Aadhaar Card News: ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి నెలానెలా రూ.3 వేలు! ఇందులో నిజమెంత, అబద్ధమెంత?
ప్రస్తుతం, ఆధార్ కార్డుకు సంబంధించిన ఒక విషయాన్ని, సర్కారీ అప్‌డేట్స్ పేరుతో నడుస్తున్న ఒక యూట్యూబ్ ఛానెల్ ప్రసారం చేస్తోంది.
Aadhaar Card News: ప్రస్తుత కాలంలో... సంప్రదాయ మీడియా కన్నా, సోషల్ మీడియాలోనే చాలా విషయాలు చలామణీ అవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న విషయాల్లో నిజమెంతో, అబద్ధమెంతో ఎంత మందికి తెలుసు? ఇలాంటి పరిస్థితుల్లో, కొన్ని గాలి కబుర్లు కూడా వార్తల రూపంలో వైరల్ అవుతున్నాయి.
మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలకు సంబంధించిన సమాచారాన్ని అందజేసే యూట్యూబ్ ఛానెళ్లు వందల సంఖ్యలో ఉన్నాయి. ప్రస్తుతం, ఆధార్ కార్డుకు సంబంధించిన ఒక విషయాన్ని, సర్కారీ అప్‌డేట్స్ పేరుతో నడుస్తున్న ఒక యూట్యూబ్ ఛానెల్ ప్రసారం చేస్తోంది.
భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన వ్యక్తిగత రుజువుల్లో ఆధార్ కార్డ్ ఒకటి. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా అందడానికి, సద్వినియోగం చేయడానికి ఆధార్‌ను అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి. సర్కారీ అప్‌డేట్ పేరుతో నడుస్తున్న యూట్యూబ్ ఛానెల్, దేశంలోని ఆధార్ కార్డుదారులందరికీ కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా 3 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుందన్న విషయాన్ని ప్రసారం చేసింది. ఆ వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయింది. ఒకవేళ మీ వద్దకు కూడా ఈ వార్త వచ్చినట్లయితే, దానిని నమ్మే ముందు, అందులో దాగున్న నిజం ఎంతో తెలుసుకోండి.
PIB ఏం చెప్పింది?
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేసే, కేంద్ర ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు అందించే సంస్థ అయిన 'ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో' (Press Information Bureau - PIB) దృష్టికి కూడా 'ప్రతి నెలా 3 వేల రూపాయలు ఆర్థిక సహాయం' వార్త వెళ్లింది. ఆ వార్తలో వాస్తవాన్ని PIB తనిఖీ చేసి (Fact Check), అసలు నిజాన్ని వెల్లడించింది. ఆధార్ కార్డ్ ఉన్న వాళ్లకు కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ. 3,000 ఇస్తుందన్న వార్త పూర్తిగా అబద్ధం అని తేల్చింది. ఆధార్ కార్డు ఉన్నవారికి అలాంటి ఆర్థిక సాయం అందించే ఏ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు అని స్పష్టం చేసింది. పొరపాటున కూడా అలాంటి నిరాధార వాదనలను నమ్మవద్దని ప్రజలకు సూచించింది.
दावा: सरकार सभी आधार कार्ड धारकों को प्रति माह ₹3,000 दे रही है।
— PIB Fact Check (@PIBFactCheck) December 20, 2022
#PIBFactCheck
▶️ इस #YouTube वीडियो में किया गया दावा फ़र्ज़ी है।
▶️ऐसी भ्रामक वीडियो और संदेशों को साझा ना करें। pic.twitter.com/niGpC1BTzl
ఇలాంటి అబద్ధపు వార్తల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించే కొందరు స్వార్థపరులు, మీరు మీ వ్యక్తిగత సమాచారాన్ని అక్రమ మార్గంలో సంపాదించాలని చూస్తుంటారు. కాబట్టి, ఆధారాలు లేని విషయాలను, అనుమానిత విషయాలను అస్సలు నమ్మవద్దు. ఆధార్‌కు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేయవద్దు. దీంతో పాటు, మీ బ్యాంక్ ఖాతా నంబర్, OTP, CVV నంబర్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు.
మీరు కూడా నిజ నిర్ధరణ చేయవచ్చు
ఒకవేళ ఏదైనా అనుమానిత సందేశం మీకు వస్తే, దాని గురించి నిజాన్ని తెలుసుకోవడానికి మీరు కూడా ఫ్యాక్ట్ చెక్ చేయవచ్చు. PIB ద్వారా వాస్తవాన్ని నిర్ధరించుకోవచ్చు. దీని కోసం అధికారిక లింక్ https://factcheck.pib.gov.in/ని సందర్శించాలి. ఇది కాకుండా, మీరు నిజ నిర్ధరణ చేయాల్సిన విషయం గురించి, PIB వాట్సాప్ నంబర్ +918799711259 లేదా pibfactcheck@gmail.comకి ఒక ఈ-మెయిల్ పంపవచ్చు.