటికీ.. తనకు పెళ్లి కాలేదని చెప్పి.. అన్ని రకాలుగా మోసం చేశాడని కానిస్టేబుల్ ప్రశాంతి వేదనకు గురయింది. ఘోరంగా మోసపోయానని ఇక జీవించడం దండగని అనుకుంది.
మోసం చేసినట్లుగా తెలియడంతో వాసు ఇంటి ముందే ఆత్మాహుతి
వెంటనే పెట్రోల్ తెచ్చుకుని మళ్లీ వాసు ఇంటికి వెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాల పాలైన కానిస్టేబుల్ ప్రశాంతిని ఆస్పత్రికి తరలించారు. 90 శాతానికిపైగా కాలిన గాయాలు కావడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ ఘటనలో వాసును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ పేరుతో కానిస్టేబుల్ ను మోసగించి . . ఓ ప్రాణం పోవడానికి కారణం అయ్యారని కేసులు పెట్టారు.





















