Durgapur Gang Rape: ఎంబీబీఎస్ విద్యార్థినిపై సామాహిక అత్యాచారం కేసులో ముగ్గురి అరెస్ట్.. సహచరుడే ప్రధాన నిందితుడా?
పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో ఒడిశాకు చెందిన 23 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Gang Rape on MBBS student: పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో ఉన్న ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ సమీపంలో ఒడిశాకు చెందిన 23 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సామూహిక అత్యాచారం, ఉద్దేశ్యపూర్వకంగా చేసిన చర్యలకు గాను పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల గుర్తింపును ఇంకా బహిర్గతం చేయలేదు.
శుక్రవారం రాత్రి స్నేహితుడితో బయటకు వెళ్లగా..
ఒడిశాలోని జలేశ్వర్‌కు చెందిన విద్యార్థిని దుర్గాపూర్‌లోని శివపూర్ ప్రాంతంలోని ఐక్యూ సిటీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది. శుక్రవారం రాత్రి ఆమె తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లింది. ఆ సమయంలో కాలేజీ గేటు దగ్గర కొంతమంది పురుషులు వారిని అడ్డుకున్నారు. ఆ యువతిని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
సహచరుడిపైనే తల్లిదండ్రుల అనుమానం
ఈ ఘటన నుంచి తేరుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అయితే యువతిని బయటకు తీసుకెళ్లిన సహచరుడు తన వేరే ఫ్రెండ్స్‌తో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారని ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. ‘ఆమెను తప్పుదారి పట్టించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు’ అని ఆరోపించారు. ఈ సంఘటనలో నిందితుడు ఆమె ఫోన్ తోపాటు ఆమె వద్ద ఉన్న రూ. 5 వేలు కూడా దొంగిలించాడని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.
స్పందించిన మంత్రి
విద్యార్థిని ప్రస్తుతం దుర్గాపూర్‌లోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఆమె కోలుకుంటోందని అధికారులు వెల్లడించారు. సదరు విద్యార్థిని కోలుకునేలా ఆమెకు కౌన్సెలింగ్ అందిస్తామని పశ్చిమ బెంగాల్ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు శశి పంజా హామీ ఇచ్చారు.
నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం: పోలీసులు
విద్యార్థిని సహచరుడితో సహా పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నామని, బాధితురాలి వాంగ్మూలాన్ని అధికారికంగా నమోదు చేశామని పోలీసు వర్గాలు తెలిపాయి. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. అదే సమయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
‘దుర్గాపూర్‌లో ఒడిశాకు చెందిన వైద్య విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి పట్ల మేము తీవ్రంగా చింతిస్తున్నాం. దోషులు చట్టం నుంచి తప్పించుకోలేరు. బాధితురాలికి న్యాయ చేస్తాం. నిందితులెవరనీ వదిలిపెట్టం. బాధితురాలు బాగా కోలుకుంటోంది. ఆమె కుటుంబానికి సాధ్యమైన అన్ని సహాయాలు అందిస్తున్నాం’ అని పోలీసులు తెలిపారు.
తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దు
‘ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాం. మహిళలపై జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ పోలీసులు జీరో–టాలరెన్స్ విధానానికి కట్టుబడి ఉన్నారు’ అని X వేదికగా పేర్కొన్నారు.
సహచరుడు పారిపోయాడు.. క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలి
జాతీయ మహిళా కమిషన్ (NCW) సభ్యురాలు అర్చన మజుందార్ బాధితురాలు చికిత్స పొందుతున్న ఆసుపత్రిని సందర్శించారు. ఆమెతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ‘ఆ యువతిని బయటకు తీసుకెళ్లిన స్నేహితుడిపై విచారణ జరుగుతోంది. అతడు ఆమెను కళాశాల ప్రాంగణం నుంచి బయటకు తీసుకెళ్లేందుకు ఒప్పించాడు. ఆమెను కొందరు బలవంతంగా తీసుకెళ్లినప్పుడు అతడు పారిపోయాడు’ అని తెలపారు. లీసులు ఈ అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని కోరారు.





















