Diamond Merchant Dholakia : దీపావళికి ఉద్యోగులకు కార్లు బోనస్‌గా ఇచ్చే ఓనర్ మరో సంచలనం..! ఏకంగా రూ. 185 కోట్లు పెట్టి...
రూ. 185కోట్లు పెట్టి ముంబైలో ఇల్లు కొన్న సూరత్ హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ ఓనర్ సావ్జీ ధొలాకియా, దీపావళి బోనస్‌లుగా ఉద్యోగులకు కార్‌లు ఇస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చున్న ధొలాకియా
ముంబైలో ఓ ఇంటి ఖరీదు రూ. 185కోట్ల రూపాయలు. ఆశ్చర్యపోనవసరం లేదు. అచ్చంగా రూ.185 కోట్ల రూపాయలే. అదనంగా టాక్సులు చెల్లించాలి. ఇంత మొత్తం పెట్టి ఇండియాలో ఇళ్లు కొనేవారు ఉంటారా.. మళ్లీ ఆశ్చర్యపోనవసరం లేదు.. ఎందుకంటే.. కొనబట్టే అంత రేటు దానికి పలికింది. అమ్మింది ప్రముఖ సంస్థ ఎస్సార్ గ్రూప్ కాగా... కొనుగోలు చేసింది... గుజరాత్‌లోని హరికృష్ణ ఎక్స్ పోర్ట్స్ అనే వజ్రాల ఎగుమతి సంస్థ యజమానికి సావ్‌జీ ధొలాకియా. తలుపు తెరిచి చూస్తే సముద్రం కనిపించేలా.. అత్యంత ఆహ్లాదంగా ఉండే ప్రాంతంలో ఉన్న ఈ ఇల్లు... ఆరు ఫ్లోర్లతో ఉంటుంది. ఎస్‌ఎఫ్‌టీకి రూ. తొంభై మూడు వేల చొప్పున పడింది. ఈ ఆస్తిని రిజిస్టర్ చేసుకోవడానికి స్టాంప్ డ్యూటీనే రూ. ఎనిమిది కోట్ల ముఫ్పై లక్షలు చెల్లించారు.
ఇంత పెద్ద మొత్తం వెచ్చించి ఇల్లు కొన్న సావ్‌జీ ధొలాకియా.. చిన్న వ్యక్తి కాదు. ఆయన చేసే వ్యాపారం కూడా చిన్నదేమీ కాదు. అలాగని ఆయన మనసు కూడా చిన్నది కాదు. చాలా పెద్దది ఎంత పెద్దది అంటే.. తన దగ్గర పని చేసేవారికి.. బోనస్‌లుగా బెంజ్ కార్లు కూడా ఇచ్చేంత పెద్ద మనసు. దీపావళి వచ్చిందంటే ఉద్యోగులు చాలా మంది బోనస్‌లు అందుకుంటూ ఉంటారు. కానీ ఆయన మాత్రం తన కంపెనీలో పని చేసేవారికి బోనస్‌లు కాదు అంతకు మించిఅనుకునేలా ఇస్తారు. కార్లు.. బంగళాలను కానుకలుగా ఇస్తూంటారు. ప్రతీ ఏడాది దీపావళికి ఉద్యోగులకు ఊహించని రీతిలో బోనస్‌లు కానుకలు ఇచ్చే ఆ వ్యాపారి గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన సావ్‌జీ ధొలాకియా. వజ్రాల ఎగుమతి రంగంలో ఉన్న ఆయన కంపెనీపేరు హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్. ప్రతి ఏడాది కోరుకున్న వారికి మారుతిసుజుకి ఆల్టో, సెలరియో కార్లు కార్లు వద్దన్న వారికి పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్లు, విలువైన ఫ్లాట్లు ఇస్తూ ఉంటారు. తన కంపెనీలో పాతికేళ్లుగా పని చేస్తున్న ముగ్గురు ఉద్యోగులకు రూ.3కోట్ల ఖరీదైన బెంజ్‌కార్లు బహుమతిగా ఇచ్చారు.
ఈ విధంగా ఇళ్లు, కార్లు, వజ్రాలు, ఆభరణాలు వంటి విలువైన బహుమతులు ఉద్యోగులకు కానుకలుగా ఇచ్చి వారిని ఆశ్చర్యపరడం ఈ వజ్రాల వ్యాపారి సావ్జి దోలకియాకు అలవాటే. వారికి ఏది కావాలో వారినే నిర్ణయించుకునే చాయిస్ కూడా వారికి ఇస్తారు. ఇంత పెద్ద మనసు ఉన్న ఆయనకు వ్యాపారం కూడా కలిసి వస్తోంది. అందుకే ఆయన ఏటికేడు అభివృద్ధి చెందుతున్నారు. తన సంపదను ఉద్యోగులకు పంచుతున్నారు. అలాగే.. తన సంపదను పెంచుకుంనేందుకు ఉపయోగిస్తున్నారు. పంచితే పెరుగుతుంది అని పెద్దలు ఊరకనే చెప్పలేదని సావ్‌జీ ధొలాకియా లాంటి వారిని చూస్తే తెలిసిపోతుంది కదా..!