Viral video: కోట్లు పెట్టి కొంటున్నా ఈ కక్కుర్తేమిట్రా అయ్యా, వైరల్ అవుతున్న వీడియో
ఈ వీడియోను చూస్తే, 100 మందికి పైగా ప్రజలు ఒక బిల్డింగ్ బయట క్యూలో నిలబడడం కనిపిస్తుంది.
Pune Apartment: కరోనా తర్వాత సొంత ఇంటి అవసరమేంటో జనానికి తెలిసొచ్చింది. దీంతో, మహమ్మారి తర్వాతి కాలం నుంచి రియల్ ఎస్టేట్ రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. దేశవ్యాప్తంగా చిన్న, పెద్ద నగరాల్లో ఇళ్ల రేట్లు, అద్దెలు బాగా పెరిగినట్లు చాలా రీసెర్చ్‌లు రుజువు చేశాయి. ధరలు పెరిగినా అదరకుండా, బెదరకుండా సొంతిల్లు కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.
ఇప్పుడు, సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మహారాష్ట్రలోని పుణెలో తీసినట్లు చెబుతున్నారు. ఈ వీడియోను చూస్తే, 100 మందికి పైగా ప్రజలు ఒక బిల్డింగ్ బయట క్యూలో నిలబడడం కనిపిస్తుంది. దాదాపు కోటిన్నర నుంచి రూ.2 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసేందుకు వీళ్లంతా క్యూ కట్టారట.
People stand in a queue for 8 hours to buy a new 1.5-2 crore apartment in Pune. (📸- @Ayeits_Ekant) pic.twitter.com/AMs8f8Jtej
— Update Chaser (@UpdateChaser) October 27, 2023
ట్వీట్‌లో ఉన్న మ్యాటర్ ప్రకారం, పుణె నగరానికి 15 కి.మీ. దూరంలో ఉన్న వాకాడ్ ప్రాంతంలో ఈ వీడియో షూట్ చేశారు. సొంత ఇంటిని కొనుగోలు చేయడానికి వీళ్లంతా క్యూలో నిలబడ్డారు. ఇలా 5, 10 నిమిషాలు కాదు... దాదాపు 8 గంటల పాటు లైన్లలోనే పడిగాపులు పడ్డారట. అక్కడేమైనా దసరా, దీపావళి బ్లాక్ బస్టర్ డిస్కౌంట్స్ పెట్టారా అంటే, అదీ లేదు. ఒక్కో ఫ్లాట్‌ను కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయలు పెట్టి కొంటూ కూడా ఈ కక్కుర్తేమిట్రా బాబూ అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
నెటిజన్ల రియాక్షన్
వీడియోను షేర్ చేసిన యూజర్, కోట్లు పెట్టి ఇల్లు కొనడానికి ఎవరైనా ఇలా 8 గంటలు పడిగాపులు పడతారా అని ప్రశ్న అడిగాడు. దీనికి చాలా మంది నుంచి రిప్లైస్ వచ్చాయి. ఇల్లు కొనడానికి ఎక్కువ కాలం వెయిట్ చేసినా తప్పులేదని ఒకరు ట్వీట్ చేశారు. ఇలా క్యూలో నిలబడి ఇల్లు కొనడానికి తాము ఇష్టపడబోమని మరికొందరు రాశారు. అక్కడ నిలబడి ఉన్న వ్యక్తులు రూ. 1.5 కోట్లు లేదా రూ. 2 కోట్లు పెట్టి ఇల్లు కొనే స్థోమత ఉందా, వాళ్ల దగ్గర కోట్ల రూపాయలు ఉన్నట్లు తాను భావించడం లేదని మరో యూజర్ చెప్పాడు. బ్యాంకులను బతికించడానికి వీళ్లలో ఎక్కువ మంది ప్రయత్నిస్తున్నారని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.
ఇది నమ్మడం కష్టం అని మరో వినియోగదారు రాశారు. బిల్డర్ మార్కెటింగ్ స్ట్రాటెజీ కావచ్చని మరొకరు ఊహించారు. ఐఫోన్ లాంచ్ రోజున ఇదే విధమైన క్యూ కనిపిస్తుంది కాబట్టి ఇందులో తప్పేం ఉందని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ వ్యక్తులంతా ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులే గానీ, అసలు కొనుగోలుదార్లు కాకపోవచ్చని మరొకరు అనుమానం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది.
గమనిక: ఈ వైరల్ వీడియోను పాఠకులకు ముందుకు తేవడమే 'abp దేశం' ఉద్దేశం తప్ప, దీనిని ధృవీకరించలేదని దయచేసి గమనించండి.
మరో ఆసక్తికర కథనం: ఆరంభ నష్టాల నుంచి బౌన్స్ బ్యాక్, తొలి గంటలో పుంజుకున్న మార్కెట్లు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial