UPI Limit: యూపీఐ లైట్, యూపీఐ 123పే లావాదేవీల పరిమితి పెంపు - వాలెట్ నిల్వల్లోనూ మార్పు
UPI Lite Limit Increased: UPI లావాదేవీల పరిమితిని పెంచుతూ కేంద్ర బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల సామాన్య ప్రజలకు చాలా ఉపయోగం ఉంటుంది.
RBI MPC Meeting October 2024 Decisions: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das), పండుగ సీజన్‌లో ప్రజలకు మంచి గిఫ్ట్ ఇచ్చారు. ద్రవ్య విధాన కమిటీ తీసుకున్న నిర్ణయాలను దాస్ ప్రకటించారు. యూపీఐ లావాదేవీల పరిమితిని పెంచుతున్నట్లు వెల్లడించారు. యూపీఐ లైట్ (UPI Lite), యూపీఐ 123పే (UPI 123Pay) గురించి ఆర్‌బీఐ గవర్నర్ శుభవార్త చెప్పారు. మొత్తంగా.. UPIకి సంబంధించి మూడు ప్రధాన మార్పులు జరుగుతాయి. వాటి వల్ల, చిన్న లావాదేవీలు చేసే వినియోగదార్లు ఎక్కువ ప్రయోజనం పొందుతారు.
UPI లావాదేవీల్లో కొత్త మార్పులు
1. UPI 123పే పరిమితి రూ. 5000 నుంచి రూ. 10,000 కు పెంపు
2. UPI లైట్ వాలెట్ పరిమితి రూ. 2000 నుంచి రూ. 5000 కు పెంపు. సామాన్య ప్రజలు చిన్న లావాదేవీల కోసం UPI లైట్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నందున, వాళ్లందరికీ ఇది ప్రయోజనకర నిర్ణయం.
3. UPI లైట్ లావాదేవీ పరిమితి కూడా రూ. 500 నుంచి రూ. 1000 కి పెంపు
యూపీఐ లావాదేవీల ద్వారా భారతదేశ ఆర్థిక రంగంలో పెద్ద మార్పు వచ్చిందని కేంద్ర బ్యాంక్ అధిపతి చెప్పారు. దీని కారణంగా దేశంలో నగదు డిజిటల్ లావాదేవీలు చాలా సులభంగా మారాయని, అందరికీ అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు.
రెపో రేట్ యథాతథం
పాలసీ రేట్లను మార్చకూడదని ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ మెజారిటీతో నిర్ణయించిందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. అందువల్ల, రెపో రేటును యథతథంగా 6.50 శాతం వద్ద కొనసాగించారు. రెపో రేటును మార్చకుండా అలాగే కొనసాగించడం ఇది వరుసగా పదోసారి. MSLRని కూడా మార్చకుండా 6.75 శాతంగా కొనసాగించాలని RBI MPCలో నిర్ణయించారు. 2025 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం రేటు 4.5 శాతంగా ఉంటుందని అంచనా వేశారు.
GDP అంచనాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో జీడీపీ రేటు 7.2 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు కేంద్ర బ్యాంక్ గవర్నర్ దాస్ చెప్పారు. దీనిలో ఎలాంటి మార్పు లేకపోయినప్పటికీ, భవిష్యత్ జీడీపీ అంచనాల్లో మాత్రం మార్పు కనిపించింది.
FY 2024-25 రెండో త్రైమాసికంలో (2024 జులై-సెప్టెంబర్) జీడీపీ వృద్ధి రేటు అంచనా 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గింపు
FY 2024-25 మూడో త్రైమాసికంలో (2024 అక్టోబర్-డిసెంబర్) జీడీపీ వృద్ధి రేటు అంచనా 7.3 శాతం నుంచి 7.4 శాతానికి పెంపు
FY 2024-25 నాలుగో త్రైమాసికంలో (2025 జనవరి-మార్చి) జీడీపీ వృద్ధి రేటు అంచనా 7.2 శాతం నుంచి 7.4 శాతానికి పెంపు
వచ్చే ఆర్థిక సంవత్సరం (FY 2025-26) మొదటి త్రైమాసికంలో (2025 ఏప్రిల్-జూన్) లో వృద్ధి రేటు అంచనాను పెంచారు. గతంలో 7.2 శాతంగా ఉన్న అంచనాను 7.3 శాతానికి సవరించారు.
ప్రస్తుతం, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల కారణంగా మారుతున్న క్రూడ్ ఆయిల్ రేట్లపై దృష్టి పెట్టాలని ఆర్‌బీఐ గవర్నర్ చెప్పారు. ఈ మార్పుల ప్రభావం అంతర్జాతీయంగా & జాతీయంగా కనిపిస్తుందన్నారు. ఆయిల్ రేట్లలో మార్పులు ద్రవ్యోల్బణం రేటు, జీడీపీ అంచనాలపైనా ప్రభావం చూపుతాయి.
మరో ఆసక్తికర కథనం: యథతథంగా రెపో రేట్ - వడ్డీ రేట్లు, EMIల భారం నుంచి ఈసారి కూడా ఉపశమనం లేదు