AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం, భారీగా నగదు సీజ్ చేసిన సిట్
SIT Seizes ₹11 Crore Cash in AP Liquor Scam | ఏపీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫాం హౌస్‌లో దాచిన నగదును సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Andhra Pradesh Liquor Policy Case | హైదరాబాద్: ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన మద్యం కుంభకోణం (AP Liquor Scam)లో కొత్త కోణం వెలుగు చూసింది. ఈ కేసులో ప్రధాన నిందితులలో ఒకరైన రాజ్ కెసిరెడ్డి ఇచ్చిన సమాచారంతో భారీగా నగదును అధికారులు సీజ్ చేశారు. 12 బాక్సుల్లో భద్రపరిచిన ఏకంగా రూ.11 కోట్ల నగదును అధికారులు గుర్తించారు. నిందితులు ఇస్తున్న సమాచారంతో సిట్ అధికారులు పలు చోట్ల సోదాలు చేపట్టిన క్రమంలో పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఫాం హౌస్‌లో అట్ట పెట్టెల్లో నోట్ల కట్టలు
రంగారెడ్డి (Rangareddy) జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్‌లో ఈ నగదును సిట్ అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఏపీ లిక్కర్ కేసును సిట్ అధికారులు సీరియస్ గా తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మద్యం కేసులో నిందితుడు వరుణ్ పురుషోత్తం వెల్లడించిన విషయాల ఆధారంగా సిట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్‌లో తనిఖీలు చేపట్టిన పోలీసులు నోట్ల కట్టలు చూసి ఆశ్చర్యపోయారు. అట్టపెట్టెల్లో ఉంచిన రూ.11 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. నిందితులు ఇంకా ఎక్కడెక్కడ నగదు దాచారు, బ్యాంకు ఖాతాల్లో ఉన్నాయా, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశారా అనే కోణాల్లో సిట్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

లోతుగా దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 2024లో రాజ్ కెసిరెడ్డి, చాణక్య ఆదేశాలతో వినయ్ సాయంతో వరుణ్ పురుషోత్తం అనే మరో నిందితుడు రూ.11 కోట్ల నగదును అట్ట పెట్టెలల్లో ఉంచి ఆఫీస్ ఫైల్స్ పేరుతో దాచిపెట్టాడు. విచారణలో నిందితులు వెల్లడించిన వివరాలతో అధికారులు తనిఖీలు చేసి నగదును గుర్తించారు. సిట్ విచారణలో నిందితుడు వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించడంతో ఏపీ లిక్కర్ స్కామ్ నిజాలు బయటకు వస్తున్నాయి. ఏపీలో 3500 కోట్ల మేర లిక్కర్ స్కామ్ జరిగినట్లు సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇటీవల వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఈ కేసులో సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
ఈ లిక్కర్ స్కామ్ ద్వారా రూ.18,860 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. గత వైసీపీ ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని ప్రైవేట్ వ్యాపారులకు అప్పగించి కుంభకోణానికి పాల్పడిందని ఆరోపణలున్నాయి. రాజ్ కెసిరెడ్డి బినామీ సంస్థ యూపీ డిస్టిలరీస్ పేరును సిట్ తొలి చార్జ్‌షీటులోనే ప్రస్తావించడం తెలిసిందే.
ఫామ్‌హౌస్ యజమాని ఎవరు..
వర్ధమాన్ కాలేజీ సమీపంలో ఉన్న సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్ ఓనర్ విజయేందర్‌రెడ్డిగా గుర్తించారు. ఆయన తల్లి పేరిట ఈ ఫామ్‌హౌస్ ఉంది. స్టోర్ రూమ్‌లో బియ్యం బస్తాల మధ్యలో ఈ నగదును దాచి ఉంచారని సిట్ అధికారులు తెలిపారు. నగదు లభ్యం కావడంపై ఈడీ, ఐటీ లిక్కర్ స్కామ్ కేసుపై దర్యాప్తు చేయనున్నాయి.
ఈ కేసులో వైసీపీ నేతల పేర్లు వినిపిస్తుండగా.. దర్యాప్తులో వారి పాత్ర తేలుతుందని కూటమి నేతలు చెబుతున్నారు. అయితే ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి వైసీపీ నేతలను వేధిస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.






















