RBI Digital Rupee: క్రిప్టో కరెన్సీకి పోటీగా ఇవాళ్టి నుంచి చలామణీలోకి డిజిటల్ రూపాయి, అనుమతి వీరికి మాత్రమే!
ప్రయోగ కాలంలో, ప్రభుత్వ సెక్యూరిటీల్లో సెకండరీ మార్కెట్ లావాదేవీల సెటిల్‌మెంట్ కోసం "హోల్‌సేల్ డిజిటల్ రూపాయి (e₹-W)" వినియోగాస్తారు.
RBI Digital Rupee: క్రిప్టో కరెన్సీ మీద ఆది నుంచీ ఒంటికాలిపై లేస్తున్న భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI), దానికి విరుగుడుగా డిజిటల్ రూపాయిని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇవాళ్టి (2022 నవంబర్ 1, మంగళవారం) నుంచి డిజిటల్ రూపాయి లేదా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) చలామణీలోకి వచ్చింది.
స్థిరత్వం లేని బిట్‌కాయిన్ వంటి ప్రైవేట్ డిజిటల్ మనీ లేదా క్రిప్టో అసెట్స్‌ను లావాదేవీల కోసం అనుమతిస్తే దేశ ఆర్థిక పరిస్థితి ప్రమాదంలో పడుతుందని బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఎప్పట్నుంచో గట్టిగా చెబుతోంది. బ్లాక్ మనీ చేతులు మారుతుందని, అసాంఘిక శక్తులు చెలరేగుతాయని, అలాంటి లావేదేవీల మీద కన్నేసి ఉంచడం కూడా సాధ్యం కాదని అంటోంది. ఇదే బాటలో, క్రిప్టో అసెట్స్ ట్రేడింగ్ మీద భారీ స్థాయి పన్నును కేంద్ర ప్రభుత్వం వడ్డించింది.
పైలెట్ ప్రాజెక్ట్
2022 నవంబర్ 1 నుంచి, హోల్‌సేల్ డిజిటల్ రూపాయిని RBI ప్రయోగాత్మకంగా (ట్రయల్) ఉపయోగంలోకి తీసుకొచ్చింది. తద్వారా.. సొంత వర్చువల్ కరెన్సీతో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించిన ప్రధాన కేంద్ర బ్యాంకుల్లో ఒకటిగా నిలిచింది.
ప్రయోగ కాలంలో, ప్రభుత్వ సెక్యూరిటీల్లో సెకండరీ మార్కెట్ లావాదేవీల సెటిల్‌మెంట్ కోసం "హోల్‌సేల్ డిజిటల్ రూపాయి (e₹-W)" వినియోగాస్తారు.
తొలి విడతలో, హోల్‌సేల్ ఈ-రూపాయి పైలట్ ప్రాజెక్ట్‌లో పాల్గొనడానికి 9 బ్యాంకులకు కేంద్ర బ్యాంక్ అనుమతి ఇచ్చింది. అవి... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యెస్ బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్, HSBC.
హోల్‌సేల్ డిజిటల్ రూపాయి వినియోగం వల్ల 'ఇంటర్ బ్యాంకింగ్ మార్కెట్' మరింత సమర్థవంతంగా పని చేస్తుందని భావిస్తున్నట్లు RBI ఒక ప్రకటన చేసింది. పైలట్ ప్రాజెక్ట్ దశలో, ప్రతి బ్యాంక్ CBDC ఖాతాకు క్రమపద్ధతిలో CBDCని సెంట్రల్ బ్యాంక్ జారీ చేస్తుంది. ఆయా బ్యాంకుల నుంచి వచ్చే డిమాండ్ మేరకు కూడా CBDCని అందిస్తుంది.
డిజిటల్ రూపాయి ఉపయోగం
డిజిటల్ రూపాయితో చాలా ఉపయోగాలు ఉన్నాయి. కేంద్ర బ్యాంకు ద్వారా జరిగే క్యాష్ సెటిల్‌మెంట్లు తగ్గడం వల్ల వాటి మీద లావాదేవీ వ్యయాలు తగ్గుతాయి. ఫలితంగా బ్యాంకుల మీద ఆర్థిక భారం తగ్గుతుంది. ఫైనల్‌గా, ఆ ప్రయోజనం ప్రజలకు చేరుతుంది. రిటైల్ డిజిటల్ రూపాయి కూడా అందుబాటులోకి వస్తే, ఆన్‌లైన్ ఆర్థిక మోసాల బెడద గణనీయంగా తగ్గుతుంది. చేతిలో డబ్బులు పెట్టుకునే రోజులు చరిత్రగా మారతాయి. దేశీయంగా అమలవుతున్న పైలెట్ ప్రాజెక్ట్ ఫలితాలను బట్టి ఇతర హోల్‌సేల్ లావాదేవీలకు, విదేశీ చెల్లింపులకు కూడా డిజిటల్ రూపాయి లావాదేవీల పరిధిని విస్తరిస్తారు.
రిటైల్ వెర్షన్ ఎప్పుడు?
రిటైల్ వెర్షన్ కోసం కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్‌ను నెల రోజుల్లో ప్రారంభిస్తామని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. అయితే, డే వన్ నుంచే వీటిని అందరికీ అందుబాటులోకి తీసుకురారు. డిజిటల్ రూపాయి రిటైల్ సెగ్మెంట్‌లో (e₹-R) పైలెట్ ప్రాజెక్టు కోసం కొన్ని ప్రాంతాల్లో పరిమిత వినియోగదారు - వ్యాపార సమూహాలకు (క్లోజ్డ్ యూజర్ గ్రూప్‌లు) లావాదేవీల కోసం ఎంపిక చేస్తారు. తక్కువ విలువతో డిజిటల్ లావాదేవీలు జరిగేందుకు అనుమతి ఇస్తారు.
భౌతిక కరెన్సీని రద్దు చేస్తారా?
ప్రస్తుతం చలామణీలో ఉన్న కరెన్సీ నోట్లు, నాణేలకు డిజిటల్ రూపమే సెంట్రల్ బ్యాంక్ తీసుకొస్తున్న డిజిటల్ కరెన్సీ. ప్రస్తుతమున్న కరెన్సీని గానీ, కాయిన్లను గానీ రద్దు చేయరు. అవి కూడా ఎప్పుటిలాగే చలామణీలో ఉంటాయి. వీటికి అదనంగా సీబీడీసీ ఉపయోగపడతాయి.