Road Accident Insurance: ఇలాగైతే బీమా చేయడమెందుకు?, 10 లక్షలకు పైగా పెండింగ్ కేసులు
RTI Report: బీమా కంపెనీలు 'తాబేలుతో పోటీ' పడడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ డేటాను బట్టి, రోడ్డు ప్రమాద బాధితుడు ఆర్థికంగా ఉపశమనం పొందడానికి సగటున నాలుగు సంవత్సరాలు పడుతుందని అంచనా వేశారు.
Road Accident Claims In Pending: దేశవ్యాప్తంగా, ఏటా వేల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ కేసుల్లో చాలామంది ప్రజలు గాయపడుతున్నారు లేదా చనిపోతున్నారు. మన దేశంలో, వాహన ప్రమాదంలో గాయపడిన వ్యక్తి లేదా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబం బీమా పాలసీని క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి, IRDAI నుంచి ఇటీవల బయటకు వచ్చిన సమాచారం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
10.46 లక్షల రోడ్డు ప్రమాద క్లెయిమ్‌లు పెండింగ్
భారతదేశంలో, రోడ్డు ప్రమాదాలకు సంబంధించి 10,46,163 క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ అన్ని క్లెయిమ్‌ల విలువ ఏకంగా 80,455 కోట్ల రూపాయలు. 2018-19 నుంచి 2022-23 సంవత్సరాల మధ్య పెండింగ్ క్లెయిమ్‌ల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. సమాచార హక్కు చట్టం (RTI) కింద దాఖలు చేసిన దరఖాస్తు ద్వారా ఈ విస్తుగొలిపే విషయం వెల్లడైంది. క్లెయిమ్ సెటిల్‌మెంట్ల విషయంలో బీమా కంపెనీలు 'తాబేలుతో పోటీ' పడడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ డేటాను బట్టి, రోడ్డు ప్రమాద బాధితుడు ఆర్థికంగా ఉపశమనం పొందడానికి సగటున నాలుగు సంవత్సరాలు పడుతుందని అంచనా వేశారు.
ఆర్‌టీఐ దరఖాస్తు దాఖలు చేసింది ఎవరు?
సుప్రీంకోర్టు న్యాయవాది KC జైన్, ఏప్రిల్‌లో, ఆర్‌టీఐ చట్టం కింద ఈ సమాచారాన్ని కోరారు. ఆయన పెట్టుకున్న అర్జీకి ప్రతిస్పందనగా, 'బీమా నియంత్రణ & అభివృద్ధి ప్రాధికార సంస్థ' (IRDAI) ఈ వివరాలను వెల్లడించింది. రాష్ట్రం & జిల్లాల వారీ వివరాలతో పాటు దేశవ్యాప్తంగాలో పెండింగ్‌లో ఉన్న మొత్తం మోటారు వాహన ప్రమాద క్లెయిమ్‌ల సంఖ్యను దేశ ప్రజలకు తెలియజెప్పడానికి KC జైన్ ఈ అర్జీ పెట్టారు.
RTI ద్వారా, కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖను అడిగిన ప్రశ్నలో ఈ మొత్తం సమాచారాన్ని KC జైన్ కోరారు. గత ఐదేళ్లలో దరఖాస్తు చేసుకున్న, సెటిల్ అయిన, ఇంకా పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌ల వార్షిక వివరాలను సుప్రీంకోర్టు లాయర్ అడిగారు. దీంతో పాటు, మోటారు వాహన ప్రమాదాల క్లెయిమ్‌లను త్వరగా పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుందా అనే సమాచారాన్ని కూడా అడిగారు.
"మన దేశంలో, పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌ల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. ఈ కారణంగా, రోడ్డు ప్రమాదాల్లో మరణించిన లేదా గాయపడిన వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు సకాలంలో ఆర్థిక సాయం అందడం లేదు. క్లెయిమ్‌ల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోంది" - న్యాయవాది KC జైన్
IRDAI సమాచారం ప్రకారం గత 5 సంవత్సరాల్లోని పెండింగ్ కేసులు, క్లెయిమ్‌ల విలువ
2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 52,713 కోట్ల విలువైన 9,09,166 క్లెయిమ్‌లు
2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 61,051 కోట్ల విలువైన 9,39,160 క్లెయిమ్‌లు
2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 70,722 కోట్ల విలువైన 10,08,332 క్లెయిమ్‌లు
2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 74,718 కోట్ల విలువైన 10,39,323 క్లెయిమ్‌లు
2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 80,455 కోట్ల విలువైన 10,46,163 క్లెయిమ్‌లు
ఆగ్రాకు చెందిన న్యాయవాది KC జైన్ అడిగిన ప్రశ్నకు IRDAI దేశవ్యాప్త కేసుల గురించి మాత్రమే సమాచారం ఇచ్చింది. రాష్ట్రాల వారీ & జిల్లాల వారీ సమాచారాన్ని వెల్లడించలేదు. ప్రాంతీయ స్థాయి సమాచారాన్ని, అందులోనూ అంతటి వివరణాత్మక సమాచారాన్ని IRDAI నిర్వహించదు అని సమాధానం చెప్పింది.
KC జైన్, సమాచారం తెలుసుకోవడంతోనే సరిపెట్టలేదు. యాక్సిడెట్ క్లెయిమ్‌ల చెల్లింపుల్లో జరుగుతున్న ఆలస్యంపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. క్లెయిమ్ కోసం అప్లై చేసుకున్న వెంటనే, మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్ 164A కింద, తాత్కాలికంగా మధ్యంతర చెల్లింపు జరిగేలా చూడాలని పిటిషన్‌లో కోరారు. మధ్యంతర చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకునేలా ఆదేశించాలని అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.
మరో ఆసక్తికర కథనం: సెక్షన్ 44AA, 44AB, 44AD ఎవరి కోసం? - ఏ ఐటీ ఫారం ఎంచుకోవాలి?