Google Layoffs: పైథాన్ బృందం మొత్తానికీ పొగబెట్టిన గూగుల్, ఒక్కరిని కూడా ఒదల్లేదు
Google Layoffs: అమెరికా వెలుపల చౌకగా దొరికే మ్యాన్ పవర్‌తో కొత్త బృందాన్ని ఏర్పాటు చేస్తోంది.
Google Layoffs: మూడేళ్ల క్రితం వరకు, గూగుల్‌లో ఉద్యోగం చేస్తున్నామంటూ టెక్కీలు చంకలు గుద్దుకునేవాళ్లు. ఇప్పుడు అదే కంపెనీలో గుండెను చేత్తో పట్టుకుని గడుపుతున్నారు. ఎప్పుడు ఎవరికి మూడుతుందో, ఎవరి ఉద్యోగం ఊడుతుందో అర్ధంగాక బీపీ, షుగర్, యాంగ్జైటీ వంటివన్నీ పెంచుకుంటున్నారు.
ప్రస్తుతం, గూగుల్‌లోని కొన్ని విభాగాల్లో లే-ఆఫ్స్ (ఉద్యోగాల తొలగింపు) కొనసాగుతున్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల నెత్తి మీద ఉద్వాసన కత్తి నిరంతరం వేలాడుతోంది. కాస్ట్ కటింగ్ కారణాలతో ఒకరి తర్వాత మరొకరిని సాగనంపుతోంది గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ (Alphabet). తాజాగా, మొత్తం పైథాన్ టీమ్‌కు (Google Python Team) పొగబెట్టిందని వివిధ మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి. సంస్థను విడిచి వెళ్లిపోవాలని టీమ్ మేనేజర్‌కు సైతం మర్యాదగా చెప్పిందట. ప్రస్తుతమున్న సిబ్బందికి ఇచ్చే జీతాల కంటే తక్కువ జీతాలకు కొత్త ఉద్యోగులను తీసుకోవాలన్న ఆలోచనే ఈ తొలగింపులకు కారణంగా తెలుస్తోంది.
అమెరికా వెలుపల కొత్త టీమ్
ఫ్రీ ప్రెస్ జర్నల్ నివేదిక ప్రకారం, సుందర్ పిచాయ్ (Sundar Pichai) నేతృత్వంలోని ఆల్ఫాబెట్, జీతాలు ఎక్కువనే కారణం చూపి తన పైథాన్ బృందం మొత్తాన్నీ ఒకేసారి తొలగించింది. ఆ టీమ్‌ను రీప్లేస్ చేయడానికి, అమెరికా వెలుపల చౌకగా దొరికే మ్యాన్ పవర్‌తో కొత్త బృందాన్ని ఏర్పాటు చేస్తోంది. జర్మనీలోని మ్యూనిచ్‌లో కొత్త జట్టు ఏర్పడుతుందని భావిస్తున్నారు. అక్కడి సిబ్బంది తక్కువ వేతనాలతో పని చేస్తారని ఫ్రీ ప్రెస్ జర్నల్ రాసింది.
భోరుమన్న బాధితులు
ఉద్వాసనకు గురైన గూగుల్ పైథాన్ బృందంలోని ఓ సభ్యుడు, తన మనోవేదనను వెళ్లగక్కాడు. రెండు దశాబ్దాలుగా గూగుల్‌లో పని చేశానని, అది తన కెరీర్లోనే అత్యుత్తమ ఉద్యోగమని వెల్లడించారు. ఇప్పుడు గూగుల్‌లో పని పోగొట్టుకోవడం పట్ల తీవ్ర నిరాశకు గురయ్యాడు. మేనేజర్‌తో సహా మొత్తం పైథాన్ టీమ్‌ను తొలగించినందుకు బాధపడుతున్నానని మరో ఉద్యోగి రాశాడు. ఇప్పుడు తమ స్థానంలో విదేశాల్లో కూర్చొని ఓ టీమ్ పని చేస్తుందని, పెట్టుబడిదారీ విధానంలోని ప్రతికూల ప్రభావం ఇదేనని వాపోయాడు.
అమెరికన్ పైథాన్ టీమ్ చాలా చిన్నది. అయినప్పటికీ, గూగుల్‌కు సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన చాలా పనులు చూసుకునేది.
బిజినెస్ ఇన్‌సైడర్ రిపోర్ట్ ప్రకారం, ఈ గ్లోబల్ టెక్ జెయింట్ రియల్ ఎస్టేట్ & ఫైనాన్స్ విభాగాల ఉద్యోగులను కూడా ఇంటికి పంపించింది. దీనికి ముందు కూడా.. ఇంజినీరింగ్, హార్డ్‌వేర్, అసిస్టెంట్ టీమ్‌ల నుంచి వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. సిబ్బందిపై చేసే వ్యయాలు తగ్గించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీపై పెట్టుబడులు పెంచేందుకు తొలగింపు నిర్ణయాలు తీసుకుంటోంది. ఊస్టింగ్‌ల నేపథ్యంలో.. గూగుల్ ఫైనాన్స్ చీఫ్ రూత్ పోరాట్ తన ఉద్యోగులకు ఇ-మెయిల్స్ పంపారు. కంపెనీ పునర్నిర్మాణం జరుగుతోందని అందులో రాశారు. బెంగళూరు, మెక్సికో, డబ్లిన్‌లో వృద్ధిపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.
మరో ఆసక్తికర కథనం: ఐసీఐసీఐ నుంచి ఐడీఎఫ్‌సీ వరకు - బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్, ఛార్జీల మోత మోగబోతోంది