Dead Body In Fridge: ఫ్రిజ్‌లో రిటైర్డ్ టీచర్ మృతదేహం.. పెన్షన్ డబ్బుల కోసం ఓ మనవడి నిర్వాకం.. పోలీసులు షాక్!
తాత పెన్షన్ డబ్బుల కోసం ఆశపడిన ఓ మనుమడు ఎవరూ చేయని పని చేశాడు. చనిపోయిన తాతకు అంత్యక్రియలు నిర్వహించకుండా మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. దుర్వాసన రావడంతో అసలు విషయం వెలుగుచూసింది.
ఓ తాత తన మనుమడుతో కలిసి ఉంటున్నాడు. అయితే తాతకు తొంభయ్యేళ్ల వయసు.. అందులోనూ చాలా ఏళ్ల కిందట రిటైరయ్యారు. ఆ వయసులో కదల్లేని స్థితిలో ఉన్న తాతకు మనుమడు సపర్యలు చేస్తున్నట్లుగా కనిపించాడు. చుట్టుపక్కల వారు సైతం మనుమడుని మెచ్చుకునేవారు. ఈ క్రమంలో వృద్ధుడు ఏమయ్యాడో చుట్టుపక్కలవారికి అర్థం కాలేదు. ఇంటి నుంచి కుళ్లిపోయిన వాసన వస్తుంటే అసలు కథ వెలుగుచూసింది. ఆ పెద్దాయన చనిపోయి కొన్ని రోజులు అవుతుందని, మనుమడు చేసిన బాగోతం ఏంటనేది సంచలనంగా మారింది.
పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా కామారానికి చెందిన బైరం బాలయ్య (90) రిటైర్డ్ ఉద్యోగి. టీచర్‌గా సేవలు అందించిన బాలయ్య చివరిదశలో తన పనులు తాను చూసుకోలేక ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో పదేళ్ల కిందట కామారెడ్డి నుంచి వరంగల్ జిల్లా పరకాలకు వచ్చేశారు. గత ఏడేళ్లుగా బాలయ్య పొరండ్ల కైలాసం కాంప్లెక్స్‌లో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. బాలయ్య, నర్సమ్మ దంపతులకు సంతానంగా కుమారుడు హరికిషన్ ఉన్నాడు. అతడి భార్య కొన్నేళ్ల కిందట చనిపోయింది. ఆపై 2019లో జరిగిన రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని కబలించింది. ఆ ఘటనలో హరికిషన్ చనిపోయాడు. హరికిషన్‌కు ఓ కుమారుడు నిఖిల్ (22) ఉన్నాడు. అతడు పదో తరగతితో చదవు మానేశాడు.
Also Read: Payam Venkateswarlu: పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు 6 నెలల జైలుశిక్ష.. జరిమానా
రెండు నెలల కిందట బాలయ్య భార్య కరోనాతో చనిపోయింది. దాంతో నిఖిల్ గత కొంతకాలం నుంచి తాత బాలయ్యకు సపర్యలు చేస్తూ కనిపించాడు. కుర్రాడు మంచి పని చేస్తున్నాడని చుట్టుపక్కల వాళ్లు అనుకున్నారు. రిటైర్డ్ టీచర్‌కు ఆహారం తీసుకొచ్చి ఇస్తూ కొన్ని రోజుల కిందటి వరకు నిఖిల్ ఆయన బాగోగులు చూసుకున్నాడు. ఈ క్రమంలో ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడం మొదలైంది. ఇంటి యజమానికి చుట్టుపక్కల వారు విషయం చెప్పారు. ఏం జరిగిందా అని గురువారం ఇంటి యజమాని కైలాసం, వీరు ఉండే పోర్షన్‌లోకి వెళ్లి ఏం జరిగిందా అని పరిశీలించారు. అయినా విషయం సరిగా అర్థంకాక నిఖిల్‌ను ఇంటి ఓనర్ గట్టిగా నిలదీశాడు.
తాత నాలుగైదు రోజుల కిందట చనిపోయాడని, అంత్యక్రియలకు డబ్బుల్లేక ఫ్రిజులో మృతదేహాన్ని ఉంచానని ఓనర్‌ను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఓనర్ నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీయగా అసలు విషయాలు బటయపడ్డాయి. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిందని, నాలుగైదు రోజులకు ముందే బాలయ్య చనిపోయారని తెలుస్తోంది. రిటైర్డ్ టీచర్ బాలయ్యకు వచ్చే పింఛన్ డబ్బులే వీరికి జీవనాధారం. ఆ డబ్బులతో మనుమడు నిఖిల్ జల్సాలు చేసేవాడు. ఒకట్రెండు రోజుల్లో తాత పింఛన్ డబ్బులు పడతాయని, ఇప్పుడు ఆయన చనిపోయాడని చెబితే ఆ డబ్బు ఖాతాలో పడదని నిఖిల్ ఈ పని చేశాడని పోలీసులు తెలిపారు. నిఖిల్ చేసిన పనికి పోలీసులు సైతం షాకయ్యారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో చర్చనీయాంశంగా మారింది.
Also Read: Weather Updates: తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు.. ఏపీలో పొడిగా వాతావరణం.. రెండ్రోజుల్లో వానలు