₹2000 Note: ₹2000 నోట్ల ఉపసంహరణ వల్ల ఆర్థిక వ్యవస్థకు జరిగే నష్టం ఎంత?
నేటికీ డిజిటల్ లావాదేవీల కంటే నగదును ఎక్కువగా ఉపయోగించే ప్రాంతాలు, ప్రజలు అసౌకర్యాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది
₹2000 Notes - Indian Economy: ఆర్‌బీఐ తీసుకున్న ₹2000 నోట్ల ఉపసంహణ నిర్ణయం, 2016లో నోట్ల రద్దు జ్ఞాపకాలను కదిలించింది. రూ.2000 నోటును మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన 78 నెలల తర్వాత, దానిని చెలామణి నుంచి తొలగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా తలెత్తిన ప్రశ్న.. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఎంత నష్టం?
నిపుణులు ఏం చెప్పారు?:
1. రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం, ఉపసంహరణ నిర్ణయం వెనకున్న ఖచ్చితమైన కారణాన్ని కేంద్ర ప్రభుత్వం & సెంట్రల్ బ్యాంక్ ఇంకా వెల్లడించలేదు. ఎన్నికల ఏడాదిలో ప్రజల దృష్టిని మరల్చేందుకు, ప్రచారం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండవచ్చన్నది విశ్లేషకులు, ఆర్థికవేత్తల అభిప్రాయం.
2. రూ. 2,000 నోట్ల ఉపసంహరణ 'పెద్ద విషయం కాదు', ఆర్థిక వ్యవస్థ లేదా ద్రవ్య విధానంపై పెద్దగా ప్రభావం చూపదు. ఎందుకంటే గత 6-7 ఏళ్లలో దేశంలో డిజిటల్ లావాదేవీలు, ఈ-కామర్స్ పరిధి చాలా పెరిగింది - L&T ఫైనాన్స్ హోల్డింగ్స్ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ రూపా రేగే నిట్సూర్
3. వ్యవసాయం, నిర్మాణాలు, చిన్న వ్యాపారాలపై ప్రభావం పడుతుంది. నేటికీ డిజిటల్ లావాదేవీల కంటే నగదును ఎక్కువగా ఉపయోగించే ప్రాంతాలు, ప్రజలు అసౌకర్యాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది - క్వాంటికో రీసెర్చ్ ఎక్స్‌పర్ట్ యువికా సింఘాల్
4. 2000 రూపాయల ఉపసంహరణ నిర్ణయం తర్వాత రియల్ ఎస్టేట్, బంగారం సహా ఖరీదైన వస్తువులకు డిమాండ్ పెరగడం ప్రారంభమైంది. ప్రజలు తమ వద్ద ఉన్న 2000 నోట్లతో బంగారు నగలు & వజ్రాభరణాలు, స్థిరాస్తిపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు. దీంతో పాటు చిన్న నోట్లకు కూడా డిమాండ్ పెరిగింది. 2016లో డీమోనిటైజేషన్ తర్వాత కూడా ఇలాంటిదే కనిపించింది. అప్పుడు కూడా ప్రజలు రియల్ ఎస్టేట్, గోల్డ్, సిల్వర్, ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు వంటి వాటిపై ఎక్కువ డబ్బులు వెచ్చించారు - ఎకనమిక్స్ ప్రొఫెసర్ వరుణ్ సింగ్
మార్కెట్‌పై పడే ప్రభావం ఎంత?:
'ది హిందూ' రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం, ప్రస్తుతం భారతదేశంలో రూ. 3.7 లక్షల కోట్ల విలువైన రూ. 2000 నోట్లు చలామణీలో ఉన్నాయి. వీటిలో కనీసం మూడింట ఒక వంతు నోట్లు బ్యాంకులకు తిరిగి వెళితే, బ్యాంకు డిపాజిట్లు అదనంగా రూ.40 వేల కోట్ల నుంచి రూ.1.1 లక్షల కోట్లకు పెరగవచ్చు.
ఆదాయ పన్ను విభాగానికి లెక్కలు చూపకుండా రూ. 2000 నోట్లను వివిధ ఖాతాల్లో, లాకర్లలో దాచిన వ్యక్తులు ఇప్పుడు ఆ డబ్బును బయటకు తీసి బంగారం, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారని సమాచారం. ఫలితంగా ఈ రంగాలకు బూస్ట్ అందుతుంది.
2019 నుంచి నిలిచిన రూ. 2000 నోటు ముద్రణ
RBI లెక్కల ప్రకారం, 2019 సంవత్సరం తర్వాత 2000 రూపాయల నోట్ల ముద్రణ నిలిచిపోయింది. మార్కెట్‌లో ఈ నోట్లు ఎక్కువగా కనిపించకపోవడానికి ఇదే కారణం. 2023 మార్చి నాటికి, భారత్‌లో రూ. 31 లక్షల 33 వేల కోట్ల విలువైన కరెన్సీ చలామణిలో ఉంది. వీటిలో రూ. 3 లక్షల 13 వేల కోట్ల విలువైన రూ. 2 వేల కరెన్సీ మాత్రమే చెలామణిలో ఉంది. ఇది కేవలం 10.8%. 2017 మార్చికి ముందు, మొత్తం కరెన్సీలో దాదాపు 89% విలువైన 2000 రూపాయల నోట్లు జారీ అయ్యాయి. 2018 మార్చి నాటికి మొత్తం కరెన్సీలో 37.3% లేదా రూ. 6.73 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణిలో ఉండగా, 2023 మార్చి నాటికి అవి 10.8% లేదా రూ.3.62 లక్షల కోట్లకు తగ్గాయి. దీనిని బట్టి, RBI ఉపసంహరణ నిర్ణయం తీసుకోకపోయినా మరికొన్నేళ్లలో ఈ నోటు మార్కెట్లో కనిపించడం ఆగిపోయేది.
నోట్ల ముద్రణ ఎందుకు ఆగిపోయింది?
2016 సంవత్సరంలో, అంటే నేటికి దాదాపు ఆరున్నరేళ్ల ముందు, నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్త రూ.2000 నోట్లను ముద్రించడం ప్రారంభించింది. ఈ నోట్లను IBI చట్టంలోని సెక్షన్ 24(1) ప్రకారం RBI జారీ చేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత మార్కెట్‌లో తలెత్తిన కరెన్సీ లోటును భర్తీ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం నాటి మీడియా సమావేశంలో ఆర్‌బీఐ గవర్నర్ చెప్పారు. ప్రస్తుతం, ఇతర నోట్లు మార్కెట్‌లో తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని, రూ.2 వేల నోట్లు వచ్చిన లక్ష్యం నెరవేరిందని, అందుకే 2018-19 సంవత్సరంలో రెండు వేల రూపాయల నోట్ల ముద్రణను నిలిపివేశామని చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
క్లీన్ నోట్ పాలసీ అంటే ఏమిటి?
RBI క్లీన్ నోట్ పాలసీ వల్ల నాణ్యమైన బ్యాంకు నోట్లు ప్రజలకు చేరతాయి. చిరిగిన, నలిగిన, తడిచిన, నకిలీ నోట్లను చలామణీ నుంచి తొలగించడం ద్వారా భారతీయ కరెన్సీ సమగ్రతను కాపాడడం ఈ విధానం లక్ష్యం.
ప్రజలు ఏమంటున్నారు?
దీనికి సంబంధించి, ఏబీపీ న్యూస్ ఒక సర్వే చేసింది. 2000 నోట్ల ఉపసంహరణ నిర్ణయం ఎన్నికల్లో ఓటింగ్‌పై ప్రభావం చూపుతుందా అని అడిగింది. దీనికి 22 శాతం మంది అవునని సమాధానం చెప్పారు. ఈ ప్రభావం ఉండదని 58 శాతం మంది అభిప్రాయపడ్డారు. మిగిలిన 20 శాతం మంది దీనిపై తమకు స్పష్టత లేదన్నారు.
ఇది కూడా చదవండి: ₹2000 నోట్ల మార్పిడి, డిపాజిట్స్ షురూ - మీరు తెలుసుకోవాల్సిన ఎక్సేంజ్ రూల్స్