RBI: ఏప్రిల్ 3-6 తేదీల్లో MPC భేటీ, వడ్డీ రేట్లు ఇంకా పెరుగుతాయా?
పరపతి విధాన కమిటీ సమావేశం అయ్యే తేదీలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది, పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది.
RBI MPC Meeting Full Schedule: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి విధాన కమిటీ (Monetary Policy Committee - MPC) సమావేశం జరగనుంది. ఏప్రిల్ 3 - 6 తేదీల్లో కమిటీ సభ్యులు భేటీ అయి చర్చలు జరుపుతారు. వడ్డీ రేట్లను పెంచుతారా లేక యథాతథంగా కొనసాగిస్తారా?, ఒకవేళ పెంచితే, ఎంత మేర పెంచుతారు అన్న ప్రశ్నలకు ఏప్రిల్ 6వ తేదీ మధ్యాహ్నానికి సమాధానం దొరుకుతుంది.
దీంతోపాటు... వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2023-24) పరపతి విధాన కమిటీ సమావేశం అయ్యే తేదీలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది, పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది.
ద్వైమాసిక ప్రాతిపదికన (ప్రతి రెండు నెలలకు ఒకసారి) పరపతి విధాన కమిటీ సమావేశం అవుతుంది కాబట్టి, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆరు సార్లు భేటీలు ఉంటాయి. 2023 సంవత్సరంలో ఏప్రిల్, జూన్, ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్‌లో, 2024 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో MPC మీటింగ్స్ జరుగుతాయి.
2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి MPC సమావేశం వచ్చే నెలలో అంటే ఏప్రిల్‌లో జరగనుంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో మొదటి MPC సమావేశం ఏప్రిల్ 3 - 6 తేదీలలో జరుగుతుంది. యూరప్ బ్యాంక్‌లు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ (US FED) వడ్డీ రేట్లను నిరంతరం పెంచడం వల్ల RBIపై ఒత్తిడి పెరిగి, వడ్డీ రేట్లపై మరో కఠిన నిర్ణయం తీసుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో RBI MPC సమావేశ తేదీలు
మొదటి సమావేశం: ఏప్రిల్ 3, 5, 6 తేదీలు, 2023
రెండో సమావేశం: జూన్ 6, 7, 8 తేదీలు, 2023
మూడో సమావేశం: ఆగస్టు 8, 9, 10 తేదీలు, 2023
నాలుగో సమావేశం: అక్టోబర్ 4, 5, 6 తేదీలు, 2023
ఐదో సమావేశం: డిసెంబర్ 6, 7, 8 తేదీలు, 2023
ఆరో సమావేశం: ఫిబ్రవరి 6, 7, 8 తేదీలు, 2024
రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీలో అధ్యక్షుడు సహా ఐదుగురు సభ్యులు ఉంటారు. సెంట్రల్ బ్యాంక్ నుంచి ఇద్దరు ప్రతినిధులు ఉంటారు, మరో ముగ్గురు బయటి వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. RBI గవర్నర్ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తారు. వీరంతా MPC సమావేశానికి హాజరవుతారు. గవర్నర్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే సమావేశాల్లో చర్చలు జరుగుతాయి. దేశ ఆర్థిక, దేశీయ పరిస్థితులను సమీక్షిస్తారు. ఆ తర్వాత రెపో రేటుపై నిర్ణయం తీసుకుంటారు.
గత సమావేశంలో ఆర్‌బీఐ గవర్నర్ చెప్పిన కీలక విషయం
గ్లోబల్ ఎకనమిక్ సవాళ్లు వేగంగా పెరుగుతున్నాయని, భారతదేశంలో కూడా సెంట్రల్ బ్యాంక్ జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గత MPC సమావేశంలోనే చెప్పారు. ఇప్పుడు, గ్లోబల్ బ్యాంకింగ్ సంక్షోభంతో పాటు, US ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు ప్రక్రియను కొనసాగిస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కూడా దీనికి మద్దతు పలుకుతూ, ఇటీవల వడ్డీ రేట్లను పెంచాయి.