Ashwin In Politics: రాజకీయ చదరంగంలోకి అశ్విన్..!!l తమిళ పాలిటికల్ ఎంట్రీ కోసమే హిందీ వ్యతిరేక వ్యాఖ్యలా!
Ashwin In Politics: క్రికెట్ రంగంలో ఉన్నత శిఖరాలకు చేరిన అశ్విన్.. తన లక్కును రాజకీయ రంగంలో చెక్ చేసుకోవాలని భావిస్తున్నట్లు పలువురు అంచనా వేస్తున్నారు.

Ashwin Vs Hindi : ఆయా రంగాల్లో పేరు పొందిన తర్వాత రాజకీయ రంగంలోకి అడుగు పెట్టిన ఎంతో మంది దిగ్గజాలను మనం ఇప్పటివరకు చాలామందిని చూసే ఉంటాం. ముఖ్యంగా సినీ, క్రీడల రంగంలో ఇప్పటివరకు ఈ తరహా ధోరణి చాలా కనపడుతోంది. తన వ్యక్తిగత ఇమేజ్ ద్వారా చట్ట సభల్లోకి అడుగుపెట్టి, అధికారాన్ని అందుకోవాలని చాలామంది తహతహలాడారు. అయితే అతి కొద్ది మంది మాత్రమే అత్యున్నత స్థానాలను దక్కించుకున్నారు. క్రికెట్ విషయానికొస్తే గత తరపు హీరో, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఏకంగా దేశ ప్రధాని పదవిని అలంకరించాడు. మనదేశంలో కనీసం ముఖ్యమంత్రి లెవల్ కైనా ఎదిగిన క్రికెటర్లు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా స్వతంత్ర భారతదేశంలో ఈ ఫీట్ రికార్డు కాలేదు. చాలామంది క్రికెటర్లు ఎంఎల్ఏలు, ఎంపీలు, మంత్రులుగా వ్యవహరించిన చరిత్ర ఉంది. అంతెందుకు టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ మొన్నటి వరకు ఢిల్లీ నుంచి ఎంపీగా లోక్ సభకు ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుతం ఈ కోవలోకి రావాలని భారత దిగ్గజ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన హిందీపై వ్యంగ్యంగా మాట్లాడటం, హిందీకి వ్యతిరేఖమైన తమిళనాడులో ఈ వ్యాఖ్యలు చోటు చేసుకోవడంపై పలువురు వివిధ రకాలుగా విశ్లేషిస్తున్నారు.
ద్రవిడ వాదం బలంగా..
తమిళనాడులో అధిక పార్టీలు ద్రవిడ వాదం పునాదులుగా ఏర్పడ్డాయి. ముఖ్యంగా డీఎంకే లాంటి పార్టీలు హిందీ వ్యతిరేకత చల్లారకుండా ఎప్పటికప్పుడు పరుష వ్యాఖ్యలు చేస్తూ, పబ్బం గడుపుతున్నాయి. తాజాగా అశ్విన్ కూడా హిందీని జాతీయ భాష కాదని ద్రవిడ వాదుల్ని మెప్పించేందుకు ప్రయత్నించినట్లు పలు వాదనలు ఉన్నాయి. దేశంలో చాలా అధికారిక భాషలున్నాయని, అందులో హిందీ ఒకటని హిందీ ప్రాభవాన్ని తేలిగ్గా తీసిపారేయడం ఈ కోవలోకే వస్తుందన తెలుస్తోంది. తమిళనాడులో అధికారంలో డీఎంకే ఉంది. హిందీ వ్యతిరేక వార్తలతో ఆ పార్టీని ప్రసన్నం చేసుకుని చట్ట సభల్లోకి అడుగుపెట్టాలని అశ్విన్ ఇలాంటి వ్యాఖ్యలు ఏవైనా చేశాడేమోనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి దేశంలో అత్యధిక మంది మాట్లాడే భాష అయిన హిందీని దేశవ్యాప్తంగా రుద్దాలని కేంద్రం ఎప్పటి నుంచో వివిధ రకాలుగా ప్రయత్నిస్తోంది. ప్రధానిగా నరేంద్ర మోడీ పగ్గాలు చేపట్టాకా ఈ ప్రయత్నాలు మరింత జోరుగా ఉన్నాయి. ఇటీవలే ఐపీసీ చట్టాలను హిందీలోకి మార్చడం వివాదస్పదమైంది. దేశమంత వర్తించే చట్టాలకు హిందీ పేర్లు పెట్టడమేంటని విమర్శలు వచ్చాయి. అయినా కూడా మోడీ ద్వయం లెక్క చేయలేదు. ఇలాంటి హిందీ ప్రాభవానికి గండి కొట్టి, తమిళనాడు పార్టీల నజర్లో పడాలని అశ్విన్ ఏమైనా ప్రయత్నిస్తున్నడామోనని పలువురు పేర్కొంటున్నారు. కొత్తగా వచ్చిన విజయ్ పార్టీలోకి వెళ్లే ఆలోచన కూడా లేకపోలేదని అంటున్నారు.
దేశంలో చట్టసభల్లోకి వెళ్లిన చాలామంది క్రికెటర్లు..
అటు ఎగువ సభ అయిన రాజ్య సభ నుంచి మొదలుకుని, లోక్ సభ ఇటు రాష్ట్ర విధానసభల్లోకి ఎన్నికైన ఎంతోమంది క్రికెటర్ల మనకు కనిపిస్తారు. బీజేపీ తరపున గతంలో కీర్తీ ఆజాద్ ఎంపీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి మాజీ కెప్టెన్, ఎండీ అజారుద్దీన్ ఎంపీగా గెలిచారు. బెంగాల్ నుంచి మనోజ్ తివారీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా అయ్యారు. ఇక సచిన్ టెండూల్కర్ రాజ్య సభకు ప్రాతినిథ్యం వహించారు. క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. అలాగే టర్బోనేటర్ హర్భజన్ సింగ్ కూడా రాజ్యసభ ఎంపిగా ఎన్నికయ్యాడు. ఎంపీలుగా ఎన్నికైన వారిలో యూసుఫ్ పఠాన్, చేతన్ చౌహాన్, మనోహర్ సింగ్ జి ప్రద్యమన్ సింగ్ జి ఉండగా, బెంగాల్ అసెంబ్లీకి లక్ష్మీ రతన్ శుక్లా ఎన్నికయ్యాడు. ఏదేమైనా వ్యక్తిగతంగా ఎన్ని కీర్తి ప్రతిష్టలు పొందినా, అధికారం అందించే కిక్కే వేరు దాని కోసం తమ లక్కున ప్రయత్నించాలనే క్రికెటర్లు చాలామంది ఉన్నారు. ఈ జాబితాలో అశ్విన్ కూడా ఉన్నారని తాజాగా కొంతమంది వాదిస్తున్నారు.
Also Read: Ashwin Comments: ద్రవిడ వాదానికి అశ్విన్ మద్ధతు..!! హిందీపై సంచలన వ్యాఖ్యలు చేసిన లెజెండరీ స్పిన్నర్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

