Facebook Shares Crash: ఒక్క రోజులో జుకర్‌బర్గ్‌కు రూ.2.2 లక్షల కోట్ల నష్టం- టిక్‌టాక్, ఆపిల్ ఎలా దెబ్బకొట్టాయంటే!
ఫేస్ బుక్ షేర్లు 26 శాతం పతనమై 237 డాలర్ల వద్ద ఉన్నాయి. సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ సంపద ఒక్కరోజులోనే రూ.2.2 లక్షల కోట్లమేర ఆవిరైంది. ఈ నేపథ్యంలో తాజా నష్టాలకు కారణమేంటో చూద్దాం!!
సోషల్ మీడియా, టెక్నాలజీ సంస్థలకు స్టాక్ మార్కెట్లో నష్టాలు తప్పడం లేదు! మొదట్లో విపరీతంగా కొనుగోళ్లు చేసిన ఇన్వెస్టర్లు ఇప్పుడు షేర్లను తెగనమ్మేందుకే ప్రయత్నిస్తున్నారు. ఫేస్‌బుక్ మాతృసంస్థ 'మెటా' తాజా క్వార్టర్లో నిరాశాజనక ఫలితాలు విడుదల చేసింది. ఫలితంగా రెండు రోజుల్లోనే కంపెనీ షేర్ల ధర 26 శాతం పతనమై 237 డాలర్ల వద్ద కొనసాగుతోంది. సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ సంపద ఒక్కరోజులోనే రూ.2.2 లక్షల కోట్లమేర ఆవిరైంది. ఈ నేపథ్యంలో తాజా నష్టాలకు కారణమేంటో చూద్దాం!!
చెక్ పెడుతున్న 'టిక్ టాక్'
కొన్నేళ్లుగా ఫేస్‌బుక్ వృద్ధికి తిరుగులేదు. అలాంటిది గతేడాది నుంచి డౌన్‌ట్రెండ్ మొదలైంది. ఫేస్‌బుక్‌ను రోజువారీ వినియోగిస్తున్న యూజర్ల తగ్గుతూ వస్తోంది. వీడియో ఆధారిత సోషల్ మీడియా టిక్‌టాక్, మెసేంజింగ్ సేవలు అందిస్తున్న టెలిగ్రామ్, స్లాక్‌కు విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. పోటీ తట్టుకోలేక మెటా సంస్థ ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లో లఘు వీడియోలు రూపొందించే రీల్స్‌పైనే దృష్టి సారించింది. దీనివల్ల అధిక ఆదాయం వచ్చే డిజిటల్ యాడ్ మెషిన్‌పై కాకుండా రాబడి తక్కువుండే వీడియో సేవలపై ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది.
చేదుగా 'ఆపిల్'
ఫేస్‌బుక్‌కు ఇప్పటికే ఉన్న పోటీ సరిపోనట్టుగా 'ఆపిల్' పక్కలో బల్లెంలా మారింది! యాడ్-టార్గెటింగ్ సామర్థ్యాన్ని తగ్గించే ఐఓఎస్‌ను ఆపిల్ ప్రవేశపెట్టింది. కొత్తగా ఐఓఎస్ అప్‌డేట్ చేసుకున్నవారు తమ సమాచారాన్ని సేకరించేందుకు ఇతర యాప్‌లు, పబ్లిషర్లకు కచ్చితంగా అనుమతి ఇవ్వాలి. దీంతో మెటా తన యాడ్ టార్గెటింగ్ చేసుకోలేకపోతోంది. 10 బిలియన్ డాలర్ల మేర ఆదాయాన్ని మెటా నష్టపోవాల్సి వచ్చిందట! రాబోయే కాలంలో మెటా పరిస్థితి మరింత దిగజారుతుందని బెయిర్డ్ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్టు కొలిన్ సెబాస్టియన్ అంటున్నారు.
మెటావర్స్‌తో నష్టాలు!
రాబోయే కాలంలో 'మెటావర్స్' ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఏలనుందని జుకర్‌వర్గ్ అభిప్రాయం. దాని ప్రేరణతోనే తన కంపెనీకి మెటాగా నామకరణం చేశాడు. అయితే మెటావర్స్‌ను పూర్తిగా నిర్మించేందుకు చాలా సమయం పడుతుందని, కొన్ని వందల కోట్ల డాలర్లను పెట్టుబడి పెట్టాల్సి ఉందని అంచనా. వాస్తవ, వర్చువల్ ప్రపంచాలను ఇంటర్‌మిక్స్ చేసేందుకు వినియోగిస్తున్న సాంకేతికపై గతేడాది 10 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. ఇంత సుదీర్ఘ కాలం వేచిచూసేందుకు ఇన్వెస్టర్లు ఇష్టపడటం లేదు. కాస్త త్వరగానే రాబడి కోరుకుంటున్నారు.
ప్రభుత్వ నియంత్రణ
ప్రభుత్వ పరంగా నియంత్రణ, ఆంక్షలు పెరగడంతో నష్టాలకు మరో కారణం. యువత ఎక్కువగా టిక్‌టాక్ వంటివి వాడుతుండటంతో వాటితో పోటీ పడేందుకు మెటా నిర్ణయించుకుంది. కానీ దానిపై యాంటీ ట్రస్టు కేసు ఉండటంతో మెటా పవర్‌ను తగ్గించేందుకు అమెరికా ప్రభుత్వం నియంత్రణ చర్యలు తీసుకుంటోంది. అంతేకాకుండా ఈ సంస్థ సోషల్ మీడియాలో నియంతృత్వం (మోనోపాలి) కోసం పాకులాడుతోందని, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సంస్థలను అందుకే కొనుగోలు చేసిందని యూఎస్ ఫెడరల్ కమిషన్ ఆరోపిస్తోంది. వాట్సాప్ వంటివి కొనుగోలు చేయడంతో వీరికి పోటీ లేకుండా పోయిందని ఆరోపిస్తోంది.
Also Read: Metaverse Meaning: మెటావర్స్.. ఓ మాయా ప్రపంచం.. సింపుల్‌గా చెప్పాలంటే వర్చువల్ జిందగీ!