Banking: స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లకు ప్రమోషన్ - లాభపడే స్టాక్స్ ఇవి!
గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో లాభాలను ఆర్జించడమే కాకుండా, వాటిని అధికారికంగా ప్రకటించి ఉండాలి.
Small Finance Banks To Regular Banks: దేశంలోని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లకు (SFBs) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక గుడ్‌న్యూస్ చెప్పింది. SFBలకే కాదు, ఆ స్టాక్స్‌ను హోల్డ్ చేస్తున్న ఇన్వెస్టర్లకు కూడా ఇది శుభవార్త. ఆర్‌బీఐ తీసుకున్న కొత్త నిర్ణయంతో దేశంలో రెగ్యులర్ బ్యాంక్‌ల సంఖ్య పెరుగుతుంది.
ప్రస్తుతం, మన దేశంలో చిన్న ఫైనాన్స్ బ్యాంక్ విభాగం కింద బిజినెస్ చేస్తున్న సంస్థలను రెగ్యులర్ బ్యాంక్ విభాగంలోకి అప్‌గ్రేడ్ చేయడానికి ఆర్‌బీఐ శుక్రవారం (26 ఏప్రిల్ 2024) దరఖాస్తులు ఆహ్వానించింది. ఇప్పుడు SFB కేటగిరీలో ఉన్న అన్ని బ్యాంక్‌లు ప్రమోషన్ కోసం అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న బ్యాంక్ విలువ, ఖాతాలు, ఆర్థిక వ్యవహారాలన్నీ నిబంధనల ప్రకారం ఉంటే.. RBI వాటికి సాధారణ బ్యాంక్ (Regular Bank) లేదా సార్వత్రిక బ్యాంక్ (Universal Bank) హోదా ఇస్తుంది.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నుంచి రెగ్యులర్ బ్యాంక్‌గా మారేందుకు నిబంధనలు
ప్రైవేట్ రంగంలోని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల నిర్వహణ, నియంత్రణకు సంబంధించి కేంద్ర బ్యాంక్ 2014 నవంబర్‌లో కొన్ని మార్గదర్శకాలు ప్రకటించింది. ఒక చిన్న ఫైనాన్స్ బ్యాంక్ సాధారణ బ్యాంక్ లేదా సార్వత్రిక బ్యాంక్ హోదాను పొందాలంటే, ఆర్‌బీఐ గైడెన్స్ ప్రకారం, ఆ SFB నికర విలువ గత త్రైమాసికం చివరి నాటికి రూ. 1000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఆ బ్యాంక్ షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అయి ఉండాలి. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో లాభాలను ఆర్జించడమే కాకుండా, వాటిని అధికారికంగా ప్రకటించి ఉండాలి. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో దాని స్థూల నిరర్ధక ఆస్తులు (GNPAs) 3 శాతం లేదా అంతకంటే తక్కువగా; నికర నిరర్ధక ఆస్తులు (NNPAs) 1 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. 'క్యాపిటల్ టు రిస్క్ (వెయిటెడ్) అసెట్స్ రేషియో' (CRAR) & గత 5 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ సంతృప్తికరంగా ఉండాలి.
SFB నుంచి రెగ్యులర్ బ్యాంక్‌గా మారే క్రమంలో.. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రమోటర్లకు ప్రత్యేకంగా ఎలాంటి నిబంధనలు లేవని కేంద్ర బ్యాంక్ స్పష్టం చేసింది. అయితే.. రెగ్యులర్/యూనిర్సల్ బ్యాంక్‌గా మారిన తర్వాత కూడా ప్రమోటర్లు అలాగే ఉండాలి. ప్రమోటర్లలో మార్పుకు అనుమతి ఉండదు. అంతేకాదు... యూనివర్సల్ బ్యాంక్‌గా మారే సమయంలో, ప్రస్తుత వాటాదార్ల కనీస షేర్ హోల్డింగ్‌కు (Minimum Share Holding) సంబంధించి ఎటువంటి లాక్-ఇన్ పిరియడ్ విధించడం లేదని కూడా రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది.
లాభపడే స్టాక్స్!
ప్రస్తుతం దేశంలో 12 స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఉన్నాయి. అవి... AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.
వీటిలో... AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యాయి. ఆర్‌బీఐ కొత్త నిర్ణయంతో ఈ స్టాక్స్ లాభపడే అవకాశం ఉంది.
చివరిసారిగా, 2015లో, బంధన్ బ్యాంక్ & IDFC ఫస్ట్ బ్యాంక్ సాధారణ బ్యాంక్‌లుగా మారాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ