Diamonds: వజ్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది, రేటే సగానికి పడిపోయింది
కృత్రిమ వజ్రాల (ల్యాబ్ మేడ్ డైమండ్స్) ధర 50 శాతం వరకు పడిపోయింది.
Diamond Resale Value: వజ్రాభరణాలను హోదాకు, ప్రేమకు గుర్తుగా భావిస్తారు. అయితే, వాటి రేటు చాలా ఎక్కువగా, సామాన్యుడికి అందనంత అధికంగా ఉంటుంది. ఇప్పుడు, వజ్రాలు & వజ్రాభరణాలను కొనుగోలు చేసే డైమండ్ ఛాన్స్ వచ్చింది. ప్రస్తుతం వజ్రాల ధరలు 50 శాతం వరకు పడిపోయాయి.
వజ్రాల ధరలు తగ్గడానికి కారణాలు
చాలా విషయాలు కలిసి వజ్రాలను చౌకగా మార్చాయి. మొదటి కారణం.. మార్కెట్లో డిమాండ్ కంటే సరఫరా ఎక్కువగా ఉంది. ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలు, ఐరోపా & ఆసియాలో యుద్ధాల కారణంగా పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా వజ్రాల ప్రకాశాన్ని తగ్గించాయి. ఈ పరిస్థితుల్లో, గత ఏడాది కాలంలో సహజ వజ్రాల ధర 30 శాతం క్షీణించింది. కృత్రిమ వజ్రాల (ల్యాబ్ మేడ్ డైమండ్స్) ధర 50 శాతం వరకు పడిపోయింది.
ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రస్తుతం మీరు హాఫ్ రేటుకే వజ్రాలను కొనొచ్చు. ఇప్పుడు దేశంలో పండుగల సందడి నెలకొంది. ధన్‌తేరస్, దీపావళి వంటి పండుగలు మరికొన్నాళ్లలో రానున్నాయి, ఆభరణాలు, రత్నాల కొనుగోలుకు వాటిని శుభ సందర్భాలుగా భారతీయులు భావిస్తారు. మీకు కూడా అలాంటి నమ్మకం ఉంటే... వజ్రాలు, వజ్రాభరణాల కొనుగోలుకు అత్యంత అనుకూలమైన సమయం ఇది.
80 శాతం వరకు నష్టం
అయితే, వజ్రాలను కొనుగోలు చేయడంలో ఉన్న అతి పెద్ద లోపం దాని 'రీసేల్ వాల్యూ'. డైమండ్ ప్రో ప్రకారం, వజ్రాన్ని తిరిగి అమ్మాలంటే దాని విలువ ఎప్పుడూ కొనుగోలు ధర కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కోసారి, రీసేల్ వాల్యూ విలువ అసలు ధరలో 20 శాతానికి మాత్రమే పరిమితం కావచ్చు. సాధారణంగా, వజ్రం పునఃవిక్రయం విలువ కొనుగోలు విలువలో 20 నుంచి 60 శాతం వరకు ఉంటుంది. అంటే కనీసం 40 శాతం నష్టం వస్తుంది. ఈ లాస్ గరిష్టంగా 80 శాతం వరకు ఉండొచ్చు. ఇంకా వివరంగా చెప్పాలంటే... లక్ష రూపాయలు పెట్టి కొన్ని వజ్రాన్ని తిరిగి విక్రయిస్తే 20 వేల రూపాయలు మాత్రమే దక్కవచ్చు.
వజ్రాల ధర నిర్ణయమిలా..
వజ్రం విలువను 4C స్కేల్ ద్వారా నిర్ణయిస్తారు. 4C అంటే కట్ క్వాలిటీ, కలర్, క్లారిటీ, క్యారెట్ వెయిట్. వజ్రాలను అమ్మే ముందు వాటిని సర్టిఫై చేస్తారు. వాటిని GIA లేదా AGS సర్టిఫికేషన్ అంటారు. వాటిని ప్రైవేట్ ల్యాబ్‌లో పరీక్షిస్తారు. ఇది, వజ్రం స్వచ్ఛత, నాణ్యతకు సంబంధించిన ధృవీకరణ. మీరు వజ్రాన్ని కొనుగోలు చేసిన ధరతో సంబంధం లేకుండా, ఈ సస్టిఫికేషన్ ఆధారంగా దాని రీసేల్ వాల్యూని నిర్ణయిస్తారు.
అతి ముఖ్యమైన అంశం... వజ్రాలను సులభంగా అమ్మలేం. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో, నగల వ్యాపారి వద్ద బంగారం, వెండి ఆభరణాలను కుదువ పెట్టొచ్చు/అమ్మొచ్చు. వజ్రాల విషయంలో ఇది అంత ఈజీ కాదు. వజ్రాలను విక్రయించడానికి కొన్ని ఆప్షన్లు మాత్రమే మీకు ఉంటాయి. కాబట్టి, పెట్టుబడి కోణం నుంచి డైమండ్ లేదా డైమండ్ జ్యువెల్లరీ మంచి ఆప్షన్ కాదు. మీకు సరిపడినంత ఆదాయం, పొదుపులు, వజ్రాల మీద ఇష్టం కూడా ఉంటే.. రెండో ఆలోచన లేకుండా వజ్రాలను కొనవచ్చు.
మరో ఆసక్తికర కథనం: కోట్లు పెట్టి కొంటున్నా ఈ కక్కుర్తేమిట్రా అయ్యా, వైరల్ అవుతున్న వీడియో
Join Us on Telegram: https://t.me/abpdesamofficial