Pele Assets Value: ఫుట్‌బాల్ మాంత్రికుడు పీలే ఆస్తుల విలువెంతో తెలుసా?, పాత తరం ఆటగాడైనా ఇప్పటి వాళ్లకు ధీటుగా సంపాదన
తన యుగంలో అత్యంత ఖరీదైన ఫుట్‌బాల్ ఆటగాడు పీలే. ప్రపంచంలో అత్యధికంగా సంపాదించిన అథ్లెట్లలో ఒకడిగా నిలిచాడు.
Pele Assets Value: 'కింగ్ ఆఫ్ ఫుట్‌బాల్' (King of Football), ఫుట్‌బాల్ మాంత్రికుడిగా (Football Wizard) పేరొందిన బ్రెజిల్‌కు చెందిన గొప్ప ఫుట్‌బాల్ క్రీడాకారుడు పీలే ఇప్పుడు మన మధ్య లేరు. 29 డిసెంబర్ 2022న, తన 82 సంవత్సరాల వయస్సులో మరణించారు. ప్రాణాంతక పెద్ద పేగు క్యాన్సర్‌తో పోరాడి, ఈ లోకం విడిచి వెళ్లారు.
ప్రపంచంలో ఏ ఫుట్‌బాల్ క్రీడాకారుడికి పీలే తరహా గౌరవం లభించి ఉండదు. 3 ఫిఫా (FIFA) ప్రపంచకప్‌లు గెలుచుకున్న మొదటి ఫుట్‌బాల్ ఆటగాడు అతను. బ్రెజిల్ తరఫున 4 ప్రపంచకప్‌లు ఆడాడు. ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఫుట్‌బాల్ ఆటగాడిగా బిరుదు పొందాడు. పీలే మీద ప్రజాదరణ కేవలం బ్రెజిల్ సరిహద్దులకే పరిమితం కాలేదు, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించి పెట్టింది.
100 మిలియన్ డాలర్ల సంపద
తన యుగంలో అత్యంత ఖరీదైన ఫుట్‌బాల్ ఆటగాడు పీలే. ప్రపంచంలో అత్యధికంగా సంపాదించిన అథ్లెట్లలో ఒకడిగా నిలిచాడు. ఆయనకు భారీ స్థాయిలో ఆస్తిపాస్తులు ఉన్నాయి. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం... ఫుట్‌బాల్ మాంత్రికుడైన పీలే సుమారు 100 మిలియన్ డాలర్ల ఆస్తిని తన వారసుల కోసం విడిచిపెట్టి, దివికి ఏగాడు.
ఫుట్‌బాల్‌తో పాటు, పీలే అనేక ప్రపంచ ప్రసిద్ధ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా డబ్బు సంపాదించాడు. పీలే వార్షిక సంపాదన దాదాపు 14 మిలియన్ డాలర్లు. వీసా & మాస్టర్‌కార్డ్ కంపెనీలకు పని చేశాడు. ప్యూమా వంటి షూ బ్రాండ్‌లకు కూడా ప్రచారం చేశాడు. బ్రాండ్ అంబాసిడర్‌గా చాలా డబ్బు సంపాదించాడు. 1992లో ఐక్యరాజ్యసమితి పర్యావరణ రాయబారిగా నామినేట్ అయ్యాడు. 1994లో యూనెస్కో (UNESCO) గుడ్‌విల్ అంబాసిడర్‌గా నామినేట్ అయ్యాడు.
విచిత్రమైన విషయం ఏంటంటే... ఆటలో ఎవరికీ అందనంత ఎత్తు ఎదిగినా, తన సంపదలో ఎక్కువ డబ్బును ఫుట్‌బాల్ కెరీర్ తర్వాతే పీలే సంపాదించాడు.
పేపర్ బంతితో ఆట నుంచి అంతర్జాతీయ దిగ్గజం వరకు
పీలే అక్టోబర్ 23, 1940న బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్‌లో జన్మించాడు. అతని పూర్తి పేరు ఎడ్సన్ అరంటెస్ డో నాసిమెంటో (Edson Arantes do Nascimento). ఫుట్‌బాల్ మైదానంలో పీలే చిరుతలా కదిలే వాడు. అతని కదలికలు, విన్యాసాలు అసమాన్యం. తన తరంలో ఎన్నెన్నో కొత్త రికార్డులు సృష్టించాడు. పీలేని.. 'బ్లాక్ పెర్ల్', 'కింగ్ ఆఫ్ ఫుట్‌బాల్', 'కింగ్ పీలే' సహా ఇంకా అనేక పేర్లతో అభిమానులు పిలిచే వాళ్లు.
ఫుట్‌బాల్ ప్రపంచంలో బ్రెజిల్‌ను అగ్రస్థానానికి చేర్చిన పీలే ప్రారంభ జీవితం చాలా దుర్భరంగా ఉండేది. నిరుపేద కుటుంబంలో పుట్టిన పీలేకు చిన్నప్పటి నుంచి ఫుట్‌బాల్ అంటే ఇష్టం. ఫుట్‌బాల్ గానీ, ఆటకు సంబంధించిన ఏ వస్తువు కొనడానికి గానీ అతని వద్ద డబ్బు లేదు. దీంతో, సావో పాలో వీధుల్లో వార్తాపత్రికల వ్యర్థాలను ఏరి, వాటిని బంతిలా తయారు చేసి ఆడేవాడు. పీలే టీ షాపుల్లో పని చేశాడు. లీగ్ మ్యాచ్‌ల్లో దాదాపు 650 గోల్స్, సీనియర్ మ్యాచ్‌ల్లో 1281 గోల్స్ చేసిన పీలే.. తన ప్యాషన్‌తో ఫుట్‌బాల్ ప్రపంచానికి రారాజుగా నిలిచాడు.