(Source: ECI/ABP News/ABP Majha)
Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?
రూ.ఐదు లక్షల్లోపు మంచి హ్యాచ్‌బ్యాక్ కారు కొనాలనుకుంటున్నారా? సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగోల్లో బెస్ట్ కారు ఏదంటే?
కొత్త హ్యాచ్‌బ్యాక్ కారు కొనాలనుకుంటున్నారా.. తాజాగా లాంచ్ అయిన మారుతి సెలెరియోతో మీరు చూడాల్సిన ఆప్షన్లు మరింత పెరిగాయి. చిన్న కార్లను రూపొందించడంలో మారుతి స్పెషలిస్ట్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మనదేశంలో హ్యాచ్‌బాక్‌లను అత్యధికంగా విక్రయిస్తున్న బ్రాండ్ అదే. కొత్త మారుతి సెలెరియో.. వాగన్ ఆర్, హ్యుండాయ్ శాంట్రో, టాటా టియాగో కార్లతో పోటీ పడనుంది. ఒకవేళ మీరు చిన్న కార్ కొనాలనుకుంటే వీటిలో ఏది బెస్ట్?
ఏది పెద్దది?
ఈ నాలుగు కార్లలో టాటా టియాగో ఎంతో పొడవైనది. దీని పొడవు 3765 మిల్లీమీటర్లుగా ఉంది. సెలెరియో పొడవు 3695 మిల్లీమీటర్లు కాగా.. వాగన్ ఆర్ పొడవు 3655 మిల్లీమీటర్లుగానూ, శాంట్రో పొడవు 3610 మిల్లీమీటర్లుగానూ ఉంది. ఈ నాలుగిట్లో వెడల్పులో కూడా టియాగోనే పెద్దది. దీని వెడల్పు 1677 మిల్లీమీటర్లుగా ఉంది. సెలెరియో వెడల్పు 1655 మిల్లీమీటర్లుగానూ, శాంట్రో వెడల్పు 1645 మిల్లీమీటర్లుగానూ, వాగన్ ఆర్ 1620 మిల్లీమీటర్లుగానూ ఉంది. ఇక వీల్ బేస్ విషయానికి వస్తే.. వాగన్ ఆర్, సెలెరియోల వీల్ బేస్‌లు పెద్దగా ఉన్నాయి. 2435 మిల్లీమీటర్ల వీల్ బేస్‌ను ఈ రెండు కార్లలో అందించారు. శాంట్రో, టియాగో వీల్ బేస్ 2400 మిల్లీమీటర్లుగా ఉంది. ఇక లోపల స్పేస్ విషయానికి వస్తే.. వాగన్ ఆర్ లోపల 341 లీటర్ల స్పేస్ అందించారు. సెలెరియో స్పేస్ 313 లీటర్లుగానూ, శాంట్రో స్పేస్ 235 లీటర్లుగానూ, టియాగో స్పేస్ 242 లీటర్లుగానూ ఉంది.
ఫీచర్లు
ప్రస్తుతం ఈ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న కార్లలో ఫీచర్లు తక్కువగా ఉంటున్నాయి. అయితే ఈ నాలుగు కార్ల టాప్ ఎండ్ వెర్షన్లలో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఉన్న టచ్‌స్క్రీన్ సిస్టమ్స్, పవర్ విండోస్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, యాబ్స్, స్టీరింగ్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సెలెరియోలో పవర్డ్ ఓఆర్‌వీఎమ్స్, పుష్ బటన్ స్టార్ట్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్‌తో పాటు హిల్ స్టార్ట్ అసిస్ట్ ఫీచర్ కూడా ఉంది. వాగన్ ఆర్‌లో కూడా సెలెరియో తరహాలోనే స్టీరింగ్ కంట్రోల్స్, పవర్డ్ ఓఆర్ఎమ్స్ ఉన్నాయి. శాంట్రోలో టచ్ స్క్రీన్‌తో పాటు రేర్ వ్యూ కెమెరా, వెనకవైపు ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి. శాంట్రోలో స్టీరింగ్ అడ్జస్ట్‌మెంట్, హైట్ అడ్జస్ట్‌మెంట్ లేకపోవడం మైనస్. టియాగోలో క్లైమెట్ కంట్రోల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉన్నాయి.
ఇంజిన్
కొత్త సెలెరియోలో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అందించారు. దీని కెపాసిటీ 66 హెచ్‌పీ కాగా, 89 ఎన్ఎం టార్క్‌ను ఇది అందించనుంది. వాగన్ ఆర్‌లో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు మరో వేరియంట్‌లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కూడా అందించారు. 1.2 లీటర్ ఇంజిన్ 82 హెచ్‌పీ, 113 ఎన్ఎం టార్క్‌ను అందించగా.. 1.0 లీటర్ వేరియంట్ 67 బీహెచ్‌పీ, 90 ఎన్ఎం టార్క్‌ను అందించనుంది. మారుతి కార్లలో 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ వేరియంట్లు ఉన్నాయి. శాంట్రోలో 1.1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అందించారు. దీని హార్స్ పవర్ 68 బీహెచ్‌పీగానూ, టార్క్ 99 ఎన్ఎంగానూ ఉంది. టియాగోలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అందించారు. ఇక మైలేజ్ విషయానికి వస్తే.. నాలుగు కార్లలోనూ సెలెరియో అత్యధికంగా లీటరుకు 26.68 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించనుంది. టియాగో మైలేజ్ 23.84 కిలోమీటర్లుగా ఉండగా.. వాగన్ ఆర్ మైలేజ్ 21.7 కిలోమీటర్లుగానూ, శాంట్రో మైలేజ్ 20 కిలోమీటర్లుగానూ ఉంది.
ధర
కొత్త సెలెరియో ధర రూ.4.99 లక్షల నుంచి రూ.6.94 లక్షల వరకు ఉంది. వాగన్ ఆర్ ధర రూ.4.93 లక్షల నుంచి రూ.6.45 లక్షల వరకు ఉంది. శాంట్రో ధర రూ.4.7 లక్షల నుంచి రూ.6.44 లక్షల వరకు ఉంది. టియాగో ధర రూ.4.99 లక్షల రూ.7.04 లక్షల వరకు ఉంది. వీటన్నిటిలో సెలెరియో అత్యంత సమర్థవంతమైన కారు కాగా.. ఇందులో ఫీచర్లు కూడా బాగానే ఉన్నాయి. వాగన్ ఆర్ కారులో స్పేస్ ఎక్కువగా ఉంది. శాంట్రో, టియాగోల్లో ప్రీమియం ఫీచర్లు అందించారు. కాబట్టి కారు కొనాలనుకునేవారు సమర్థవంతమైన కారు కావాలా? విశాలమైన కారు కావాలా? ప్రీమియం ఫీచర్లు ఉన్న కార్లు కావాలో చూసుకుని.. తమకు తగ్గ కారును సెలక్ట్ చేసుకోవచ్చు. ఈ అన్ని కార్ల ప్రారంభ వేరియంట్లు రూ.5 లక్షలలోపే ఉంటాయి.
Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!
Also Read: అదిరిపోయిన కొత్త సెలెరియో లుక్.. ఎలా ఉందో చూసేయండి!
Also Read: Car Comparision: 2021 టొయోటా ఫార్ట్యూనర్ వర్సెస్ ఎంజీ గ్లోస్టర్.. ఏది బెస్ట్ అంటే?