Ration Shops: రేషన్ షాపుల్లోనూ ఆన్‌లైన్ విక్రయాలు, ఇంట్లో కూర్చునే ఆర్డర్ పెట్టొచ్చు!
ప్రస్తుతం మన దేశంలో ఐదున్నర లక్షలకు పైగా పీడీఎస్ దుకాణాలు పని చేస్తున్నాయి, 80 కోట్లకు పైగా ప్రజలకు సేవలు అందిస్తున్నాయి.

PDS Shops To Sell Consumer Durables Online: రేషన్ షాపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ కంపెనీలు రానున్న రోజుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి రావచ్చు. నాణ్యమైన నిత్యావసర వస్తువులను ప్రభుత్వ రేషన్ షాపుల (PDS దుకాణాలు) ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయించవచ్చా అన్న విషయంపై ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రయోగం చేస్తోంది.
ONDCలో ఆన్‌లైన్ విక్రయాలు
టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, ONDCలో (Open Network for Digital Commerce), చౌక ధరల దుకాణాల ద్వారా ఆన్‌లైన్‌లో వినియోగదారు ఉత్పత్తులను (సబ్బులు, షాంపూలు వంటివి) విక్రయించే ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం టేబుల్ మీద ఉంది. ONDC అనేది కేంద్ర ప్రభుత్వం తయారు చేసిన ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్. దీనిని ఇ-కామర్స్ UPI అని కూడా పిలుస్తారు. మన దేశంలో ఇ-కామర్స్ రంగంలో పాతుకుపోయిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి కంపెనీల ఆధిపత్యానికి ముగింపు పలికేందుకు ONDCని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.
మరో ఆసక్తికర కథనం: తక్కువ EMI ఆశలు ఆవిరి, ఆర్‌బీఐ దాస్ ప్రసంగంలో కీలకాంశాలు ఇవే
హిమాచల్ ప్రదేశ్‌లో ప్రయోగం
రేషన్ షాప్ లేదా చౌక ధరల దుకాణంలో నిరుపేదల కోసం బియ్యం, గోధుమలు, తృణధాన్యాలు, పప్పులు, పంచదార, మరికొన్ని వస్తువులను అతి తక్కువ ధరలకు కేంద్ర ప్రభుత్వం విక్రయిస్తుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) కింద రేషన్ షాపులు పని చేస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో ఐదున్నర లక్షలకు పైగా పీడీఎస్ దుకాణాలు పని చేస్తున్నాయి, 80 కోట్లకు పైగా ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ఇంత పెద్ద ప్రజా పంపిణీల నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని, కన్జ్యూమర్ ప్రొడక్ట్స్‌ను ఆన్‌లైన్ ఆర్డర్ల ద్వారా అందించే పనిని కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా, హమీర్‌పూర్ జిల్లాల్లో ఈ ప్రయోగం కొనసాగుతోంది.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు పెద్ద సవాలు
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పరీక్ష విజయవంతమైతే, రానున్న రోజుల్లో ప్రజలు పీడీఎస్ షాపుల నుంచి ఆన్‌లైన్ ద్వారా అనేక రకాల వస్తువులను కొనుగోలు చేయవచ్చు. టూత్ బ్రష్‌లు, సబ్బులు, షాంపూలు వంటివి ఆ దుకాణాల్లో అందుబాటులో ఉండవచ్చు. ఇదే జరిగితే, ONDC & PDS నెట్‌వర్క్ కలిసి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ కంపెనీలకు గట్టి సవాలు విసురుతాయి.
ఆన్‌లైన్ పథకం పరీక్ష 11 చౌక ధరల దుకాణాల నుంచి ప్రారంభమైంది. కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా ఈ స్కీమ్‌ను ప్రారంభించారు. ఈ ప్రయోగం ప్రజాదరణ పొంది, విజయవంతమైతే.. ఆ తర్వాత మొత్తం హిమాచల్ ప్రదేశ్‌లో అమలు చేస్తారు. అక్కడి నుంచి దశలవారీగా మొత్తం దేశానికి విస్తరిస్తారు. ఈ పథకం అమలుతో ONDC పరిధి కూడా పెరుగుతుందని భావిస్తున్నారు.
మరో ఆసక్తికర కథనం: లోన్ రేట్లు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మీ EMI ఎంత పెరుగుతుందో చూసుకోండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

