Jagitial: చనిపోయిన వ్యక్తిని బతికిస్తానన్న స్వామీజీ.. శవం దగ్గర మంత్రాలు, పూజలు.. చివరికి ఏమైందంటే..!
ఏకంగా చనిపోయిన వ్యక్తిని బతికిస్తానంటూ ఓ బాబా ముందుకొచ్చాడు . పూజలు చేస్తానని చెప్పడంతో జనం కూడా అతని మాటలు నమ్మి శవాన్ని అప్పగించారు. పోలీసులు ఆ బాబాను అరెస్టు చేశారు.
కాలం వేగంగా పరిగెడుతూ రోజుకో కొత్త ఆవిష్కరణ ప్రపంచాన్ని పలకరిస్తున్న రోజుల్లో కూడా బాబాలు, స్వామీజీలు పేట్రేగిపోతున్నారు. మారుమూల ప్రాంతాల్లో జనాల అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని రెచ్చిపోతున్నారు. ప్రజలు కూడా స్వామీజీల మాయమాటలను చాలా సులభంగా నమ్మేస్తున్నారు. ఫేక్ బాబాలు చెప్పే మాటలకు ఇట్టే వారి బుట్టలో పడిపోతున్నారు. ఇందుకు నిదర్శనమే తాజాగా జగిత్యాల జిల్లాలో జరిగిన ఓ ఘటన. ఏకంగా చనిపోయిన వ్యక్తిని బతికిస్తానంటూ ముందుకొచ్చాడు ఓ బాబా. పూజలు చేస్తానని, దాంతో శవానికి మళ్లీ ప్రాణం వస్తుందని చెప్పడంతో జనం కూడా అతని మాటలు నమ్మి ఓ శవాన్ని అప్పగించారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ బాబాను అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల పట్టణంలోని టీఆర్ నగర్‌కు చెందిన ఒర్సు రమేశ్అనే వ్యక్తి అనారోగ్యంతో గురువారం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చనిపోయాడు. దీంతో బంధువులు శవాన్ని టీఆర్ నగర్‌లోని ఇంటికి తీసుకుని వచ్చారు. అయితే, మృతుడి ఇంటికి దగ్గర్లోనే ఉండే కొమ్మరాజుల పుల్లేశ్, ఆయన భార్య సుభద్ర దంపతులు మంత్రాలు వేయడం వల్లే రమేశ్ చనిపోయాడనే పుకారు రేగింది. దీంతో వారిపై దాడి చేసి బంధువులు తాళ్లతో కట్టేశారు.
అయితే, మంత్రాలు వేసి రమేశ్‌ను మళ్లీ బతికిస్తానని పుల్లేశ్ చెప్పడంతో బంధువులు భార్యాభర్తల కట్లు విప్పారు. శవం వద్దకు వచ్చిన పుల్లేశ్దాని ముందే పూజలు మొదలు పెట్టాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పుల్లేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రమేశ్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెంటనే బంధువులు ఎదురుతిరిగారు. మంత్రాలు వేస్తే రమేశ్ బతుకుతాడని, తమకు ఆ మృతదేహాన్ని అప్పగించాలని కరీంనగర్ రహదారిపై బంధువులు ధర్నాకు దిగారు.
డాక్టర్లు పరిశీలించి మృతిచెందినట్లు నిర్ధారించడంతో పోలీసులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అయితే మృతదేహాన్ని దహనం చేసేది లేదని, కొమ్మరాజుల పుల్లేశ్‌ను తమకు అప్పగిస్తే మళ్లీ బతికించుకుంటామని బంధువులు పోలీసులతో ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు టీఆర్ నగర్ ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. బంధువులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు.
Also Read: Weather Updates: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఏపీలో కూడా ఈ ప్రాంతాల్లో.. వాతావరణశాఖ హెచ్చరిక