(Source: ECI/ABP News/ABP Majha)
Adani stocks: దూసుకెళ్లిన అదానీ షేర్లు, సడెన్‌గా ఎందుకీ లక్ష్మీకళ?
వరుసగా 9 ట్రేడింగ్ సెషన్లలో విపరీతంగా మొట్టికాయలు తిన్న అదానీ గ్రూప్ స్టాక్స్ యూటర్న్ తీసుకున్నాయి, ఇన్వెస్టర్ల ఆశీస్సులు అందుకుంటున్నాయి.
Adani stocks: నిన్నటి వరకు, వరుసగా లోయర్ సర్క్యూట్స్ కొట్టుకుంటూ వచ్చిన అదానీ గ్రూప్ స్టాక్స్‌లో (Adani Group stocks) ఇవాళ సీన్ రివర్స్ అయింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) నెగెటివ్ రిపోర్ట్ విడుదల చేసిన తర్వాత, వరుసగా 9 ట్రేడింగ్ సెషన్లలో విపరీతంగా మొట్టికాయలు తిన్న అదానీ గ్రూప్ స్టాక్స్ యూటర్న్ తీసుకున్నాయి, ఇన్వెస్టర్ల ఆశీస్సులు అందుకుంటున్నాయి.
అప్పర్ సర్క్యూట్స్‌లో అదానీ షేర్లు
ఇవాళ (మంగళవారం, 07 ఫిబ్రవరి 2023), అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises) భారీగా పెరిగి 20% అప్పర్ సర్క్యూట్ పరిమితిని తాకి ఆగిపోయింది, స్మార్ట్ రికవరీని ప్రదర్శించింది.
అదానీ పోర్ట్స్ 9% పైగా పెరిగి (Adani Ports) రూ. 597కి చేరుకుంది.
2022 డిసెంబర్ త్రైమాసికానికి అద్భుతమైన నంబర్లను ప్రకటించింది అదానీ ట్రాన్స్‌మిషన్ (Adani Transmission). ఈ కంపెనీ ఏకీకృత పన్ను తర్వాతి లాభం రూ. 478.15 కోట్లకు చేరింది, గత సంవత్సరం ఇదే కాలం కంటే (YoY) ఏకంగా 73% పెరిగింది. ఈ ఫలితాల తర్వాత, అదానీ ట్రాన్స్‌మిషన్ షేర్లు 5% పెరిగి, రూ. 1,324.45 వద్ద అప్పర్ సర్క్యూట్ బ్యాండ్‌లో లాక్ అయ్యాయి.
గత కొన్ని సెషన్‌లుగా లోయర్ సర్క్యూట్స్ కొడుతున్న NDTV షేర్లు కూడా U-టర్న్ తీసుకున్నాయి, 5% అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 225.35 వద్ద ఆగిపోయాయి.
అదానీ విల్మార్ (Adani Wilmar) షేర్ ప్రైస్ కూడా 5% అప్పర్ సర్క్యూట్‌లో రూ. 399.40 వద్ద నిలిచిపోయింది.
స్టాక్స్‌లో ఎందుకీ లక్ష్మీకళ?
అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్, అదానీ ట్రాన్స్‌మిషన్ కంపెనీల షేర్లను తాకట్టు పెట్టి గతంలో తీసుకున్న రుణాలను వెంటనే తీర్చేయాలని అదానీ గ్రూప్ ప్రమోటర్లు నిర్ణయించారు. నిజానికి ఆ షేర్లను తాకట్టు నుంచి విడిపించుకోవడానికి 2024 సెప్టెంబర్ వరకు గడువు ఉన్నా, స్టాక్ ధరల్లో పతనాన్ని అడ్డుకోవడానికి అప్పులు ముందే చెల్లించాలని డిసైడ్ అయ్యారు. మొత్తం 1.1 బిలియన్ డాలర్ల రుణాలను ప్రీపెయిడ్ చేస్తామని నిన్న ప్రకటించారు, ఇవాళ స్టాక్స్‌లో రికవరీ జరిగింది.
స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయిన మొత్తం 10 అదానీ స్టాక్స్‌లో రెండు - అదానీ టోటల్ గ్యాస్ (Adani Total Gas), అదానీ పవర్ (Adani Power) మాత్రమే ప్రస్తుతానికి రెడ్ జోన్‌లో ట్రేడ్ అవుతున్నాయి.
గత 9 ట్రేడింగ్ రోజుల్లో, అదానీ గ్రూప్‌లోని మొత్తం 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ (market capitalisation) రూ. 9.5 లక్షల కోట్లు లేదా 49 శాతం తగ్గింది.
'వాల్యుయేషన్ గురు' అశ్వత్ దామోదరన్ లెక్క ప్రకారం, ఇంత భారీ పతనం తర్వాత కూడా అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ ఇప్పటికీ హయ్యర్ వాల్యుయేషన్‌లోనే ఉంది. ఆయన చెబుతున్న ప్రకారం, రూ. 945 వద్దకు వస్తేనే అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ ధర సహేతకమైన విలువ వద్దకు చేరిందని భావించాలి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.