Atchutapuram SEZ Accident : పెళ్లి షాపింగ్ చేసి డ్యూటికెళ్లి మృతి చెందారొకరు- రాఖీ కట్టి ఆనందంగా వెళ్లి శవమైంది మరొకరు- ఫార్మా ప్రమాద మృతుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ
Atchutapuram SEZ Accident : అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. మరణాలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. వీరిలో యువతే అధికంగా ఉన్నారు.
Atchutapuram SEZ Accident : అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో రియాక్టర్ పేలిన ప్రమాద ఘటనలో మృతులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తొలుత నలుగురు, ఐదుగురు మాత్రమే మృతి చెందారని, సుమారు 20 మంది వరకు తీవ్రంగా గాయపడినట్టు చెప్పారు. కానీ, క్రమంగా మృతుల సంఖ్య పెరుగుతోంది. గురువారం ఉదయం వరకు 18 మంది మృతి చెందినట్టు అధికారులు నిర్ధారించారు. మరో 20 మందికిపై గా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు చెబుతున్నారు. దీంతో మృతులు సంఖ్య మరింత పెరిగే ప్రమాదముందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో దాదాపు 70 శాతం మంది 40 ఏళ్లలోపు యువతే ఉన్నారు. డిగ్రీ, పీజీ పూర్తి చేసిన ఫార్మా పరిశ్రమల్లో అవకాశాలు లభిస్తుండడంతో ఉద్యోగాల్లో చేరుతున్నారు. అనుకోని విధంగా ఈ తరహా ప్రమాదాలు చోటుచేసుకుంటుండడంతో ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా జరిగిన ప్రమాదంలో అధిక సంఖ్యలో యువకులు చనిపోవడంతో వారి కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటుతున్నాయి. మృతి చెందిన వారిలో కాకినాడకు చెందిన హారిక (22) కూడా ఉంది. ఈ అమ్మాయి సోదరులకు రాఖీ కట్టేందుకు వెళ్లి ప్రమాదం జరిగిన రోజే విధుల్లోకి చేరి తీవ్రంగా గాయపడి మృతి చెందింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, రాఖీ కట్టించుకున్న సోదరులు కన్నీరు, మున్నీరుగా విలపిస్తున్నారు. 30 ఏళ్లలోపు వాళ్లు ఏడుగురు వరకు ఉన్నట్టు తెలుస్తోంది. మృతి చెందిన ఒకొక్కొరిది ఒక్కో విధమైన గాథగా చెబుతున్నారు.
పార్థ సారథి అనే వ్యక్తి పెళ్లి వచ్చే నెల ఐదున పెళ్లి ఉంది. ఈ పెళ్లికి సంబంధించిన షాపింక్ చేసి వచ్చి ఆఫీస్‌కు వెళ్లాడు. వెళ్లిన అరగంటకే చనిపోయాడని కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. అంతే వాళ్లంతా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
ఆచూకీ తెలియక రోధిస్తున్న కుటుంబ సభ్యులు
కంపెనీ ప్రమాదంలో రియాక్టర్ పేలుడుతో పరిశ్రమలో పని చేస్తున్న ఎంతో మంది తీవ్రంగా గాయపడగా, పలువురు మృతి చెందారు. అయితే, ఇప్పటికీ పరిశ్రమలో పని చేస్తున్న పలువురి ఆచూకీ తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ప్రమాదం జరిగిన పరిశ్రమ వద్దకు చేరుకుని రోధిస్తున్నారు. తమ వారి ఆచూకీ ఏమైందంటూ అక్కడి అధికారులను ప్రశ్నిస్తున్నారు. శిథిలాల కిందే ఇంకా కొందరు కార్మికులు ఉన్నట్టు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో శిథిలాలను తొలగించే పనులను జోరుగా సాగిస్తున్నారు. సహాయ చర్యల్లో జాప్యం వల్లే తమ వారి ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదంటూ పరిశ్రమలో పని చేసిన పలువురు ఉద్యోగులు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కంపెనీ ఎదుట కుటుంబ సభ్యులు బైఠాయించారు. ఈ ప్రమాద ఘటనపై అధికార యంత్రాంగం తూతూ మంత్రంగా వ్యవహరిస్తోందంటూ సీపీఐ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. మృతులు కుటుంబాలకు కోటి చొప్పున నష్ట పరిహారాన్ని అందించాలని స్పష్టం చేశారు. పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. వరుసగా విశాఖ పరిసరాల్లోని పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఫ్యాక్టరీల్లో భద్రత, నిబంధనలను పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
కేజీహెచ్ లో 12 మంది మృతదేహాలు..
విశాఖలోని కేజీహెచ్ మార్చురీ వద్దకు 12 మంది మృతదేహాలను తరలించి అక్కడ పోస్టుమార్టం నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అనకాపల్లిలో ఆరు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. కేజీహచ్‌కు తీసుకువచ్చిన మృతదేహాల్లో నీలపు రామిరెడ్డి (అసోసియేట్ జనరల్ మేనేజర్), మహంతి నారాయణరావు (అసిస్టెంట్ మేనేజర్), మొండి నాగబాబు (అసిస్టెంట్ మేనేజర్), చల్లపల్లి హారిక (ట్రైనీ ఇంజనీర్), మారిశెటిట సతీష్ (అసిస్టెంట్ మేనేజర్), యళ్లబిల్లి చిన్నారావు (పెయింటర్), పైడి రాజశేఖర్ (ట్రైనీ ప్రాసెస్ ఇంజనీర్), కొప్పర్తి గణేష్ కుమార్, ప్రశాంత్ హంస, వేగి సన్యాసినాయుడు, పూడి మోహన్ దుర్గా ప్రసాద్, జవ్వాది చిరంజీవి కాగా, అనకాపల్లిలో ఎన్‌టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రిలో మరో ఐదుగు మృత దేహాలకు పోస్టమార్టం నిర్వహించారు. వీరిలో జావేది పార్థసారథి, పూసల వెంకట సాయి, మారేణి సురేంద్ర, బి ఆనందరావు, బీఎన్ రామచంద్రరరావు ఉన్నారు.
ప్రధాని తీవ్ర దిగ్ర్భాంతి
అచ్యుతాపురం సెజ్‌లో చోటుచేసుకున్న ఫార్మా కంపెనీ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్బాంతిని వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన ప్రమాద విషయాన్ని తెలుసుకుని స్పందించారు. బాధిత కుటుంబాలకు రెండు లక్షల పరిహారాన్ని ప్రకటించిన ఆయన.. క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున అందించనున్నట్టు ప్రకటించారు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా అధికారులతో మాట్లాడి పటిష్ట చర్యలు తీసుకోవానలి ఆదేశించారు. గురువారం ఆయన విశాఖ, అనకాపల్లి జిల్లాలకు వస్తున్నారు. ప్రమాద బాధితులను పరామర్శించనున్నారు. అవసరమైతే మెరుగైన వైద్యం కోసం బాధితులను హైదరాబాద్ తరలించాలని ఆయన ఆదేశించారు. ఈ ప్రమాద ఘటనపై డిప్యూటీ పవన్ కల్యాణ్, మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. ప్రమాదం జరిగిన తీరు పట్ల వైఎస్ జగన్ తీవ్ర దగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉండాలని పార్టీ నాయకులను ఆదేశించారు. శుక్రవారం ప్రమాద స్థలానికి జగన్ వెళ్లనున్నారు. కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రమాద ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులు, మృతులు కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు.