Stock Market News: స్టాక్ మార్కెట్ టేడింగ్ గంటలు పెంచడం వల్ల ఎవరికి, ఎంత లాభం?
ఎక్కువ గంటల పాటు ట్రేడింగ్ టెర్మినల్స్ చురుకుగా ఉంటే ఎవరికి ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందన్న విషయంలో ఇప్పుడు దేశవ్యాప్త చర్చ జరుగుతోంది.
Stock Market News: ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ట్రేడింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత మన మార్కెట్ ముగిసినా, యూరోపియన్ మార్కెట్లు పని చేస్తూనే ఉంటాయి. ఆ తర్వాత అమెరికన్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. వాటి ఎఫెక్ట్ మన మార్కెట్ల మీద పడ్డా, మన మార్కెట్ ట్రేడింగ్ అవర్స్ అప్పటికే ముగిసిపోవడంతో ట్రేడర్లు ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఈ రిస్క్‌ను తగ్గించడానికి, హెడ్జ్‌ల్లో మార్పులు, చేర్పులకు ట్రేడర్లకు అవకాశం కల్పించడానికి 'ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్స్' (interest rate derivatives) ట్రేడింగ్ సమయాన్ని సాయంత్రం 5 గంటల వరకు NSE పొడిగించింది.
వడ్డీ రేట్ల డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ సమయాన్ని సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తూ NSE తీసుకున్న నిర్ణయం రేపటి నుంచి, అంటే ఫిబ్రవరి 23, 2023 నుంచి అమలులోకి వస్తుంది. వడ్డీ రేట్ల డెరివేటివ్స్ విభాగంలో (F&O) సాయంత్రం 5 గంటల వరకు ట్రేడ్ చేయవచ్చు. దీని ప్రకారం, ఫిబ్రవరి నెలతో ముగిసే డెరివేటివ్ కాంట్రాక్టులు కూడా ఫిబ్రవరి 23 సాయంత్రం 5 గంటల వరకు ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 23, 2023 తర్వాత గడువు ముగియనున్న ప్రస్తుత అన్ని ఎక్స్‌పైరీ కాంట్రాక్ట్‌లు, ఇకపై వచ్చే కొత్త ఎక్స్‌పైరీ కాంట్రాక్ట్‌ల్లో సాయంత్రం 5 గంటల వరకు ట్రేడింగ్ చేయవచ్చు.
ట్రేడింగ్ గంటలు పెంచడం వల్ల ఏంటి లాభం, నష్టాలున్నాయా?
ఎక్కువ గంటల పాటు ట్రేడింగ్ టెర్మినల్స్ చురుకుగా ఉంటే ఎవరికి ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందన్న విషయంలో ఇప్పుడు దేశవ్యాప్త చర్చ జరుగుతోంది.
జీరోధా టాప్ బాస్ నితిన్ కామత్ దీనిపై ఒక ట్వీట్ కూడా చేశారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) కోసం ట్రేడింగ్ గంటలను పొడిగించే నిర్ణయం క్యాపిటల్ మార్కెట్ల ఆదాయాన్ని పెంచుతుందన్నారు. అయితే.. రిటైల్ ఇన్వెస్టర్ల మీద ఒత్తిడి పెరుగుతుందని, ఓవర్‌ట్రేడింగ్ కారణంగా వాళ్లు నష్టపోవచ్చంటూ హెచ్చరించారు.
నాగ్‌పుర్‌కు చెందిన ట్రేడర్ హర్షుభ్ షా కూడా, "ట్రేడింగ్ గంటల పొడిగింపు వల్ల మరో 14 ఏళ్ల తర్వాత తన ట్రేడింగ్ కెరీర్‌ను ముగించాల్సి వస్తుందని సోషల్ మీడియాలో ప్రకటించే స్థాయికి వెళ్లాడు. "సమయం పొడిగిస్తే ఒత్తిడి పెరుగుతుందని, ఆరోగ్యం కోసం డబ్బు పెట్టాలనుకోవట్లేదని అన్నారు. మానసిక ప్రశాంతత, కుటుంబ సమయం కూడా ముఖ్యమేనని" ట్వీట్ చేశాడు.
డెరివేటివ్స్ ట్రేడర్ ఆశిష్ గుప్తా మాట్లాడుతూ, "ఏదైనా షాకింగ్ సంఘటన జరిగినప్పుడు, ఇప్పటికే ఉన్న పొజిషన్‌లను సమయానుకూలంగా రక్షించుకునే అవకాశం పొడిగించిన ట్రేడింగ్ గంటల వల్ల ఉంటుందని, అయితే తనలాంటి యాక్టివ్ ట్రేడర్ల అలసట, ఒత్తిడి స్థాయిని అది పెంచుతుందని" చెప్పారు.
F&O విభాగంలో రాత్రి 11:55 గంటల వరకు & క్యాష్ విభాగంలో సాయంత్రం 5 గంటల వరకు ట్రేడింగ్‌ను పొడిగించే అధికారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఉంది.
ప్రపంచ అనిశ్చితి, ఓవర్‌నైట్ రిస్క్‌లను నివారించడానికి ఈక్విటీ F&O, కరెన్సీ సెగ్మెంట్లలో మార్కెట్ గంటలను పొడిగించడం అవసరమని బ్రోకరేజీలు విశ్వసిస్తున్నారు.
"తక్కువ ట్రేడింగ్ గంటలు మన క్యాపిటల్ మార్కెట్ల వృద్ధిని నిరోధిస్తున్నాయి. ఎందుకంటే, ఆర్థిక మార్కెట్లు పరస్పరం లింక్ అయి ఉన్నాయి. హెడ్జ్‌కు అవకాశం తగ్గడం వల్ల భారతదేశం ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా మారకుండా ఆగిపోతోంది. ట్రేడింగ్ గంటలను పెంచడం వల్ల భారతదేశం నుంచి ఎక్కువ మంది ట్రేడ్ చేయడానికి, విదేశీ పెట్టుబడిదారులు పెట్టుబడులు పెంచడానికి అవకాశం కల్పిస్తుందని" డిస్కౌంట్ ఫ్లాట్‌ఫామ్ FYERS సహ వ్యవస్థాపకుడు & CEO తేజస్ ఖోడే చెప్పారు.
Gen Z, మిలీనియల్ ఇన్వెస్టర్లకు ట్రేడింగ్ గంటల పొడిగింపు బూస్ట్ ఇస్తుందని, వారి ప్రస్తుత ఉద్యోగాల పని గంటల తర్వాత ఇకపై స్టాక్స్‌లోనూ ట్రేడ్ చేయడానికి వీలు కల్పిస్తుందని, కాబట్టి వాల్యూమ్స్‌లో పెరుగుదల సాధ్యమవుతుందని బ్రోకర్లు అంటున్నారు.
మన మార్కెట్లలో ట్రేడింగ్ గంటల తర్వాత విదేశాల వైపు వెళ్లేవాళ్లు ఇప్పుడు వెనక్కు వస్తారని, ఆ మేరకు వాల్యూమ్స్ తిరిగి వస్తాయని; మార్కెట్ పార్టిసిపెంట్‌లకు అదనపు ట్రేడింగ్ & ఆర్జనకు అవకాశం వస్తుందని యాక్సిస్ సెక్యూరిటీస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అనూజ్ షా అన్నారు.
ఇది కూడా చదవండి: రిస్క్ తగ్గించేందుకు NSE కీలక నిర్ణయం, ఇకపై సాయంత్రం 5 వరకు ట్రేడింగ్