Pulses Price Hike: పండుగ నాడూ పప్పులు ఉడకట్లా - గవర్నమెంట్ వార్నింగ్‌తోనైనా ధరలు దిగొచ్చేనా?
Tur Dal And Urad Price Today: హోల్‌సేల్ మార్కెట్‌లలో పప్పుల ధరలు 10 శాతం తగ్గాయి. రిటైల్ మార్కెట్‌లో మాత్రం పప్పుల రేట్లు తగ్గకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
![Pulses Price Hike: పండుగ నాడూ పప్పులు ఉడకట్లా - గవర్నమెంట్ వార్నింగ్‌తోనైనా ధరలు దిగొచ్చేనా? Tur urad prices in wholesale declines by 10 percent but no change in retail prices even government warns retailers Pulses Price Hike: పండుగ నాడూ పప్పులు ఉడకట్లా - గవర్నమెంట్ వార్నింగ్‌తోనైనా ధరలు దిగొచ్చేనా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/09/bbe794add6d32ba70bdb9eeba1c3581c1728453093008545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tur Dal And Urad Prices In India: ప్రతిరోజూ పళ్లెంలో పప్పు లేనిదే ముద్ద గొంతు దిగని కుటుంబాలు ఎన్నో. మాంసాహారులైనా, శాఖాహారులైనా అందరికీ ఇష్టసఖి పప్పు. ప్రొటీన్లు మెండుగా ఉండే పప్పులు, మాంసాహారానికి ప్రత్యామ్నాయాలు. భోజనంలో కీలక భాగమైన పప్పులు ఇప్పుడు ఉడకట్లేదు, రేట్లు మండిపోతున్నాయి. విచిత్రం ఏంటంటే... హోల్‌సేల్ మార్కెట్‌లో పప్పుల ధరలు (Pulses Prices) తగ్గినప్పటికీ, రిటైల్ మార్కెట్‌లో మాత్రం దిగిరావడం లేదు. పండుగ నాడు పప్పులు కొనేదెట్లా అని ఓవైపు సామాన్యులు ఆందోళన పడుతుంటే, ఈ పరిస్థితి చూసి సర్కార్ కూడా కంగారు పడుతోంది. చిల్లర వ్యాపారులను సమావేశపరిచి హెచ్చరికలు జారీ చేసింది.
హోల్‌సేల్ రేట్లు అలా - రిటైల్ రేట్లు ఇలా
టోకు మార్కెట్ వ్యాపారులు రేట్లు తగ్గించినా, చిల్లర వ్యాపారులు ధరలు తగ్గించలేదన్న విషయం సర్కారు దృష్టికి వచ్చినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే చెప్పారు. రిటైల్ బిజినెస్ చేసే వ్యాపారులు సామాన్య ప్రజల నుంచి అధిక మార్జిన్లు వసూలు చేస్తున్నారని, భారీ లాభాలు దండుకుంటున్నారని, దీనిని చూస్తూ కూర్చునే ప్రసక్తే లేదంటూ ఖరే స్పష్టం చేసారు. కేంద్ర ప్రభుత్వం ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని, మార్జిన్లలో భారీ వ్యత్యాసం ఇలాగే కొనసాగితే రిటైల్ బిజినెస్‌లపై చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.
నిధి ఖరే, మంగళవారం నాడు (08 అక్టోబర్ 2024), రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, దేశంలోని పెద్ద రిటైల్ చైన్ కంపెనీలతో సమావేశం నిర్వహించారు. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ మీటింగ్ పెట్టారు. ఈ సమావేశంలో పప్పుల ధరల గురించి ప్రధానంగా చర్చించారు. ఖరీఫ్ సీజన్‌లో కందుల లభ్యత పెరగడం, దిగుబడి ఎక్కువగా ఉండడంతో గత నెల రోజులుగా హోల్‌సేల్ మార్కెట్లలో పప్పుధాన్యాల ధరలు తగ్గుముఖం పట్టాయని ఈ సమావేశంలో మాట్లాడారు. ప్రధాన మండీల్లో (హోల్‌సేల్ మార్కెట్లు) పప్పుల ధరలు గత మూడు నెలల్లో సగటున 10 శాతం తగ్గాయని, అయితే చిల్లర ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదని ఖరే అన్నారు.
సీరియస్ వార్నింగ్
గత నెల రోజులుగా హోల్‌సేల్ మార్కెట్‌లో కందిపప్పు ధరలు తగ్గుముఖం పట్టాయని, అయితే చిల్లర ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయని, ఇలా ఎందుకు జరుగుతోందని వ్యాపార వర్గాలను నిధి ఖరే ప్రశ్నించారు. హోల్‌సేల్ ధరలు - రిటైల్ ధరల మధ్య భిన్నమైన పోకడలు ఉండడమేంటని, వ్యాపారులు అన్యాయమైన మార్జిన్‌లు తీసుకుంటున్నారని సూటిగా అడిగారు. ఈ ధరల వ్యత్యాసాన్ని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని, ఈ వ్యత్యాసం ఇలాగే పెరిగితే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని గట్టిగా చెప్పినట్లు సమాచారం. సర్కారు వారి వార్నింగ్ ఫలితాన్నిచ్చి దేశంలో పప్పుల రేట్లు తగ్గుతాయేమో చూడాలి.
రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధికారులు, రిలయన్స్ రిటైల్ లిమిటెడ్, విశాల్ మార్ట్, డి మార్ట్, స్పెన్సర్స్, మోర్ రిటైల్ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే, గత నెల రోజుల్లో శనగల ధర 2.76 శాతం, శనగపప్పు రేటు 0.71 శాతం, పెసర పప్పు ధర 1.34 శాతం, ఎర్ర కందిపప్పు రేటు 0.80 శాతం పెరిగాయి. కందుల ధరలు మాత్రమే తగ్గాయి, అదీ కంటి తుడుపుగా నెలలో కేవలం 0.09 శాతం తగ్గాయి.
మరో ఆసక్తికర కథనం: వడ్డీ రేట్లు ఈసారి కూడా మారలేదు, యథతథంగా రెపో రేట్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)