LIC IPO: ఎల్‌ఐసీ ఐపీవోలో మరో ముందడుగు.. తాజా అప్‌డేట్ ఇదే!
ఎల్‌ఐసీ ఐపీవో ప్రక్రియ వేగవంతంగా ముందుకు సాగుతోంది. యాంకర్ ఇన్వెస్టర్లతో మాట్లాడేందుకు బ్యాంకర్లు సిద్ధమయ్యారు. వచ్చేవారం సెబీలో ముసాయిదా సమర్పించనున్నారు.
ఎల్‌ఐసీ ఐపీవో ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది! అర్హులైన యాంకర్ ఇన్వెస్టర్లను సంప్రదించేందుకు బ్యాంకర్లు సిద్ధమవుతున్నారు. దేశంలోనే అతిపెద్ద ఇష్యూకు అత్యంత డిమాండ్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పది మంది బ్యాంకర్లకు వంద మంది వరకు గ్లోబల్ ఇన్వెస్టర్లతో కూడిన జాబితా ఇచ్చారు.
డిసెంబర్ మొదటి వారంలో ఐపీవోకు సంబంధించిన ముసాయిదాను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి బ్యాంకర్లు సమర్పించనున్నారు. బీమా సంస్థ విలువను మదింపు చేయగానే ఈ ప్రక్రియ జరుగుతుంది. దీనిపై ఎల్‌సీఐ ప్రతినిధులు మాత్రం ఇంకా స్పందించలేదు.
ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూపై ప్రధాని నరేంద్రమోదీ ఎక్కువ శ్రద్ధ కనబరుస్తున్నారు! రూ.40,000 కోట్ల నుంచి లక్ష కోట్ల వరకు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెరుగుతున్న బడ్జెట్ అంతరాన్ని తగ్గించాలని పట్టుదలగా ఉన్నారు. కంపెనీ విలువను రూ.8 నుంచి 10 ట్రిలియన్ల మధ్య ఉండేలా చూసుకుంటున్నారు. 5 నుంచి 10 శాతం మధ్య వాటాను ఉపసంహరించాలని భావిస్తున్నారు.
ఎల్‌ఐసీలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించాలని ప్రభుత్వం భావిస్తోంది. వేర్వేరు రంగాలకు చెందిన ఇన్వెస్టర్ల మధ్య బలమైన డిమాండ్ సృష్టించేలా వైవిధ్యం ఉండేలా చూస్తున్నారు. యాంకర్ ఇన్వెస్టర్లతో చర్చలు పూర్తయితే ఐపీవోలో కీలక అడుగు పడినట్లే! ఏదేమైనా వచ్చే ఏడాది మార్చిలోపు ఇష్యూ పూర్తవ్వాలని, ఆలస్యం చేయకూడదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.
కొటక్ మహీంద్రా బ్యాంక్, గోల్డ్‌మన్ సాచెస్, జేపీ మోర్గాన్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సహా మొత్తం ఐదుగురు బ్యాంకర్లను ప్రభుత్వం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
Also Read: PM Modi Crypto Meeting: క్రిప్టో కరెన్సీపై మోదీ సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం!
Also Read: Financial Lessons for Kids: మీ పిల్లలకు ఈ 6 'డబ్బు' పాఠాలు నేర్పండి!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?