Laila Movie Review - లైలా రివ్యూ: లేడీ గెటప్ వేస్తే? థియేటర్లలో విశ్వక్ సేన్ సినిమాను చూడగలమా? హిట్టా ఫట్టా?
Laila Movie Review In Telugu: విశ్వక్ సేన్ మొదటిసారి లేడీ గెటప్ వేసిన సినిమా లైలా. ట్రైలర్ సాంగ్స్ కంటే వివాదాలు ఎక్కువ ప్రచారం తీసుకొచ్చాయి. అసలు సినిమా ఎలా ఉంది? ఇందులో ఏముంది? అనేది చూస్తే...

రామ్ నారాయణ్
విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ, అభిమన్యు సింగ్, బబ్లూ పృథ్వీరాజ్, కామాక్షి భాస్కర్ల, 30 ఇయర్స్ పృథ్వీరాజ్ తదితరులు
Vishwak Sen's Laila Movie Review In Telugu: విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'లైలా'. దీని స్పెషాలిటీ ఏమిటంటే... ఈ సినిమాలో ఆయన లేడీ గెటప్ వేయడం. విశ్వక్ మొదటిసారి మహిళ పాత్ర చేయడంతో బజ్ వచ్చింది. అయితే... నటుడు 30 ఇయర్స్ పృథ్వీరాజ్ ప్రీ రిలీజ్ వేడుకలో చేసిన కామెంట్స్, ఆయన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వైసీపీ చేసిన బాయ్ కాట్ ట్రెండ్ సినిమాకు ఎక్కువ ప్రచారం తీసుకు వచ్చింది. దాంతో ప్రేక్షకులు చూపు దీని మీద పడింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? అసలు ఇందులో ఏముంది? అనేది చూస్తే...
కథ (Laila Movie Story): హైదరాబాద్ పాతబస్తీలో సోను (విశ్వక్ సేన్)కి బ్యూటీ పార్లర్ ఉంది. అతను వేసే మేకప్ అంటే మహిళలు అందరికీ ఎంతో ఇష్టం. సోను గురించి మహిళలు అందరూ గొప్పలు చెబుతూ ఉండడంతో భర్తలు అతని మీద కోపం పెంచుకుంటారు. ఫ్రీగా మేకప్ చేయమని, తాను ఎస్ఐ శంకర్ (బబ్లూ పృథ్వీరాజ్) భార్య అని ఒక మహిళా వస్తే... ఎస్ఐ అసలు భార్యకు ఫోన్ చేసి రప్పిస్తాడు సోను. వాళ్ళిద్దరి మధ్య రోడ్డు మీద గొడవ జరగడంతో శంకర్ పరువు పోతుంది.
పాతబస్తీలోని పహిల్వాన్ రుస్తుం (అభిమన్యు సింగ్) తండ్రికి చిరంజీవి అంటే పిచ్చి. తనకు కాబోయే కోడలు చిరంజీవి సినిమా అంతా అందంగా ఉండాలని కోరుకుంటాడు. ఎంతో మంది అమ్మాయిల్ని రిజెక్ట్ చేసిన తర్వాత సోను వేసిన మేకప్ చూసి అతిలోకసుందరిలో ఉందని ఒక అమ్మాయి (కామాక్షి భాస్కర్ల)ను ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆవిడ మేకప్ లేని ఫేస్ (నల్లగా ఉండటం) చూసి ఆగ్రహంతో ఊగిపోయిన రుస్తుం సోను బ్యూటీ పార్లర్ మీదకు తన మనుషులని పంపిస్తాడు. మరొకవైపు కల్తీ నూనె కేసులో సోను పేరు వినబడుతుంది.
ఒకవైపు ఎస్ఐ శంకర్, మరొకవైపు రుస్తుం, ఇంకొక వైపు కల్తీ నూనె కేసు... ఆగ్రహంతో ఉన్న ప్రజలు సోను కనపడితే కొట్టేందుకు సిద్ధంగా ఉంటారు. దాంతో 'లైలా'గా మారుతాడు సోను. ఆ తర్వాత తన సమస్యలను ఎలా పరిష్కరించుకున్నాడు? ఆ ప్రయాణంలో అతను ప్రేమించే అమ్మాయి జెన్నీ (ఆకాంక్ష శర్మ), సునిశిత్ (సునిశిత్) పాత్రలు ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Laila Review Telugu): ఇటువంటి కథతో హీరోని దర్శకుడు రామ్ నారాయణ్ ఎలా ఒప్పించాడు? అని సినిమా మొదలైన కాసేపటికి సందేహం కలుగుతుంది. విశ్రాంతి వరకు రొటీన్ సీన్స్, కామెడీ ఉన్న సినిమాతో హీరోని ఒప్పించినందుకు దర్శకుడుని కాస్త పొగడాలని అనిపిస్తుంది. విశ్రాంతి తర్వాత విశ్వక్ సేన్ ఈ కథను ఎలా ఒప్పుకొన్నాడు? ఇందులో హుక్ చేసే పాయింట్ అతనికి ఏం కనిపించింది? అని సందేహం వస్తుంది. విశ్వక్ సేన్ లేడీ గెటప్ వేయడం తప్పిస్తే ఈ సినిమాలో కొత్తదనం కొంచెం కూడా లేదు. ఆ లేడీ గెటప్ కూడా అతడికి సెట్ కాలేదు.
'లైలా'కు విశ్వక్ సేన్ హీరో అని చెప్పడం కంటే... అభిమన్యు సింగ్, సునిశిత్ హీరోలను చెబితే బాగుంటుంది. విశ్వక్ సేన్ పాత్రతో సమానంగా అభిమన్యు సింగ్ పాత్రకు స్క్రీన్ స్పేస్ లభిస్తే... సునిశిత్ పాత్రకు ఇంపార్టెన్స్ లభించింది. కథ, సీన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. హీరో ఎందుకు మేకప్ ఆర్టిస్ట్ అయ్యాడనే సెంటిమెంట్ గానీ, హీరోయిన్ లవ్ ట్రాక్ గానీ కొంచెం కూడా బాలేదు. కాస్తో కూస్తో అభిమన్యు సింగ్ సీన్స్ తప్ప. కమర్షియల్ సినిమాలను లెక్కలు వేసుకొని, క్యారెక్టర్స్ ఆర్క్ వంటి బేరీజులు వేసుకుని చూడకూడదని ఆయా అంశాలను పక్కన పెట్టేసినా... హీరోతో పాటు దర్శక నిర్మాతలు ఏవైతే కమర్షియల్ హంగులని ఫీలయ్యారో? అవన్నీ ప్రేక్షకులను విసిగిస్తాయి. సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకులను విశ్వక్ సేన్, రామ్ నారాయణ్ చిన్న చూపు చూశారని అనిపిస్తుంది. హీరోయిన్ గ్లామర్ చూపిస్తే చాలు అన్నట్టు కొన్ని సీన్లు స్కిన్ షోతో నింపిస్తే... రొట్ట రొటీన్ కామెడీ సీన్లతో మరికొన్ని సీన్లు తీశారు. ఒక పద్ధతి పాడు ఉండవు. తాము రాసింది, చేసింది జనాలు చూస్తారన్నట్టు తీసుకుంటూ వెళ్లారు.
లియోన్ జేమ్స్ సంగీతం అదించిన పాటల్లో రిపీట్ వేల్యూ ఉన్న పాట ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. నేపథ్య సంగీతంలో కూడా మెరుపులు లేవు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ ఓకే. కమర్షియల్ సినిమాకు ఎలా ఉండాలో అలా ఉంది. షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారపాటి నిర్మాణ విలువలు ఓకే. పాటల కోసం విదేశాలు వెళ్లారు. రిచ్ లొకేషన్స్ ఎంపిక చేసుకోవడంతో పాటు సినిమా కోసం భారీ సెట్ వేశారు. మాటల్లో డబుల్ మీనింగ్స్ ఎక్కువ దొర్లాయి.
విశ్వక్ సేన్ రెండు క్యారెక్టర్లు చేశారు. సోను మోడల్ ఒకటి అయితే... లైలా మరొకటి. సోను పాత్రలో అతడి నటన మామూలే. ఎనర్జిటిక్ యువకుడిగా పాత్రకు కావాల్సిన హుషారు చూపించారు. లైలాగా నటించేందుకు అంగీకరించిన హీరోని అభినందించాలి. అయితే... ఆ లేడీ గెటప్ క్యారీ చేయడంలో, సన్నివేశాలకు తగ్గట్టు నటించడంలో పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు. రుస్తుం పాత్రలో అభిమన్యు సింగ్ నటన మెప్పిస్తుంది. లైలాకు ముందు కామెడీ టచ్ ఉన్న క్యారెక్టర్లు కొన్ని చేసినా... ఇందులో పెళ్లి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు వల్ల నవ్వించడం సులభమైంది. ఆయనకు ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు. అన్నట్టు ఒక పాటలో ఆయన డాన్స్ కూడా చేశారు.
Also Read: పట్టుదల రివ్యూ: హాలీవుడ్ స్టైల్‌లో అజిత్ యాక్షన్ ఫిల్మ్ - హిట్టా? ఫట్టా?
హీరోయిన్ ఆకాంక్ష శర్మ విషయానికి వస్తే... నటన తక్కువ, అందాల ప్రదర్శన ఎక్కువ. ఓ పాటలో బికినీ వేశారు. సన్నివేశాలకు అవసరం లేకపోయినా స్క్రీన్ షో చేశారు. సునిషిత్ రియల్ లైఫ్ క్యారెక్టర్ చేశారు. యూట్యూబ్ ఇంటర్వ్యూలో అతడు చేసే అతిని కామెడీ కోసం వాడుకోవాలని దర్శక రచయితలు ప్రయత్నించారు. అది వర్కౌట్ కాలేదు. ఎస్ఐ శంకర్ పాత్రలో బబ్లూ పృథ్వీరాజ్ రెగ్యులర్ విలన్ క్యారెక్టర్ చేశారు. నటుడు 30 ఇయర్స్ పృథ్వీరాజ్ పాత్ర పరిధి తక్కువ. ఆయన క్యారెక్టర్ లెంగ్త్ కంటే సోషల్ మీడియాలో జరిగిన ట్రోల్స్, ఇంటర్వ్యూల స్క్రీన్ స్పేస్ ఎక్కువ. కామాక్షి భాస్కర్ల డీ గ్లామర్ రోల్ చేశారు. సురభి ప్రభావతి సహా మిగతా ఆర్టిస్టులు తమ పాత్రలకు తగ్గట్టు నటించారు.
లైలా... ప్రేక్షకులకు లేడీ గెటప్ ఒక్కటే చాలదమ్మా! రెండున్నర గంటలు థియేటర్లలో కూర్చోవాలంటే అంతకు మించిన కథ, కథనం, కామెడీ కూడా ఉండాలి. మధ్యలో కొన్ని నవ్వులు సరిపోవు. రొటీన్ కమర్షియల్ ఫార్మాటులో తీసే సినిమాలకు వినోదంతో పాటు సంగీతం కూడా బావుండాలి. దురదృష్టవశాత్తు ఈ సినిమాలో అవేవీ లేవు. సో... థియేటర్లకు వెళితే టైమ్ అండ్ మనీ వేస్ట్.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

