MSCI - Adani Companies: అదానీ నెత్తిన పాలు పోసిన MSCI, వెయిటేజీ మార్పులు వాయిదా
మే నెల వరకు ఈ రెండు స్టాక్స్ నుంచి గ్లోబల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కు తీసుకోరు.
MSCI - Adani Companies: ఇండెక్స్ ప్రొవైడర్ MSCI (Morgan Stanley Capital International), గౌతమ్ అదానీకి కాస్త ఊపిరి తీసుకునే సమయం ఇచ్చింది. అదానీ గ్రూప్ కంపెనీలు (Adani Group companies) అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్ వెయిటింగ్‌ల అప్‌డేట్ అమలును మే నెలలో జరిగే సమీక్ష వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మే నెలలో జరగనున్న రెగ్యులర్ రివ్యూతో పాటు ఈ రెండు కంపెనీలపైనా సమీక్ష జరుగుతుంది.
MSCI ఫిబ్రవరి నెల సమీక్ష నేటి నుంచి (2023 ఫిబ్రవరి 16వ తేదీ) నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 28వ తేదీ వరకు జరుగుతుంది. ఈ సమీక్షలో అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్‌ను MSCI మినహాయిస్తుంది, ఇండెక్స్‌లోని ఇతర స్టాక్స్ వెయిటేజీలను సమీక్షిస్తుంది.
అదానీ గ్రూప్ సంస్థల నిర్వహణ, పెట్టుబడుల్లో అక్రమాలు జరిగాయంటూ U.S. షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) జనవరి 24న నివేదిక తర్వాత.., అదానీ కంపెనీల్లోకి వచ్చిన కొన్ని పెట్టుబడుల విషయంలో "తగినంత అనిశ్చితి" ఉందని గుర్తించిన MSCI, ఈ గ్రూప్ కంపెనీల ఫ్రీ ఫ్లోట్ సైజ్‌ను పరిశీలించింది.
ఫ్రీ ఫ్లోట్ షేర్ల సంఖ్యను మదింపు చేసిన తర్వాత, అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ సంస్థ అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises), ఏసీసీ (ACC), అదానీ టోటల్ గ్యాస్ (Adani Total Gas), అదానీ ట్రాన్స్‌మిషన్ (Adani Transmission) వెయిటేజీని తన ఇండెక్స్‌లలో తగ్గించనున్నట్లు MSCI గత వారం తెలిపింది.
వెయిటేజీ మార్పుల అమలు నిర్ణయం ఎందుకు మారింది?
కొత్త ఇండెక్స్ వెయిటేజీలు మార్చి 1 నుంచి అమలులోకి రావాల్సి ఉంది. హఠాత్తుగా నిర్ణయం మార్చుకున్న MSCI, అదానీ టోటల్ గ్యాస్ & అదానీ ట్రాన్స్‌మిషన్ కోసం ప్రతిపాదించిన మార్పులను మే నెల వరకు వాయిదా వేసింది. ఈలోగా ఈ కంపెనీల ఫ్రీ ఫ్లోట్ షేర్ల సంఖ్య పెరిగితే, మే నెల సమీక్షలో MSCI ఇచ్చే ఇండెక్స్ వెయిటేజీలు కూడా మారవు. అంతేకాదు, మే నెల వరకు ఈ రెండు స్టాక్స్ నుంచి గ్లోబల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కు తీసుకోరు. అంటే, ప్రస్తుత వాయిదా నిర్ణయం ఈ రెండు కంపెనీలకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్, ACC వెయిటేజీల్లో మార్పులు అమల్లోకి రావలసివుంది.
ఇండెక్స్ వెయిటేజీలో మార్పులు ఉంటాయని ప్రకటించిన కొన్ని రోజుల్లోనే, దానిని వాయిదా వేస్తూ ఎందుకు నిర్ణయం తీసుకున్నారన్న అంశం మీద స్పందన కోసం రాయిటర్స్ ఈ-మెయిల్ పంపినా MSCI వెంటనే స్పందించలేదు. నిర్ణయం వాయిదాపై అదానీ గ్రూప్ కూడా స్పందించలేదు.
హిండెన్‌బర్గ్ నివేదిక బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ కంపెనీలను సంక్షోభంలోకి నెట్టింది, గ్రూప్ కంపెనీల విలువను దాదాపు $120 బిలియన్ల మేర తుడిచి పెట్టేసింది.
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికను అదానీ గ్రూప్ ఖండించింది. తమ కంపెనీల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, కంపెనీల ఆర్థిక ఆరోగ్యం పటిష్టంగా ఉందని ప్రకటించింది.
అదానీ గ్రూప్ కంపెనీల బాండ్ ఇన్వెస్టర్లతో ఇవాళ (2023 ఫిబ్రవరి 16), ఫిబ్రవరి 21 తేదీల్లో చర్చలు జరపాలని గ్రూప్ నిర్ణయించినట్లు రాయిటర్స్ రిపోర్ట్ చేసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.