Credit Card Portability: మొబైల్ నంబర్ లాగా క్రెడిట్ కార్డ్‌ను కూడా పోర్ట్ చేయొచ్చు, పూర్తి ప్రాసెస్ తెలుసుకోండి
తమకు ఇష్టమైన క్రెడిట్ కార్డ్ నెట్‌వర్క్‌ను ఎంచుకునే ఆప్షన్ కస్టమర్లకే ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ చెబుతోంది.
Credit Card Portability: భారతదేశంలో బ్యాంకింగ్ సర్వీసులు బాగా పెరగడంతో, క్రెడిట్ కార్డుల పరిధి & యూజర్ల నంబర్ చాలా వేగంగా పెరుగుతోంది. క్రెడిట్ కార్డ్ రూల్స్ కూడా మారుతున్నాయి. తాజాగా.. క్రెడిట్ కార్డ్ వినియోగం విషయంలో, కొత్త మార్పు తీసుకొచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ సిద్ధమైంది.
క్రెడిట్ కార్డ్ నెట్‌వర్క్ పోర్టబిలిటీ
మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP) మనకు కొత్తమీ కాదు. ప్రస్తుత సర్వీస్ ప్రొవైడర్‌తో మీరు సంతోషంగా లేకుంటే, MNP ద్వారా ఈజీగా వేరే సర్వీస్ ప్రొవైడర్‌కు మారవచ్చు. క్రెడిట్ కార్డుల విషయంలోనూ సరిగ్గా ఇలాంటిదే చేయాలనుకుంటోంది రిజర్వ్ బ్యాంక్. దీనికి 'క్రెడిట్ కార్డ్ నెట్‌వర్క్ పోర్టబిలిటీ' అని పేరు పెట్టింది.
క్రెడిట్ కార్డ్ నెట్‌వర్క్ అంటే ఏంటి?
మీరు క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తుంటే, మీ కార్డ్‌పై మాస్టర్ కార్డ్, వీసా, రూపే, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనర్స్ క్లబ్ వంటి పేర్లు కనిపిస్తాయి. ఇవే క్రెడిట్ కార్డ్ నెట్‌వర్క్‌లు. క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయడానికి బ్యాంకులు ఈ నెట్‌వర్క్‌లతో టై-అప్ అవుతాయి. ఈ నెట్‌వర్క్‌లు క్రెడిట్ కార్డ్ లావాదేవీలు జరిగేలా చూస్తాయి. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, వివిధ బ్యాంకుల మధ్య వంతెనలా పనిచేస్తాయి. ఇప్పటివరకు, కస్టమర్‌కు ఏ నెట్‌వర్క్ కార్డ్ ఇష్యూ చేయాలో బ్యాంకులే నిర్ణయిస్తున్నాయి.
తమకు ఇష్టమైన క్రెడిట్ కార్డ్ నెట్‌వర్క్‌ను ఎంచుకునే ఆప్షన్ కస్టమర్లకే ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ చెబుతోంది. ఇందుకోసం ఒక డ్రాఫ్ట్ సర్క్యులర్‌ను విడుదల చేసింది. ఈ డ్రాఫ్ట్ రూల్‌గా మారితే, నెట్‌వర్క్ బంతి బ్యాంకుల వద్ద నుంచి కస్టమర్ కోర్టులోకి చేరుతుంది. ఇకపై, కొత్త కార్డ్ జారీ చేసే సమయంలో, కస్టమర్‌కు ఏ నెట్‌వర్క్ కావాలో బ్యాంకులు అడగాల్సి ఉంటుంది.
పాత క్రెడిట్ కార్డ్ పరిస్థితేంటి?
కొత్త కార్డులకేనా కొత్త ఫెసిలిటీ, పాత కార్డ్‌ల పరిస్థేంటి? అంటే, పాత కార్డ్‌ను కూడా మీకు ఇష్టమైన నెట్‌వర్క్‌లోకి మార్చుకోవచ్చు. అయితే, ప్రతి క్రెడిట్ కార్డ్‌కు ఒక వాలిడిటీ ఉంటుంది. మీ కార్డ్ వాలిడిటీ పూర్తయితే, బ్యాంక్‌లు కొత్త డేట్‌తో మరో కార్డ్ ఇష్యూ చేస్తాయి. ఇలా, కార్డ్ రెన్యూవల్ సమయంలో నెట్‌వర్క్ మార్చుకునే అవకాశం ఎగ్జిస్టింగ్ కార్డ్స్ విషయంలో ఉంటుంది.
'క్రెడిట్ కార్డ్ నెట్‌వర్క్ పోర్టబిలిటీ' అమల్లోకి వస్తే కస్టమర్లు ఎక్కువ బెనిఫిట్స్ పొందుతారు. వివిధ నెట్‌వర్క్‌లు తమ కార్డ్స్ మీద విభిన్న ఫీచర్స్ అందిస్తుంటాయి. కొన్ని కార్డులకు తక్కువ ఫీజు ఉండొచ్చు, మరికొన్నింటికి ఎక్కువ రివార్డ్ లభించొచ్చు. ప్రతి నెట్‌వర్క్‌కు క్యాష్‌బ్యాక్ పర్సంటేజీ, యూజర్ రివార్డ్స్ వేర్వేరుగా ఉంటాయి. నెట్‌వర్క్‌ను మార్చుకునే ఆప్షన్ అందుబాటులోకి వస్తే, వినియోగదార్లు తమ అవసరాలకు అనుగుణంగా నెట్‌వర్క్ ఎంచుకోవచ్చు.
రూపే నెట్‌వర్క్‌కు లాటరీ తగిలినట్లే!
దేశీయ నెట్‌వర్క్ రూపే, 'క్రెడిట్ కార్డ్ నెట్‌వర్క్ పోర్టబిలిటీ' నుంచి భారీ ప్రయోజనం పొందవచ్చు. రిజర్వ్ బ్యాంక్, క్రెడిట్ కార్డ్స్ కోసం UPI ఫీచర్ తీసుకొచ్చింది. అయితే, రూపే నెట్‌వర్క్ కార్డ్ యూజర్లు మాత్రమే ఈ ఫెసిలిటీని ఉపయోగించగలరు. కాబట్టి, నెట్‌వర్క్ మార్చుకునే సదుపాయం అందుబాటులోకి వస్తే, యూజర్లు పెద్ద సంఖ్యలో రూపే నెట్‌వర్క్‌కు మారే అవకాశం ఉంది.
ఈ ఏడాది అక్టోబర్ 1 నాటికి 'క్రెడిట్ కార్డ్ నెట్‌వర్క్ పోర్టబిలిటీ'ని తీసుకురావాలని ఆర్‌బీఐ భావిస్తోంది.
మరో ఆసక్తికర కథనం: లోన్ రేట్లు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మీ EMI మరింత భారం కావచ్చు!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial