Budget 2023: టాక్స్ రిలీఫ్, టీడీఎస్ క్లారిటీ, శ్లాబుల మార్పు - బడ్జెట్‌లో ఉద్యోగుల కోరికలివే!
Budget 2023: కొత్త ఏడాదిలోకి అలా అడుగు పెట్టామో లేదో వెంటనే బడ్జెట్ సీజన్ మొదలవుతుంది. సామాన్యులు, ప్రొఫెషనల్స్, ఉద్యోగుల్లో ఆశల చిట్టా విప్పుకుంటుంది. మరి వారి కోరికలేంటో తెలుసా!
Budget 2023:
కొత్త ఏడాదిలోకి అలా అడుగు పెట్టామో లేదో వెంటనే బడ్జెట్ సీజన్ మొదలవుతుంది. సామాన్యులు, ప్రొఫెషనల్స్, ఉద్యోగుల్లో ఆశల చిట్టా విప్పుకుంటుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సారైనా తమ వినతులను పట్టించుకోక పోతుందా అని ఆశగా ఎదురు చూస్తుంటారు. పన్నుల తగ్గింపు నుంచి మినహాయింపుల వరకు కొన్నైనా తీరుస్తుందేమోనని ఆశిస్తారు. కాగా 2023 బడ్జెట్‌లో పన్నుల నుంచి ఉపశమనం కల్పించే అవకాశాల్లేవని తెలుస్తోంది.
ఉపశమనం స్వల్పమే!
కేంద్ర ప్రభుత్వానికి 2023 బడ్జెట్ అత్యంత కీలకం. ఆ తర్వాతి ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో పూర్తి స్థాయి చివరి బడ్జెట్ ఇదే అవుతుంది. సాధారణంగా ఎన్నికల సమయంలో ప్రభుత్వాలు జనాకర్షక పథకాలకు ఎక్కువ డబ్బు కేటాయిస్తుంటాయి. మరోసారి కరోనా కలకలం చెలరేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగైతే ఈ సారీ ఉచిత రేషన్ అందించేందుకు ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి పెద్దగా ఉపశమనం దక్కకపోవచ్చని నిపుణులు అంటున్నారు. ఉద్యోగులకు సంబంధించి కొన్ని అంచనాలైతే ఉన్నాయి.
ప్రిజమ్‌ప్టివ్ టాక్సేషన్ పరిధి పెంపు!
కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రిజమ్‌ప్టివ్ టాక్సేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో ప్రొఫెషనల్స్ ఆర్జించిన ఆదాయంలో సగం మాత్రమే పన్ను చెల్లించాల్సి ఆదాయంగా పరిగణిస్తారు. ఏటా రూ.50 లక్షల ఆదాయం పొందుతున్న వారే ఈ పథకంలో చేరేందుకు అర్హులు. బహుశా మోదీ సర్కారు ఈ పరిమితిని రూ.75 లక్షల లేదా కోటి వరకు పెంచుతుందని భావిస్తున్నారు.
టీడీఎస్ అంశంలో క్లారిటీ!
టీడీఎస్ అంశంలో మహీంద్రా అండ్ మహీంద్రా కేసులో సెక్షన్ 194-Rకు సంబంధించి ఓ కీలక తీర్పు వెలువరించింది. దీని ప్రకారం టీడీఎస్‌పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఒక వృత్తిలో రైటాఫ్ చేసే రుణం ద్వారా వచ్చే ప్రయోజనం లేదా పెరిక్విసైట్‌పై స్పష్టత ఇవ్వాలి. దీనిని 194-R పరిధి నుంచి తప్పించాలి. ప్రాక్టికల్ ఇబ్బందులు ఉండటంతో కొన్ని నెలల సమయం ఇవ్వాలని నిపుణులు కోరుతున్నారు. ప్రావిజన్ అమలయ్యే తేదీని వెనక్కి జరపాలి.
పన్ను శ్లాబుల్లో మార్పు
ప్రభుత్వం 2014 నుంచి పన్ను శ్లాబులను సవరించలేదు. ప్రస్తుతం రూ.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. రూ.10 లక్షల నుంచి అత్యధిక పన్ను రేటు శ్లాబు మొదలవుతుంది. ప్రభుత్వం ఈ శ్లాబ్ రేటును రూ.10 నుంచి 20 లక్షలకు పెంచాలని చాలామంది కోరుకుంటున్నారు. కొత్త పన్ను విధానంలో దీనిని రూ.15 నుంచి రూ.30 లక్షలకు మార్చాలని అంటున్నారు. కొవిడ్ ఇబ్బందులు తగ్గి ఎకానమీ పుంజుకుంటోంది. ఈ ప్రయోజనాలను పన్ను చెల్లింపు దారులకు బదిలీ చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
కనీస మినహాయింపు పెంపు!
ప్రస్తుతం సాధారణ పన్ను మినహాయింపు రూ.2.5 లక్షలు. వాస్తవంగా రూ.5 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. రిబేట్, స్టాండర్డ్ డిడక్షన్ వంటివి ఉండటమే కారణం. ఎలాగూ పన్ను చెల్లించేది లేనప్పుడు కనీస మినహాయింపును రూ.5 లక్షలకు పెంచితే సులభంగా ఉంటుందని విశ్లేషకులు వాదన. అప్పుడు పన్నుల లెక్కింపు సైతం సరళంగా మారుతుందని చెబుతున్నారు.