Weather Update Today: ఏపీలో 4 రోజులు భారీ వర్షాలతో అలర్ట్, మత్స్యకారులకు వార్నింగ్- తెలంగాణపై నో ఎఫెక్ట్
Andhra Pradesh Rains | తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీలో గురువారం వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.
Telangana Weather Update Today | అమరావతి/ హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చుతోంది. ఇది క్రమంగా పశ్చిమ- నైరుతి దిశగా కదులుతూ డిసెంబర్ 24 నాటికి ఏపీలోని దక్షిణ కోస్తా తీరం, ఉత్తర తమిళనాడు వైపు వెళ్లి నైరుతి బంగాళాఖాతం చేరుకోనుందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. అల్పపీడనం ప్రభావంతో నేటి నుంచి మూడు, నాలుగు రోజులపాటు ఏపీలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి.
ఏపీలో మోస్తరు వర్షాలు
ఏపీలో సోమవారం నాడు పలు జిల్లాల్లో వర్షాలు కరువనున్నాయని అధికారులు అంచనా వేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, కృష్ణా, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరుతో పాటు రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
District forecast of Andhra Pradesh dated 22-12-2024 #IMD #APWeather #APforecast #MCAmaravati pic.twitter.com/UhERJTWijr
— MC Amaravati (@AmaravatiMc) December 22, 2024
మత్స్యకారులు వేటకు వెళ్లడం ప్రమాదకరం
డిసెంబర్ 26 వరకు ఏపీలో పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు. మత్స్యకారులు గురువారం వరకు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. మరో రెండు రోజులవరకు తీరం వెంట గంటకు 55 కి.మీ. వేగంతో గాలులు వీచనున్నాయి. ఈ క్రమంలో ఏపీలోని పోర్టులకు మూడో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని అధికారులు తెలిపారు.
ఈ నెల 16న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ఇదివరకే తీరం దాటాలి. కానీ తీవ్ర అల్పపీడనంగా బలపడి ఏపీ తీరం వైపు వచ్చింది. వాయుగుండంగా మారి రెండు రోజులకు తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. అయితే ఏపీకి ముప్పు తప్పిందని అనుకుంటుండగా అది దిశగా మార్చుకుంది. దాంతో మత్స్యకారులు సైతం నాలుగు రోజులుగా వేటకు వెళ్లడం లేదు. మరో నాలుగు రోజులు వేటకు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అల్పపీడనం మరో నాలుగు రోజులపాటు ప్రభావం చూపనుంది.
తెలంగాణలో కొన్ని జిల్లాల్లో పొగమంచు ప్రభావం
తెలంగాణలో అల్పపీడనం ప్రభావం లేదు. రాబోయే మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం వేళ పలు జిల్లాల్లో పొగ మంచు ఏర్పడుతుంది. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. నగరంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలు, 20 డిగ్రీల మేర నమోదు కానున్నాయి. తూర్పు దిశ నుంచి గంటకు 6 నుంచి 8 కి.మీ వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది.
నెం | ఏరియా | గరిష్ట ఉష్ణోగ్రత | కనిష్ట ఉష్ణోగ్రత |
1 | ఆదిలాబాద్ | 30.3 | 13.7 |
2 | భద్రాచలం | 33 | 21.5 |
3 | హకీంపేట్ | 30.3 | 17.2 |
4 | దుండిగల్ | 31.2 | 18.5 |
5 | హన్మకొండ | 32 | 21.5 |
6 | హైదరాబాద్ | 30.8 | 19.8 |
7 | ఖమ్మం | 34.4 | 22.2 |
8 | మహబూబ్ నగర్ | 31 | 21.9 |
9 | మెదక్ | 30.8 | 16.3 |
10 | నల్గొండ | 28 | 19 |
11 | నిజామాబాద్ | 332.5 | 19.2 |
12 | రామగుండం | 31 | 19.6 |
13 | హయత్ నగర్ | 30.6 | 18 |