Stock Market Update: రోలర్ కోస్టర్ రైడ్‌లా సూచీలు! సెన్సెక్స్ -500 నుంచి +187, నిఫ్టీ -150 నుంచి +53
రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర వాతావరణం, అమెరికా ఫెడ్ రేట్ల పెంపు, ఎఫ్‌ఐఐ, డీఐఐల ఉపసంహరణలతో మార్కెట్లు నేడు ఒడుదొడుకుల మధ్య సాగాయి.
భారత స్టాక్ మార్కెట్లు నేడు రోలర్ కోస్టర్ రైడ్‌ను గుర్తుచేశాయి! ఆరంభంలో లాభపడి మధ్యలో భారీగా నష్టపోయి ఆఖర్లో గరిష్ఠాల్లో ముగిశాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర వాతావరణం, అమెరికా ఫెడ్ రేట్ల పెంపు, ఎఫ్‌ఐఐ, డీఐఐల ఉపసంహరణలతో మార్కెట్లు నేడు ఒడుదొడుకుల మధ్య సాగాయి. పెరుగుతున్న చమురు ధరలు ఇందుకు మరింత దోహదం చేశాయి. అయితే ఆర్‌బీఐ వడ్డీరేట్లలో మార్పులేమీ చేయబోవడం లేదన్న సంకేతాలు రావడంతో సూచీలు మళ్లీ పుంజుకున్నాయి.
Also Read: ఆసియాలో రిచెస్ట్ పర్సన్‌గా గౌతమ్ అదానీ, రెండో స్థానానికి రిలయన్స్ అధినేత
క్రితం రోజు 57,621 వద్ద ముగిసిన సెన్సెక్స్ నేడు 57,799 వద్ద లాభాల్లోనే మొదలైంది. జోరుమీదున్న సూచీ వెంటనే 57,925 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. అరగంట కాగానే అమ్మకాల సెగ మొదలైంది. దాంతో సూచీ 57,058 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి చేరుకుంది. 500 పాయింట్ల మేర నష్టపోయింది. ఐరోపా మార్కెట్ల ఆరంభం తర్వాత పుంజుకొన్నాయి. చివరికి 187 పాయింట్ల లాభంతో 57,808 వద్ద ముగిసింది.
సోమవారం 17,213 వద్ద మొదలైన నిఫ్టీ మంగళవారం 17,279 వద్ద మొదలైంది. 17,306 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకొంది. అమ్మకాల ఒత్తిడితో 17,043 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 150 పాయింట్లకు పైగా నష్టపోయింది. చివరికి కోలుకొని 53 పాయింట్ల లాభంతో 17,266 వద్ద ముగిసింది.
నిఫ్టీ బ్యాంకు సైతం ఒడుదొడుకులకు లోనైంది. ఉదయం 38,176 వద్ద మొదలైన సూచీ వెంటనే 38,222 వద్ద గరిష్ఠ స్థాయికి చేరుకుంది. విక్రయాల సెగతో పతనమవ్వడం మొదలైంది. 37,319 వద్ద ఇంట్రాడే కనిష్ఠ స్థాయిని తాకింది. దాదాపు 555 పాయింట్ల మేర పతనమైంది. ఆపై పుంజుకొని 33 పాయింట్ల లాభంతో 38,028 వద్ద ముగిసింది.
Also Read: ఐపీవో క్రేజ్ - పెట్టుబడి పెట్టే ముందు ఇవి గుర్తుపెట్టుకుంటే నష్టాలు రావు!
నిఫ్టీలో 28 కంపెనీలు లాభాల్లో, 22 నష్టాల్లో ముగిశాయి. టాటా స్టీల్, రిలయన్స్, సిప్లా, దివిస్ ల్యాబ్, బజాజ్ ఫిన్‌సర్వ్ లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్, ఎస్‌బీఐ లైఫ్, టాటా కన్జూమర్ ఐఓసీ నష్టపోయాయి. ఆటో, మెటల్, ఫార్మాను మినహాయిస్తే మిగతా రంగాల సూచీలన్నీ ఎరుపు రంగులోనే ఉన్నాయి.