Adilabad Crime News: ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో నెమలి వేట- ముగ్గురు అరెస్ట్
Adilabad Crime News: నెమలిని వేటాడి చంపిన ముగ్గుర్ని పోలీసులు పట్టుకున్నారు. కోర్టులో హాజరుపరిచారు.

Adilabad Crime News: జాతీయ పక్షి నెమలిని చంపిన ముగ్గురు హంతకులను అరెస్ట్ చేసినట్లు బోథ్ అటవీ రేంజ్ అధికారి టి.ప్రణయ్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ అటవీశాఖ రేంజ్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా బోథ్ అటవీశాఖ రేంజ్ అధికారి టి. ప్రణయ్ మాట్లడుతూ. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం ఖండ్వా రాంపూర్ గ్రామానికి చెందిన పడ్వాల్ గంగాసింగ్ బోథ్ మండలంలోని పోచ్చెర గ్రామంలో పాలేరుగా పని చేస్తూ జీవనం గడుపుతున్నారు. ఆయితె గురువారం పొలం గట్టుపైన గడ్డి తిస్తుండగా 4 నెమలి గుడ్లను గమనించాడు. నెమలి ఎలాగో గుడ్ల వద్దకు వస్తుందని గ్రహించి ముందస్తుగా నెమలిని చంపాలన్న పథకం వేసి అదే గ్రామంలో వలస కూలీల సహాయం తీసుకున్నాడు. వారితో కలిసి నెమలిని పట్టుకొని చంపేందుకు ప్లాన్ చేశాడు.
గాదిగూడ మండలంలోని లోకారీ గ్రామానికి చెందిన పిప్రే దత్తు, ఇంద్రవెల్లి మండలంలోని గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన టర్పే బాలాజీ గంగాసింగ్‌కు సాయం చేశారు. పథకం ప్రకారం గంగాసింగ్ కాకుండా మిగతా ఇద్దరు గురువారం రాత్రి సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో పొలానికి వచ్చారు. అప్పటికే గుడ్ వద్దకు వచ్చి ఉన్న నెమలి వాడిపై కూర్చొని ఉంది. వెంటనే నెమలి వద్దకు వెళ్ళి కత్తితో హతమార్చాడు. తరువాత చనిపోయిన నెమలిని, గుడ్లను సంచిలో వేసుకొని ద్విచక్ర వాహనంపై బయల్దేరారు.
ఇద్దరు వెళ్తుండగా అటువైపుగా నైట్ పెట్రోలింగ్ పోలీసులు ఎదురు పడ్డారు. వారిని ఆపి వివరాలు తీసుకున్నారు. వారి తడబాటు చూసి అనుమానం వచ్చింది. వెంటనే సంచిలో ఏం ఉందని ప్రశ్నించారు. సంచిని తనిఖీ చేస్తుండగా చనిపోయిన నెమలి, దాని గుడ్లు ఉన్నాయి. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని చనిపోయిన నెమలి, దాని గుడ్లను స్వాధీనం చేసుకున్నారు. వారు చెప్పిన వివరాలతో గంగాసింగ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
జాతీయ పక్షి అయిన నెమలిని చంపిన నిందితులపై వన్యప్రాణీ సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. వారిని కోర్టులో హాజరు పరచగా నిందితులను రిమాండ్‌కు తరలించారు. వన్య ప్రాణులను వేటాడుట నేరమని, ప్రజలు గమనించాలని, ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడితే, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. వారిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు.





















