Zee Sony Merger: జీ - సోనీ విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం! రాకెట్లా ఎగిసిన షేర్లు!
Zee Sony Merger: జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్, సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది.
Zee Sony Merger:
జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్, సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది. యాక్సిస్ ఫైనాన్స్, జేసీ ఫ్లవర్స్ అసెట్ రీకన్స్‌ట్రక్షన్ కో, ఐడీబీఐ బ్యాంకు, ఐమాక్స్ కార్ప్, ఐడీబీఐ ట్రస్ట్‌షిప్ వంటి రుణదాతల అభ్యంతరాలను జస్టిస్ హెచ్‌బీ సుబ్బారావు, సభ్యులు మధు సిన్హాతో కూడిన ధర్మాసనం డిస్మిస్ చేసింది. తీర్పును గురువారానికి రిజర్వు చేసింది. శుక్రవారమే ఆర్డర్ కాపీని వెబ్‌సైట్లో పోస్ట్ చేస్తామని వెల్లడించింది.
ఎన్‌సీఎల్‌టీ (NCLT) తీర్పుతో వచ్చే వారమే జీ ఎంటర్‌టైన్‌మెంట్, సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ కంపెనీలు విలీన ప్రక్రియను మొదలు పెట్టనున్నాయని తెలిసింది. కంపెనీల రిజిస్ట్రార్ వద్ద దరఖాస్తు చేసేందుకు జీకి 30 రోజుల సమయం ఉంది. ఆ తర్వాత షేర్లు స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ అవుతాయి. ఆరు వారాల తర్వాత విలీనం చెందిన కొత్త కంపెనీ షేర్లు నమోదు అవుతాయి.
విలీన ప్రక్రియ పూర్తవ్వడానికి ఎంత కాలం పడుతుందో రెండు కంపెనీలూ ఇంకా అధికారికంగా స్పందించలేదు. నవంబర్ చివరి నాటికి ప్రక్రియ పూర్తి అవుతుందని విలీన ప్రక్రియ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో జీ ఎంటర్‌టైన్‌మెంట్ మరో అనుకూల ఆర్డర్ కోసం ఎదురు చూస్తోంది. నమోదిత కంపెనీలో ఎలాంటి పదవిని చేపట్టకుండా కంపెనీ ఎండీ, సీఈవో పునీత్ గోయెంకాను సెబీ నిషేధించింది. విలీనం తర్వాత ఏర్పటయ్యే కంపెనీకి ఎండీ, సీఈవోగా కొనసాగాలని ఆయన షరతు విధించిన సంగతి తెలిసిందే. దీనిపై అభ్యంతరాలు వెల్లువెత్తాయి.
చట్ట ప్రకారమే నడుచుకుంటానని గతంలో గోయెంకా మీడియాతో చెప్పారు. 'ముందు రెండు కంపెనీలు విలీనం అవ్వడమే మాకు ముఖ్యం. నేను దాని పైనే దృష్టి సారించాను. నేను సీఈవోగా ఉన్నా లేకపోయినా విలీన ప్రక్రియ కొనసాగాలి' అని ఆయన తెలిపారు. సెక్యూరిటీస్ అప్పీలేట్ ఉత్తర్వులు ఇచ్చాక గోయెంకా వాదనను సెబీ ఛైర్‌పర్సన్ విన్నారు. ఆగస్టు 14న బోర్డు తుది తీర్పు ఇవ్వనుంది. బోర్డు ఉపశమనం కల్పిస్తే దేశంలోనే రెండో అతిపెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్ కంపెనీకి ఆయన ఎండీ, సీఈవోగా కొనసాగే అవకాశం ఉంది.
విలీన ప్రక్రియకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలపడంతో గురువారం జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు రాకెట్లా దూసుకెళ్లారు. ఏకంగా 16.18 శాతం రూ.39 పెరిగి రూ.281 వద్ద ముగిశాయి. ఉదయం రూ.245 వద్ద మొదలైన షేరు రూ.239 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. రూ.290 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని టచ్ చేసింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ రూ.27వేల కోట్లుగా ఉంది.