EPFO Equity Investment: స్టాక్‌మార్కెట్లో ఈపీఎఫ్‌వో లాభాల పంట.. రూ.40,000 కోట్ల రాబడి
ఈపీఎఫ్‌వో సభ్యులకు శుభవార్త! స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులపై ఈపీఎఫ్‌వోకు 15 శాతం వరకు రాబడి వచ్చింది. దాదాపుగా రూ.40వేల కోట్లు లాభం వచ్చింది. ఎక్కువ వడ్డీరేటు ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది.
స్టాక్ మార్కెట్ పెరుగుదల ఈపీఎఫ్‌వోకు లాభాల పంట పండించింది! ఈక్విటీ మార్కెట్లో రూ.1.23 ట్రిలియన్ల పెట్టుబడికి 14.6 వార్షిక రాబడి వచ్చింది. దీంతో భవిష్యనిధిలో సొమ్ము దాచుకుంటున్న 60 మిలియన్ల ఉద్యోగులకు లాభం కలగనుంది. భారత్ 22, సెంట్రల్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ సెక్టార్ (సీపీఎస్‌ఈ) ఈటీఎఫ్ ఫండ్లు రాణించివుంటే లాభాలు మరింత ఎక్కువగా ఉండేవి.
ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యంగా భారత్ 22 ఈటీఎఫ్ ఆవిష్కరించారు. ఇక ఎంపిక చేసిన ప్రభుత్వ రంగ సంస్థల వృద్ధిని సీపీఎస్‌ఈ ట్రాక్ చేస్తుంది. భారత్ 22 ద్వారా ఈపీఎఫ్‌వోకు కేవలం 2.1 శాతం వార్షిక రాబడి మాత్రమే వచ్చింది. ఇక సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌తో నెగెటివ్ రాబడి (-1.7%) రావడం గమనార్హం.
స్టాక్ మార్కెట్లో ఎక్కువ రాబడి వస్తే ఈపీఎఫ్‌వో ఎక్కువ వడ్డీ ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. అయితే కొన్ని రకాల ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు నష్టాలు కలగజేశాయని తెలిపారు. సీపీఎస్‌ఈ, భారత్ 22 ఈటీఎఫ్‌ల కన్నా ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్, యూటీఐ మ్యూచువల్ ఫండ్ నిర్వహించే ఈపీఎఫ్ పెట్టుబడులపై ఎక్కువ రాబడి వచ్చింది. కాగా ఈపీఎఫ్‌వో కేవలం ఈటీఎఫ్‌ల ద్వారానే స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.
2021, మార్చి 31 నాటికి ఈపీఎఫ్‌వో సొమ్మును నిఫ్టీ, సెన్సెక్స్‌లో మదుపుచేసిన ఎస్‌బీఐ ఎంఎఫ్ 15.76 శాతం రాబడి వచ్చింది. యూటీఐ ఎంఫ్ ఫండ్ ద్వారా 16.37 శాతం రాబడి వచ్చింది. ప్రతికూల రాబడి ఇస్తున్న భారత్ 22, సీపీఎస్‌ఈలో పెట్టుబడులు పెట్టొద్దని నిపుణులు కోరుతున్నారు.
2021 ఆర్థిక ఏడాది ముగింపు నాటికి ఈపీఎఫ్‌వో నికర పెట్టుబడులు రూ.122,986 కోట్లుగా ఉన్నాయి. స్టాక్‌మార్కెట్లో 14.67 శాతం వార్షిక రాబడితో వీటి విలువ రూ.1.6 ట్రిలియన్లకు పెరిగింది. ఇందులో ఎస్‌బీఐ రూ.86,577 కోట్లు, యూటీఐ రూ.26,401 కోట్ల పెట్టుబడులను నిర్వహిస్తున్నాయి. ఇక భారత్ 22, సీపీఎస్‌లో సంయుక్తంగా రూ.10,007 కోట్లు ఉన్నాయి.
Also Read: LIC IPO: ఎల్‌ఐసీ ఐపీవోలో మరో ముందడుగు.. తాజా అప్‌డేట్ ఇదే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి